Tiruppavai: మనలో ఎన్నెన్నో ఉష్ణాలు... అవన్నీ చల్లబడాలంటే?
ABN, First Publish Date - 2022-12-27T22:51:42+05:30
దైవచింతనలో మునగడానికి ముందుగా దేన్ని వదిలేయ్యాలి?.. ఆణ్డాళ్ తిరుప్‌పావై తమిళ్ష మూలంలోని శైలితో, శిల్పంతో తెలుగులో అనువాదం, అవగాహన... రోచిష్మాన్
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం పదమూడోరోజు; తిరుప్‌పావై పదమూడో పాసురమ్ రోజు.
పాసురమ్ 13
ఆణ్డాళ్, నిద్రలేచి నోము చేసుకునేందుకు తమతో కలిసి రమ్మంటూ పదమూడోపాసురమ్ గా గోపకన్యతో ఇంకా ఇలా అంటోంది...
మూలం-
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లా అరక్కనైక్
కిళ్ళిక్ కళైన్దానైక్ కీర్తిమై పాడిప్‌పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుమ్ పావైక్ కళమ్ పుక్కార్;
వెళ్ళి ఎళ్షున్దు వ్యాళ్షమ్ ఉఱఙ్గిఱ్ట్రు;
పుళ్ళుమ్ సిలంబిన కాణ్; పోదరిక్ కణ్ణినాయ్!
కుళ్ళక్ కుళిరక్ కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్‌న్దు కలన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
పక్షి నోటిని చీల్చి దుష్టరాక్షసుణ్ణి
నఱికేసినవాడి కీర్తిని పాడుకుంటూ
కన్యలందఱూ నోము నోచుకునే చోటుకెళ్లిపోయారు;
శుక్రుడు లేచి, గురువు నిద్రపోయాడు;
పక్షులు కూడా కిచకిచలాడుతున్నాయి చూడు; పూసొగసుల కళ్లదానా!
కడుచల్లబడేట్లుగా మునిగి స్నానం చెయ్యకుండా
పడుకుని ఉన్నావా? కోమలీ! నువ్వు శుభదినం కాబట్టి
కపటాన్ని విడిచి మాతో కలిసిరా; ఓలాల నా చెలీ!
అవగాహన-
దుష్టరాక్షసుడు ఒకడు బకం లేదా కొంగ రూపంలో (బకాసురుడు) తనను చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఆ పక్షి నోటిని చీల్చి చంపేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ఆణ్డాళ్ "పక్షి నోటిని చీల్చి దుష్ట రాక్షసుణ్ణి నఱికేసినవాడి ... " అని చెబుతోంది. ఏ రూపంలో వచ్చినా రాక్షసత్వాన్ని దైవం సంహరిస్తుందని ఆణ్డాళ్ చెబుతూనే ఉంది.
"శుక్రుడు లేచి, గురువు నిద్రపోయాడు" అని ఆణ్డాళ్ అనడం ఒక అరుదైన ఖగోళ సంఘటన గుఱించి అని అనుకోబడుతోంది. వ్యావహారిక శకానికి పూర్వం 550లోనూ, వ్యావహారిక శకం 447లోనూ ఈ శుక్రగ్రహం రావడం, గురుగ్రహం మరుగవడం అనే ఖగోళ సంఘటన జరిగినట్లు చెబుతారు.
పొదిగై ఆళ్ష్వార్, బూదత్తు ఆళ్ష్వార్, పేయ్ ఆళ్ష్వార్ ఈ ముగ్గురూ వ్యావహారిక శకానికి పూర్వం 200 వ్యావహారిక శకం 300ల మధ్యలోని వాళ్లు. అటుపైన వచ్చిన వాళ్లు తిరుమళ్షిసై ఆళ్ష్వార్, నమ్మ ఆళ్ష్వార్, తిరుమఙ్గై ఆళ్ష్వార్, తొణ్డర్ అడిప్పొడి ఆళ్ష్వార్, పెరియ ఆళ్ష్వార్, ఆణ్డాళ్, కులశేఖర ఆళ్ష్వార్, మదురకవి ఆళ్ష్వార్, తిరుప్‌పాణ ఆళ్ష్వార్‌లు. ఆణ్డాళ్ ఉటంకించిన ఈ సంఘటన వ్యావహారిక శకం 447లో జరిగినదని, అందువల్ల ఆణ్డాళ్ కాలం ఐదోశతాబ్ది అని కొందఱు చెబుతారు. "శుక్రుడు లేచి, గురువు నిద్రపోయాడు" మాటకు మఱికొన్ని వివరణలూ ఉన్నాయి. "శుక్రుడు లేచి, గురువు నిద్రపోయాడు" అనడం శుక్రవారం ఉదయమై, గురువారం అస్తమించింది అని చెప్పడమూ కావచ్చు.
"పక్షులు కూడా కిచకిచలాడుతున్నాయి చూడు" అంటూ పక్షులు కూడా నిద్రలేచి కదులుతున్నాయి నువ్వు కూడా లేచి కదులు అని సూచిస్తోంది ఆణ్డాళ్. పూలు స్వచ్ఛమైనవి. "పూసొగసుల కళ్లదానా" అంటూ స్వచ్ఛమైన సొగసులతో కళ్లుకలదానా అనీ, పూసొగసులలాగా స్వచ్ఛమైన కళ్లున్నదానా అనీ చెప్పకుండానే చెబుతోంది ఆణ్డాళ్.
మనలో ఎన్నెన్నో ఉష్ణాలు ఉంటాయి. అవన్నీ బాగా చల్లబడాలి, అందుకు దైవచింతనలో మునిగిపోవాలి అన్నదాన్ని సూచిస్తూ ఆ పని చెయ్యకపోవడాన్ని ప్రశ్నిస్తూ "కడుచల్లబడేట్లుగా మునిగి స్నానం చెయ్యకుండా పడుకుని ఉన్నావా" అని అంటోంది ఆణ్డాళ్. దైవచింతనలో మునగడానికి ముందుగా కపటాన్ని వదిలేయ్యాలి. అందుకే "కపటాన్ని విడిచి మాతో కలిసిరా" అంటూ ఆహ్వానిస్తోంది ఆణ్డాళ్.
"కపటము లిఁకనీలే కన్ను లెదుట నున్నాఁడు" అని అన్నమయ్య కూడా అన్నారు.
మనమూ మన కపటాన్ని విడిచి ఆణ్డాళ్ పిలుపును అందుకుని దైవచింతన చేద్దాం.
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
రోచిష్మాన్
9444012279
Updated Date - 2022-12-28T06:55:40+05:30 IST