Covaxin approval : కోవాగ్జిన్‌కు అనుమతులపై ఆరోపణలను కొట్టిపారేసిన ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-11-17T17:33:01+05:30
కోవిడ్ టీకా కోవాగ్జిన్ (Covaxin)కు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఆదరాబాదరాగా అనుమతులు మంజూరు చేశారనే
న్యూఢిల్లీ : కోవిడ్ టీకా కోవాగ్జిన్ (Covaxin)కు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఆదరాబాదరాగా అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయని, పొరపాటు అభిప్రాయాల ఆధారంగా చేస్తున్నవని వ్యాఖ్యానించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ (Covaxin) స్వదేశీ టీకా అని తెలిపింది. దీనికి అనుమతుల మంజూరులో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు చెప్తున్నాయని పేర్కొంది. ఈ టీకా ప్రయోగ దశలో నిర్వహించవలసిన కొన్ని క్లినికల్ ట్రయల్స్‌ను రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా వేగవంతం చేశారని, కొన్ని ప్రక్రియలను నిర్వహించడం మానేశారని ఈ కథనాలు పేర్కొన్నాయని తెలిపింది. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాక్సిన్ సమర్థతను నిర్థరించేందుకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మూడు దశల్లో చాలా అక్రమాలు జరిగినట్లు మీడియా కథనాలు ఆరోపించాయి. ఈ మీడియా కథనాలు పూర్తిగా తప్పుదోవపట్టించేవిధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది. అవాస్తవ సమాచారం ఆధారంగా, తప్పుడు ఊహల ఆధారంగా ఈ మీడియా కథనాలను రాశారని పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతులను మంజూరు చేయడం కోసం భారత ప్రభుత్వం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సైంటిఫిక్ విధానాలను, నిర్ణీత నిబంధనలను అనుసరించినట్లు తెలిపింది.
సీడీఎస్‌సీఓ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ 2021 జనవరి 1, 2 తేదీల్లో సమావేశమైందని తెలిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధిపరచిన కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను అత్యవసర పరిమిత వినియోగ అనుమతి మంజూరు ప్రతిపాదనపై తగిన సమాలోచనలు జరిపిందని పేర్కొంది. తగిన స్థాయిలో పరిశీలించి, సమాలోచనలు జరిపిన తర్వాతే ఈ అనుమతులను మంజూరు చేసినట్లు తెలిపింది. కోవాగ్జిన్‌కు అత్యవసర పరిమిత వినియోగ అనుమతిని 2021 జనవరిలో మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ అనుమతిని మంజూరు చేయడానికి ముందు ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనా? వ్యాధినిరోధక శక్తి కలదేనా? అనే అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమీక్షించినట్లు తెలిపింది. ఈ సమీక్ష తర్వాతే ప్రజా ప్రయోజనం దృష్ట్యా అత్యవసర పరిస్థితిలో పరిమితంగా ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. క్లినికల్ ట్రయల్ మోడ్‌లో వ్యాక్సినేషన్ల కోసం, మరీ ముఖ్యంగా మ్యుటెంట్ స్ట్రెయిన్స్ సోకిన సందర్భాల్లో, ఎక్కువ ఆప్షన్స్ ఉండాలని తెలిపిందని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యలు సమృద్ధంగా ఉండటం కోసం దీనికి అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసిందని తెలిపింది.
మెసర్స్ భారత్ బయోటెక్ సమర్పించిన సైంటిఫిక్ డేటాతోపాటు, ఈ విషయంలో అమలులో ఉన్న నియమ, నిబంధనల ఆధారంగా ప్రతిపాదిత కోవాగ్జిన్ డోస్ మూడో దశ క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ‘అశాస్త్రీయ మార్పులు’ జరిగినట్లు మీడియా కథనాల్లో పేర్కొన్నారని, మెసర్స్ భారత్ బయోటెక్ విజ్ఞప్తుల తర్వాతే ఈ మార్పులు జరిగాయని తెలిపింది. ఇదంతా సీడీఎస్‌సీఓ నిర్దేశిత సముచిత ప్రక్రియలకు అనుగుణంగా జరిగిందని పేర్కొంది. దీనికి డీజీసీఐ (Drugs Controller General of India) అనుమతి ఉన్నట్లు తెలిపింది.
ఆ తర్వాత క్లినికల్ ట్రయల్ మోడ్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ వేయడానికి కండిషన్‌ను 2021 మార్చి 11న తొలగించినట్లు పేర్కొంది. సీడీఎస్‌సీఓ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమర్పించిన మధ్యంతర సమర్థత, రక్షణ సమాచార నివేదికతోపాటు, భారత్ బయోటెక్ చేసిన విజ్ఞప్తి మేరకు దీనిని తొలగించినట్లు తెలిపింది. కోవాగ్జిన్ సహా అన్ని కోవిడ్-19 వ్యాక్సిన్లకు మంజూరు చేసిన అత్యవసర పరిమిత వినియోగ అనుమతులను నేషనల్ రెగ్యులేటర్ మాత్రమే మంజూరు చేసిందని పేర్కొంది. సీడీఎస్‌సీవో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫారసుల ఆధారంగానే ఈ అనుమతులను ఇచ్చినట్లు తెలిపింది. పల్మనాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్, ఇంటర్నల్ మెడిసిన్ రంగాల్లో నిపుణులు ఈ కమిటీలో ఉన్నారని తెలిపింది.
Updated Date - 2022-11-17T17:33:05+05:30 IST