ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: పెరుగు, నెయ్యి గురించి ఆణ్డాళ్... అన్నమయ్య...

ABN, First Publish Date - 2022-12-21T19:31:49+05:30

అవే మనలోంచి మనల్ని లేపగలవేమో?... మనం మన యాంత్రికత నుండి మేలుకోవడానికి అవే అత్యవసరమైనవేమో?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఏడోరోజు; తిరుప్‌పావై ఏడో పాసురమ్ రోజు.

పాసురమ్ 07

ఆణ్డాళ్ ఏడో పాసురమ్‌లో మొద్దు నిద్రపోతున్న గోపకన్యను మేలుకోమంటోంది; పక్షులు బారులుగా చేరడం, గాజుల గలగలలు, పెరుగు చిలుకుతున్న చప్పుళ్లతో, చక్కటి చిత్రణతో ఒకప్పటి పల్లె దృశ్యాన్ని ఈ పాసురమ్ మనకు రుచి చూపిస్తోంది; ఇదిగో ఇలా ...

మూలం-

కీసు కీసెన్ఱెఙ్గుమ్ ఆనైచ్చాత్తన్ కలన్దు

పేసిన పేచ్చరవమ్ కేట్టిలైయో? పేయ్‌ప్‌పెణ్ణే!

కాసుమ్ పిఱప్పుమ్ కలకలప్పక్ కైపేర్తు

వాస నఱుఙ్‌కుళ్షల్ ఆయ్‌చ్చియర్ మత్తినాల్

ఓసై పడుత్త తయిర్ అరవఙ్‌కేట్టిలైయో?

నాయగప్ పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్తి,

కేసవనైప్ పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో?

తేసమ్ ఉడైయాయ్! తిఱవేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

కిచకిచమంటూ అంతటా భరద్వాజపక్షులు బారులుగా చేరి

పలికిన పలుకుల చప్పుళ్లు వినిపించడం లేదా? మతిమాలినదానా!

కాసులపేరులు, గాజులు గలగలమనేట్టుగా చేతుల్ని ఆడిస్తూ

కేశాలు పరిమళించే గోపస్త్రీలు కవ్వంతో

మోత మోగేట్టుగా చిలుకుతూంటే పెరుగు చప్పుడు వినిపించడం లేదా?

రాణమ్మా ! ఆడపిల్లా! నారాయణమూర్తీ,

కేశవా అని పాడుతున్నా విని పడుకున్నావా?

తేజస్వినీ! తలుపు తియ్యి; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఈ పాసురమ్‌లో "పెరుగు చిలుకుతున్న చప్పుడు" అని ఆణ్డాళ్ అన్నది విన్నాక...

"ఘుమ్మనియెడి శ్రుతి గూఁడఁగను

కమ్మని నేతులు కాఁగఁగఁ జెలఁగె"

అని అన్న అన్నమయ్య మాటలు కూడా తలపుకు వస్తున్నాయి. నెయ్యి కాగే శబ్దానికి ఘుమ్మనడం అనేది శ్రుతి అయిందని గొప్పగా చెప్పారు‌ అన్నమయ్య. నెయ్యి కాగే శబ్దాన్ని అన్నమయ్య ముచ్చటిస్తే ఆణ్డాళ్ పెరుగు చిలికే శబ్దాన్ని ముచ్చటిస్తోంది. "వాడే వేంకటేశుడనే వాడే వీడు" సంకీర్తన రెండో చరణంలో అన్నమయ్య...

"పెరియాళువారి బిడ్డ పిసికి

విరుల దండల మెడవేసిన వాడు"

అంటూ ఆణ్డాళ్ ప్రస్తావన చేశారు. అంతేకాకుండా...

"చూడరమ్మ సతులాల సోబాన బాడరమ్మ కూడుకున్నది పతిఁ జూడి కుడుత నాచారి" అనీ...

"ఎంత చనువిచ్చితివో యీపై నీపై వెదజల్లీ

కొంతపు జూపుల చూడి కొడుత నాచారి" అనీ...

మొదలయ్యే రెండు సంకీర్తనల్ని పూర్తిగా ఆణ్డాళ్ గుఱించే నినదించారు అన్నమయ్య. అన్నమయ్య కాలానికే ఆణ్డాళ్ ఊసు తెలుగులో తిరుగాడుతూ ఉండేదని తెలుస్తోంది. తమిళ్షభాషలో 'సూడిక్కొడుత్త నాచ్చియార్' అంటారు. దాన్ని "చూడి కుడుత నాచారి" అని అన్నారు అన్నమయ్య. సూడిక్కొడుత్త నాచ్చియార్ అంటే ఆముక్తమాల్యద అనే అర్థం.

భరద్వాజ పక్షుల కిచకిచలు, కాసుల పేర్ల, గాజుల గలగలలు, కవ్వంతో పెరుగు చిలికితే వచ్చే చప్పుళ్లూ మనకు ఎప్పటికీ కావాల్సినవే. అవే మనలోంచి మనల్ని లేపగలవేమో? మనం మన యాంత్రికత నుండి మేలుకోవడానికి అవే అత్యవసరమైనవేమో?

"నారాయణమూర్తీ, కేశవా అని పాడుతున్నా వినిపడుకున్నావా?" ‌అని ఆణ్డాళ్‌ అన్నది మనలో ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి కూడా. భగవన్నామాలు ఎంతగా వినిపిస్తున్నా మనం మొద్ధు నిద్రలోంచి లేవడం లేదు. మనకు దైవచైతన్యం రావడం లేదు. అందుకే ఆణ్డాళ్ "తలుపు తియ్యి" అంటోంది. తలుపు తియ్యడమంటే మూసుకుని ఉన్న మన మనసుల తలుపులు తెఱవమని చెప్పడమే. ఆణ్డాళ్ మాటల్ని విందాం. మనమూ మనసుల తలుపులు తెఱుద్దాం.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన....

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-22T07:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising