AAP Vs BJP: సత్యేంద్ర జైన్‌కు జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్‌పై ఆప్ ఏమందంటే..?
ABN, First Publish Date - 2022-11-19T16:33:05+05:30
ఆప్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంపై ఆ పార్టీ తొలిసారి..
న్యూఢిల్లీ: ఆప్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyender jain)కు జైలులో వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంపై ఆ పార్టీ తొలిసారి స్పందించింది. సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్యం బాగోలేదని (Unwell) తెలిపింది. శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) మాట్లాడుతూ, జైలులో అనారోగ్యంతో ఉన్న నేతను పరిహసించడం ద్వారా గుజరాత్, ఎంసీడీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ అనుకుంటోందని విమర్శించారు.
సత్యేంద్ర జైన్ రెండు సర్జరీలు చేయించుకున్న తర్వాత రెగ్యులర్‌గా ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారని, ఇందుకు సంబంధించిన వీడియో లీక్ కావడం అసాధారణ విషయమేమీ కాదని సిసోడియా అన్నారు. సత్యేంద్ర జైన్‌ను అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలను కూడా ఆయన తోసిపుచ్చారు.
''జబ్బుపడిన ఒక వ్యక్తిని దేశంలోని ఏ పార్టీ కూడా ఇంతవరకూ పరిహసించిన చరిత్ర ఉందని నేను అనుకోవడం లేదు. ఎవరికైనా అనారోగ్యం రావచ్చు. ప్రధాని కూడా అనారోగ్యం బారిన పడవచ్చు, చికిత్స అవసరం కావచ్చు. జైలులో ఉన్న సాధారణ వ్యక్తి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్లు కూడా అనారోగ్యం పాలవుతుంటారు. అలాంటి వారికి ఇచ్చే చికిత్సకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసే చీఫ్ స్టంట్ బీజేపీ మినహా ఇంకెవరూ చేయరు'' అని సిసోడియా అన్నారు. సత్యేంద్ర జైన్ 6 నెలలుగా జైలులో ఉన్నారని, ఆయన జైలుకు వెళ్లడానికి ముందు కింద పడి L5-S1 డిస్క్ దెబ్బతిందని తెలిపారు. ఇది రికార్డుల్లో కూడా ఉందని చెప్పారు. నెర్వ్ పించ్ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరడంతో అక్కడ రెండు సర్జరీలు కూడా జరిగాయని తెలిపారు. నెర్వ్ బ్లాక్‌లు ఇన్‌సర్ట్ చేశారని, వాటితో పాటు ఆయనను డిశ్చార్జి చేసేటప్పుడు కూడా వైద్యులు ఫిజియోథెరఫీకి సిఫారసు చేశారని సిసోడియో వెల్లడించారు. జైలు సెల్‌లో ఇతర వ్యక్తులను కలవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, జైలులో ఒకరినొకరు కలుసుకోరాదనే ఆంక్షలు లేవని, పసలేని ప్రచారం చేసే ముందు జైల్ నిబంధనావళిని చదవాలని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు.
Updated Date - 2022-11-19T16:35:48+05:30 IST