Actress Sridevi Ashok: ఆడపిల్లలు బేలగా ఉండకూడదు
ABN, First Publish Date - 2022-11-19T15:38:11+05:30
శ్రీదేవికి వంట చేయడం ఇష్టమైన హాబీ.
* నటనలో దూసుకుపోతున్న శ్రీదేవి
* టీవీ, సినిమా రంగాల్లో రాణింపు
ఉన్నత విద్యావంతురాలైనా, ఉద్యోగావకాశాలు వరించినా, యాధృచ్ఛికంగా తన చెంతకు వచ్చిన అవకాశాన్ని అక్కున చేర్చుకున్న ఆమె అదొక సవాలుగా భావించారు. అంతేకాదు, ఆర్ధిక స్వావలంబనతో బాటు పేరు ప్రతిష్టలు, గుర్తింపు కలిగించే చిత్రపరిశ్రమకు ఆమె ‘ఫిదా’ అయ్యారు. ఆర్ధికంగా ఎదగలేనప్పుడు చేతిలో డిగ్రీలున్నాయన్న ధైర్యం ఆమెను ముందుకు నడిపించడంతో చిత్రరంగ ప్రవేశం చేసి.., టెలివిజన్ రంగంలో స్థిరపడ్డారు. ఆమె నేటి మన ‘తరుణి’ శ్రీదేవి అశోక్. తెలుగులో ‘కాశీమజిలీకథలు’ వీక్లీ సీరియల్ లో నటించారు. ‘అమ్మాయి కాపురం’, ‘అలా మొదలైంది’ తదితర తెలుగు సీరియళ్లలో కూడా శ్రీదేవి నటించింది. తమిళ ఛానళ్లలో దాదాపు 30 సీరియల్స్‌లో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఐదు సీరియల్స్‌లో ‘బెస్ట్ సపోర్టింగ్ నటిగా’ అవార్డులు కూడా అందుకున్నారు. ఎంచుకున్న రంగంలో సత్తా చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్న వర్ధమాన బుల్లితెర నటి ‘శ్రీదేవి’ నటనా ప్రస్ధానం ఈనాటి ‘తరుణి’లో....
నటిగా ప్రస్ధానం..
తల్లి రూప డబ్బింగ్ ఆర్టిస్టుగా, డాన్సర్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా పలు భూమికలు నిర్వహించారు. ‘అమ్మాయి కాపురం’, ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అలా మొదలైంది’ మొదలైన టీవీ సీరియల్స్‌లో ఆమె నటించారు. తల్లి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది శ్రీదేవి. 12వ తరగతిలోనే నటనకు నాంది పలికింది. పాఠశాల విద్య సమయంలోనే తమిళ సినిమాలో హీరో ధను్‌షకి చెల్లెలి పాత్రలో అవకాశం వచ్చింది. తన అభిమాన హీరోతో నటించేందుకు అవకాశం రాగానే వెంటనే అంగీకరించి ధనుష్ తో రెండు చిత్రాలలో నటించి ఆపై చదువు కొనసాగించారు. ఎంబీఏ పూర్తికాగానే ఉద్యోగంలో చేరేందుకు నెల గడువు ఉండడంతో, ఆ సమయంలో అనుకోకుండా వచ్చిన అవకాశంతో టీవీ సీరియల్‌లో నటించేందుకు అంగీకరించడంతో వెంటవెంటనే తమిళ టీ.వీలో అవకాశాలు తలుపుతట్టడం ప్రారంభించాయి. ఇదే వృత్తిగా కొనసాగించాలని నిశ్చయించుకొని బుల్లితెర/వెండితెరలో నటనా ప్రస్థానం ఆరంభించారు. ఒకవేళ అవకాశాలు తగ్గినా, చేతిలోని డిగ్రీలతో మంచి ఉద్యోగం సంపాదించుకోగలనన్న ధీమాతో నటనే వృత్తిగా స్వీకరించి నటనా ప్రస్ధానాన్ని నడిపిస్తున్న విద్యాధికురాలు, బుల్లి తెర నటి శ్రీదేవి అశోక్.
శ్రీదేవి తల్లిదండ్రులు రూప, సెల్వరాజ్. ఆమె పుట్టి పెరిగింది, చదివింది చెన్నై నగరంలోనే. తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె ఆమె. న్యూట్రిషన్ ప్రధానాంశంగా అన్నా ఆదర్శ్ కాలేజీలో బీఎస్సీ చదివి ఆపై అన్నా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. అయినా చదువుపై తృష్ణ తీరక మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ ప్రధానాంశంగా ఎమ్మెస్సీ లింగ్విస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీలు తీసుకున్నారు. ఎంబీఏ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చినా, అదే సమయంలో యాధృచ్ఛికంగా వచ్చిన బుల్లితెర అవకాశాలపై మొగ్గుచూపి నటనలో తన సత్తా చాటాలని భావించి ఆ రంగంలో దూసుకుపోతున్నారు.
శ్రీదేవి నటించిన చిత్రాలు:
2004వ సంవత్సరంలో ‘పుదుకోట్టై ఇలిరున్దు’ ఆమె మొదటి తమిళ చిత్రం. 2006వ సంవత్సరంలో ‘కిళక్కు కడల్‌కరై సాలై’ సినిమాలో ‘దేవి’గా నటించి, ‘మానాడా మాయిలాడా’ కలైంగర్ టి.వీలో డాన్స్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. పలు తమిళ సీరియళ్లలో నటించిన శ్రీదేవి ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది. సీరియళ్లు కానీ సినిమాల్లో కానీ ఒక దృఢమైన వ్యక్తిత్వంగల స్త్రీ పాత్రలో నటించాలన్నది తన కోరిక అని శ్రీదేవి వెల్లడించారు.. తన పాత్ర ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలవాలన్నదే తన ఆశయం అని చెప్పింది ఈ వర్ధమాన కళాకారిణి.
ఆడపిల్లలు బేలగా ఉండకూడదు. మగవారితో సమానంగా ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దృఢమైన వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు, నచ్చిన విధానంలో, ఇష్టమైన వృత్తిలో కొనసాగాలి. స్త్రీ పురుషులిరువురికి విద్య చాలా ముఖ్యమైనది. స్త్రీలు ఎన్నో కారణాలతో చదవాలన్న అభిలాష ఉన్నా, కుటుంబ పరిస్థితుల వల్ల చదువు కొనసాగించలేకపోతున్నారు. కాని ఆర్ధిక స్వావలంభనకు, వ్యక్తిత్వ వికాసానికి స్త్రీలకు విద్య ఎంతో అవసరం. స్త్రీలకు కూడా ఆర్ధిక స్వేచ్ఛ ఉండాలి. నా విద్యార్హతలనుపయోగించుకొని భవిష్యత్తులో ఒక వ్యాపారవేత్తను కావాలన్నది నా ఆశయం’’ అని శ్రీదేవి ‘తరుణి’తో తన అనుభవాలు పంచుకున్నారు.
కుటుంబం:
శ్రీదేవి భర్త అశోక్ చింతల. ఈ దంపతులకు ఒక కుమార్తె. భర్త సహాయ సహకారాలతో తన వృత్తిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీదేవి.
అభిరుచులు :
డాన్స్‌పై మక్కువ కలిగిన శ్రీదేవి బాల్యంలోనే భరతనాట్యం నేర్చుకున్నారు.. ‘కళైంగర్’ టి.వీలో డాన్స్ షోలు చేయడమే కాకుండా తమిళ ఛానళ్లు కొన్నింటిలో డాన్స్ షోల్లో కూడా పాల్గొన్నారు. శ్రీదేవికి వంట చేయడం ఇష్టమైన హాబీ. నటనలోనే కాదు, పాక శాస్త్రంలో కూడా ప్రావీణ్యురాలే.
-వేళచ్చేరి
Updated Date - 2022-11-19T16:30:07+05:30 IST