Aaditya Thackeray: మధ్యంతర ఎన్నికలొస్తున్నాయ్..
ABN , First Publish Date - 2022-11-07T18:37:22+05:30 IST
ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో కుప్పకూలనుందని, మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని శివసేన..
ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే (Eknath shinde) సారథ్యంలోని ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లో కుప్పకూలనుందని, మధ్యంతర ఎన్నికలు (Mid term elections) రాబోతున్నాయని శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (Shiv Sena Uddhav balasaheb Thackeray) నేత ఆదిత్య థాకరే (Additya Thackeray) జోస్యం చెప్పారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అకోలా జిల్లాలో సోమవారంనాడు జరిగిన ర్యాలీలో ఆదిత్య మాట్లాడుతూ, షిండే హయాంలో మహారాష్ట్రకు రావాల్సిన నాలుగు ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని, దీంతో 2.5 లక్షల ఉద్యోగాలను రాష్ట్రం కోల్పోయిందని అన్నారు. "విద్రోహుల ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూలిపోవడం తథ్యం. మధ్యంతర ఎన్నికల దిశగా రాష్ట్రం పయనిస్తోంది'' అని ఆయన అన్నారు.
ఆదిత్య థాకరేను "చోటా పప్పూ'' అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ చేసిన విమర్శలను ఆదిత్య తిప్పికొట్టారు. ''నేను చోటా పప్పు కావచ్చు. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడమే నాకు ముఖ్యం. అందుకోసం ఎవరు ఎలా పిలిచినా పిలుచుకోవచ్చు. మహారాష్ట్రలో చోటా పప్పునే మిమ్మల్ని పరుగులు తీయిస్తాడు. ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు మీరు (శివసేనపై తిరుగుబాటు) చేసిన ద్రోహాన్ని ఏమాత్రం సహించరు'' అని ఆదిత్య అన్నారు. ముఖ్యమంత్రి షిండేనా, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిసా అనేది ఎవరూ చెప్పలేకున్నారని ఎద్దేవా చాశారు. అకాల వర్షాల కాలంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ సీజన్‌ను 'వెట్ డ్రాట్' సీజన్‌గా ప్రభుత్వం ప్రకటించాలని ఆదిత్య డిమాండ్ చేశారు.
Read more