Assam : 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు...
ABN, First Publish Date - 2022-11-27T15:08:30+05:30
అస్సాంలోని చరైడియో జిల్లాలో శనివారం నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పంపిణీ చేసిన మాత్రలు వికటించడంతో
గువాహటి : అస్సాంలోని చరైడియో జిల్లాలో శనివారం నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పంపిణీ చేసిన మాత్రలు వికటించడంతో దాదాపు 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆరోగ్య శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చరైడియో జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు శనివారం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత వాటిని విద్యార్థులు తిన్నారు. అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని రెండు పాఠశాలల నుంచి ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం అందింది. ఈ రెండు పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇద్దరు చొప్పున తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పి, వాంతులు చేసుకున్నట్లు సమాచారం వచ్చింది. వారిని వెంటనే సోనారీ సివిల్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత మరో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మొత్తం మీద 52 మంది విద్యార్థులను ఆసుపత్రి నుంచి ఇళ్ళకు పంపించినట్లు ఆరోగ్య శాఖాధికారులు చెప్పారు.
పట్సకు బ్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బటావు ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేశారు. ఖేరనిపత్తర్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 75 మంది విద్యార్థులకు మొదట ఇచ్చారు. ఆ తర్వాత నిమలియా లోయర్ ప్రైమరీ స్కూల్‌లో 26 మందికి ఈ మాత్రలను పంపిణీ చేశారు.
పాఠశాల నిర్వహణ కమిటీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖాధికారులు ముందుగా తమకు తెలియజేయలేదన్నారు.
Updated Date - 2022-11-27T15:08:35+05:30 IST