Mandaviya: సిద్ధంగా ఉండాల్సిందే!.. రాష్ట్రాలతో కేంద్రం
ABN, First Publish Date - 2022-12-23T18:08:05+05:30
కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: కొవిడ్‌పై పోరుకు కేంద్రం రాష్ట్రాలను సన్నద్ధం చేస్తోంది. రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్‌గా సమావేశమై తాజా పరిస్థితిని, సన్నద్ధతను సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. టెస్ట్-ట్రాక్- ట్రీట్‌తో పాటు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయమందిస్తామని మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులకు హామీ ఇచ్చారు. కొవిడ్ 19పై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27న మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
ఆంగ్ల సంవత్సరాది వేడుకల నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
భారత్‌లో ప్రస్తుతం రోజుకు సగటున 153 కేసులే నమోదవుతున్నాయి. కేంద్రం ఇప్పటికే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది.
మరోవైపు చైనా సహా ప్రపంచ దేశాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కొవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని, ఔషధాల కొరత లేకుండా చూడాలని, మందుల ధరలపై నిఘా పెట్టాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భారత్‌లోనూ బీఎఫ్.7 వేరియంట్ వెలుగులోకి రావడం, పండుగల సీజన్‌లో వైరస్ వ్యాప్తికి అవకాశాలున్న నేపథ్యంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమీక్షలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్, మన్‌సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాల్లో కొవిడ్ కేసుల పరిస్థితి, మన దేశంలో సన్నద్ధత తదితర అంశాలపై అధికారులు ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో వారం రోజుల్లో రోజువారీ కేసుల సగటు 153గా ఉందని, వారం రోజుల పాజిటివిటీ రేటు 0.14 శాతానికి పడిపోయినట్లు వివరించారు. ఆరు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 5.9లక్షల మేర నమోదవున్నట్లు తెలిపారు. విదేశీ ప్రయాణికులకు స్ర్కీనింగ్ టెస్టులను పెంచాలని, కొవిడ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు. వృద్ధులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయంలో.. ప్రికాషనరీ డోసులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సన్నద్ధంగా ఉండాలని, ఆస్పత్రుల్లో వనరులను, ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తగినన్ని ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించారు. కొవిడ్ ఇంకా పోలేదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. పండుగల సీజన్, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో నిరంతర అప్రమత్తత అవసరమని, ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు మాస్కుల ధారణ తప్పనిసరి అని, కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రజలకు సూచనలిచ్చారు.
Updated Date - 2022-12-23T18:46:44+05:30 IST