Tiruppavai: జరిగిపోయిన తప్పులూ... జరగబోయే తప్పులూ ఏమవుతాయి?
ABN, First Publish Date - 2022-12-19T20:45:47+05:30
తిరుమాల్ అన్న తమిళ్ష పదానికి విష్ణువు అని అర్థం. ఈ తిరుమాలన్ పదం తిరుమాయన్ అయిందని అదే మాయన్ అయిందని చెబుతారు...
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఐదోరోజు; తిరుప్‌పావై ఐదో పాసురమ్ రోజు.
పాసురమ్ 05
ఆణ్డాళ్ ఐదోపాసురమ్‌లో కృష్ణుణ్ణి మనసారా ధ్యానిస్తే ఏమౌతుందో తెలియజెబుతోంది...
మూలం-
మాయనై, మన్ను వడమదురై మైన్దనై,
తూయపెరునీర్ యమునైత్ తుఱైవనై,
ఆయర్ కులత్తినిఱ్ తోన్ఱుమ్ అణివిళక్కై,
తాయైక్ కుడల్ విళక్కఞ్‌సెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దు, నామ్ తూమలర్ తూవిత్తోళ్షుదు,
వాయినాఱ్ పాడి, మనత్తినాఱ్ సిన్దిక్కప్
పోయ పిళ్షైయుమ్ పుగుదరువాన్ నిన్ఱనవుమ్
తీయినిఱ్ దూసాగుమ్ సెప్పేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
నల్లనివాణ్ణి, కొలువై ఉన్న మథురానాథుణ్ణి,
పవిత్రజలాల యమునాతటివాణ్ణి,
గోకులంలో వెలిసిన దివ్యదీపాన్ని,
కన్నతల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన దామోదరుణ్ణి
శుచిగా వచ్చి, స్వచ్ఛమైన పూలు చల్లి ప్రార్థించి,
నోరారా గానం చేసి, మనసారా ధ్యానిస్తే
జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ
మంటల్లో దూదిపింజలై పోతాయి అని అందాం; ఓలాల నా చెలీ!
అవగాహన-
"నల్లనివాణ్ణి" అని అంటూ ఆణ్డాళ్ కృష్ణుణ్ణి తెలియజేస్తోంది. తమిళ్షపదం 'మాయన్'. మాయన్ అంటే మాయదారి అని కాదు. మాయన్ అనడం మాయను సూచించడం కాదు. మాయన్ అంటే నల్లనివాడు అని. పెరియ ఆళ్ష్వార్ ఒక సందర్భంలో కృష్ణుణ్ణి "ఇవన్ ఆయన్ అల్ల మాయన్" అని అన్నారు. అంటే వీడు గొల్లవాడు కాదు నల్లవాడు అని. అలా అంటూ కృష్ణుణ్ణి 'వీడు విష్ణువు' అని సూచించారు. తిరుమాల్ అన్న తమిళ్ష పదానికి విష్ణువు అని అర్థం. ఈ తిరుమాలన్ పదం తిరుమాయన్ అయిందని అదే మాయన్ అయిందని చెబుతారు.
"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్" అని మన పోతన అన్నారు కదా.
నల్లని రూపం కలవాడు అనే అర్థాన్ని ఇస్తూ కృష్ణుడికి శ్యామరూపః, కృష్ణవర్ణః వంటి నామాలు ఉన్నాయి.
"కన్నతల్లి కడుపుకు కీర్తిని తెచ్చిన..." అని అనడం అద్వితీయమైన అభివ్యక్తి; ఆణ్డాళ్ మాత్రమే చెయ్యగల అభివ్యక్తి.
ఈ పాసురమ్‌లో "జరిగిపోయిన తప్పులూ, జరగబోయే తప్పులూ మంటల్లో దూదిపింజలై పోతాయి..." అని ఆణ్డాళ్ చెప్పడం విశిష్టంగా ఉంది. ఇక్కడ ఆణ్డాళ్ ఇలా తప్పులు కాలి బుడిదవాలని కాకుండా మఱింకదేన్నైనా చెప్పి ఉండచ్చు. తప్పులు ఉండకూడదు అనే భావనతో ఈ మాటల్ని చెప్పింది ఆణ్డాళ్. ఇది అత్యుదాత్తమైన భావన. ఈ భావన మహోన్నతమైన మానసికపరిణతికి ఋజువు. జరిగిపోయిన తప్పులు మనందఱికీ పెనుహాని చేస్తూనే ఉన్నాయి; జరగబోయే తప్పులు తప్పకుండా మనకు పెనుహాని చేస్తాయి. కాబట్టి ఆ తప్పులు కాలి బూడిదై లేకుండాపోయి మనం మేలుగానూ, క్షేమంగానూ బతకాలి; తథాస్తు.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2022-12-20T07:34:52+05:30 IST