Congress twitter: కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. బెంగళూరు కోర్ట్ ఆదేశాలు..

ABN , First Publish Date - 2022-11-07T22:11:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీ (Congress), భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ట్విటర్ (Twitter) హ్యాండిల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ బెంగళూరులోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Congress twitter: కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్స్ బ్లాక్ చేయండి.. బెంగళూరు కోర్ట్ ఆదేశాలు..

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ (Congress), భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ట్విటర్ (Twitter) హ్యాండిల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ బెంగళూరులోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ భారత్ జోడో యాత్రలో కాపీ రైట్స్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ ఎంటీఆర్ మ్యూజిక్ (MTR Music company) కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మైక్రోబ్లాకింగ్ సైట్ ‘ట్విటర్’ను ఆదేశించింది.

ఎంటీఆర్ లేబుల్ ఉన్న కాపీరైట్ వర్క్, నిబంధనలు ఉల్లంఘించి రూపొందించిన రెండు పాటలూ సీడీ రూపంలో తమకు అందాయని కోర్టు తెలిపింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత ఇలాంటివాటిని ప్రోత్సహిస్తే సినిమాలు, పాటలు, మ్యూజిక్ అల్బమ్స్ హక్కులు దక్కించుకునే కంపెనీలకు పూడ్చలేని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించింది. పైరసీని కూడా ప్రోత్సహించినట్టవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర హ్యాండిల్స్ నుంచి మూడు లింకులను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్స్‌ను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.

కర్ణాటకలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో కేజీఎఫ్2 లోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను వాడారని, ఇది కాపీరైట్స్ నిబంధనల ఉల్లంఘనేనని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాపీరైట్స్ హక్కులు కలిగివున్న ఎంటీఆర్ మ్యూజిక్ (MTR Music) కంపెనీ కోర్టును ఆశ్రయించింది. కేజీఎఫ్2 హిందీ హక్కులు దక్కించుకునేందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని మ్యూజిక్ కంపెనీ తన పిటిషన్‌లో వెల్లడించింది.

స్పందించిన కాంగ్రెస్...

బెంగళూరు కోర్టు నిర్ణయంపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బెంగళూరు కోర్టుకు సంబంధించిన ఆదేశాలను సోషల్ మీడియాలో తెలుసుకున్నామని, కోర్టు ప్రొసీడింగ్స్‌పై తమకు అవగాహనలేదని, ఆర్డర్ ప్రతులు తమకు అందలేని తెలిపింది. చట్టపరంగా ముందుకెళ్తామని ట్విటర్ వేదికగా తెలియజేసింది. కాగా రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర సోమవారం తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

Updated Date - 2022-11-07T22:14:48+05:30 IST

Read more