Tiruppavai: మూగదా లేక చెవిటిదా? మత్తులో ఉందా?
ABN, First Publish Date - 2022-12-23T22:47:10+05:30
ఇలాంటి పరిస్థితిని గ్రహించకుండా నిద్రపోతున్నావా? అని ఆణ్డాళ్ మెత్తగా తిడుతోంది... ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం తొమ్మిమిదోరోజు; తిరుప్‌పావై తొమ్మిమిదో పాసురమ్ రోజు.
పాసురమ్ 09
ఆణ్డాళ్ తొమ్మిదోపాసురాన్ని నిద్రపోతున్న గోపకన్యను లేపడానికి ప్రయోగిస్తోంది; ఇదిగో ఇలా...
మూలం-
తూమణి మాడత్తుచ్ చుఱ్ట్రుమ్ విళక్కెరియ,
దూబమ్ కమళ్షత్ తుయిలణైమేర్ కణ్‌వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్‌తిఱవాయ్;
మామీర్! అవళై ఎళ్షుప్పీరో? ఉన్‌మగళ్‌తాన్
ఊమైయో వన్ఱిచ్ చెవిడో? అనన్దలో?
ఏమప్‌పెరున్తుయిల్; మన్దిరప్పట్టాళో?
మామాయన్, మాదవన్, వైకున్దన్ ఎన్ఱెన్ఱు
నామమ్ పలవుమ్ నవిన్ఱేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
పవిత్రమైన రతనాల మేడలో చుట్టూ ఉన్న దీపాలు వెలుగుతూండగా,
ధూపం వ్యాపించి ఉండగా పరుపుపై నిద్రపోతున్న
మామకూతురా! రతనాల తలుపు గొళ్లెం తియ్యి;
అత్తా! తనను లేపవా? మీ అమ్మాయేమైనా
మూగదా లేక చెవిటిదా? మత్తులో ఉందా?
పిచ్చి నిద్ర; మంత్రానికి పడిపోయిందా?
మానల్లనివాడు, మాధవుడు, వైకుంఠవాసి అని అంటూ, అంటూ
నామాలు చాలచెబుతూ లేచి రాని; ఓలాల నా చెలీ!
అవగాహన-
ఈ పాసురమ్‌లో "పవిత్రమైన రతనాల మేడలో చుట్టూ ఉన్న దీపాలు వెలుగుతూండగా" అనడం ఈ లోకంలో సత్యాలు రత్నాలై కాంతులీనుతూ ఉన్నాయి అనడానికి ప్రతీకగానూ, "ధూపం వ్యాపించి ఉండగా" అనడం లోకంపై దైవం వ్యాపించి ఉంది అనడానికి ప్రతీకగానూ చెప్పినట్టు తోస్తోంది. ఇలాంటి పరిస్థితిని గ్రహించకుండా నిద్రపోతున్నావా? అని మెత్తగా తిడుతోంది ఆణ్డాళ్.
మానల్లనివాడు (మామాయన్) అనడం మహావిష్ణువును సూచిస్తోంది (మాయన్ అంటే విష్ణువు, మామాయన్ అంటే మహావుష్ణువు).
ఆ గోపకన్య మాత్రమే కాదు మనమూ పిచ్చి నిద్రలోనే ఉన్నాం. దైవనామాలు చెబుతూ మనం నిద్రలేవాలి. దైవనామాలు విని కూడా నిద్రపోతున్నావా అని ఒకసారి (పాసురమ్ 7లో) అన్న తరువాత దైవనామాల్ని అంటూ నిద్రలేవాలి అని ఇక్కడ తెలియజేస్తోంది ఆణ్డాళ్.
నామోచ్చరణ మనల్ని దైవం వైపు నడిపించే తొలి అడుగు. "తస్యవాచకః ప్రణవః" అంటే పరమాత్మకు పేరు ప్రణవం అని ఒక పతంజలి యోగసూత్రం (సూత్రం 27)మనకు తెలియజేస్తోంది. నామం లేదా వాచకం మనకు దైవాన్ని స్ఫురింపజేస్తుంది. అందుకే దైవనామాల్ని అనమని అంటోంది ఆణ్డాళ్.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2022-12-24T21:45:57+05:30 IST