ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppavai: కృష్ణుడు ఆ గుఱ్ఱం నోటిని ఏం చేశాడంటే...

ABN, First Publish Date - 2022-12-22T21:51:15+05:30

తెల్లవారుజామున లేవని వాళ్లకు ఆణ్డాళ్ ఎలా చురక వేసిందో తెలుసుకోవాలంటే తిరుప్‌పావైలోని ఈ పాసురాన్ని తప్పక పారాయణ చెయ్యాల్సిందే... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన.... రోచిష్మాన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో‌ తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి‌ ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం ఎనిమిదోరోజు; తిరుప్‌పావై ఎనిమిదో పాసురమ్ రోజు.

పాసురమ్ 08

ఆణ్డాళ్ ఎనిమిదో పాసురమ్‌లో స్నానానికి రాకుండా నిద్రపోతున్న గోపకన్యను నిద్రలేపుతూ లేచి ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఇలా తెలియజెబుతోంది...

మూలం-

కిళ్ష్‌వానమ్ వెళ్ళెన్‌న్ఱెరుమై సిఱువీడు

మేయ్ వాన్ పరన్దన కాణ్; మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్

పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తున్నైక్

కూవువాన్ వన్దునిన్ఱోమ్; కోదుగలముడైయ

పావాయ్! ఎళ్షున్దిరాయ్; పాడిప్ పఱైకొణ్డు

మావాయ్ పిళన్దానై, మల్లరై మాట్టియ

దేవాదిదేవనైచ్ చెన్ఱు నామ్ సేవిత్తాల్

ఆవావెన్ఱారాయ్‌న్దరుళేలోరెమ్‌పావాయ్!

తెలుగులో-

తూర్పు ఆకాశం తెల్లబడి ఎద్దులు కాసేపు

మేసేందుకు వెళ్లాయి చూడు; తతిమ్మా అమ్మాయిలు

వెళ్లబోతున్నా వాళ్లను వెళ్లకుండా ఆపి నిన్ను

పిలుచుకెళ్లేందుకు వచ్చి నుంచున్నాం; కుతూహలమున్న

కోమలీ! మేలుకో; పాడి, తప్పెటను పొంది

గుఱ్ఱం నోరును చీల్చేసిన వాణ్ణి, మల్లుల్ని చంపిన

దేవాది దేవుణ్ణి దగ్గఱకెళ్లి మనం నమస్కరిస్తే

ఆహా అని సమీక్షించి కనికరిస్తాడు; ఓలాల నా చెలీ!

అవగాహన-

ఈ పాసురమ్‌లో తెల్లవారుజామున లేవని వాళ్లకు చురక వేసేందుకు ఎద్దులు కూడా తెల్లవారు జామున లేచి మేతకు వెళ్లాయి అని అంటోంది ఆణ్డాళ్.

కేశి అనే రాక్షసుడు గుఱ్ఱం రూపంలో తనను చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ గుఱ్ఱం నోరును చీల్చేసి మట్టుపెడతాడు. ఆ విషయాన్ని "గుఱ్ఱం నోరును చీల్చిన..." అనీ, తనను చంపడానికి వచ్చిన చాణూర మల్లుణ్ణీ ఆ తరువాత కంసుణ్ణీ కృష్ణుడు చంపేస్తాడు. ఆ విషయాన్ని "మల్లుల్ని చంపిన" అనీ ఆణ్డాళ్ చెబుతోంది. "కంస, చాణూర మర్దనం" అని కృష్ణాష్టకంలో ఉన్నదాన్ని గుర్తు చేసుకుందాం. కృష్ణుడికి మహామల్లః అనే నామం ఉంది.

భగవద్గీత (అధ్యాయం 9 శ్లోకం 22)లో

"అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం"

అని కృష్ణుడు‌ చెబుతాడు. అంటే మఱో చింతన లేకుండా నన్నే బాగా ఉపాసించే వాళ్లు ఎవరో ఆసక్తి కల ఆ జనుల యోగాన్నీ, క్షేమాన్నీ నేను వహిస్తాను అని అర్థం. ఆ భావాన్నే "దేవాది దేవుణ్ణి దగ్గఱికెళ్లి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు" అని చెబుతోంది ఆణ్డాళ్.

ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్

తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి

రోచిష్మాన్

9444012279

Updated Date - 2022-12-24T21:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising