Tiruppavai: ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?
ABN, First Publish Date - 2022-12-16T19:32:26+05:30
మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది...
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం రెండోరోజు; తిరుప్‌పావై రెండో పాసురమ్ రోజు.
పాసురమ్ 02
ఆణ్డాళ్ రెండో పాసురమ్‌లో నోము నోచుకునేందుకు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఇలా చెబుతోంది...
మూలం-
వైయత్తు వాళ్ష్వీర్గాళ్! నాముమ్ నమ్ పావైక్కుచ్
చెయ్యుమ్ కిరిసైగళ్ కేళీరో; పాఱ్కడలుళ్
పైయత్ తుయిన్ఱ పరమన్ అడిపాడి
నెయ్యుణ్ణోమ్, పాలుణ్ణోమ్, నాట్కాలే నీరాడి
మైయ్యిట్ టెళ్షుదోమ్, మలరిట్టు నామ్‌ముడియోమ్,
సెయ్యాదన సెయ్యోమ్, తీక్కుఱళైచ్ చెన్ఱోదోమ్;
ఐయముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
అవనిపై జీవిస్తున్న వాళ్లలారా! మనం మన నోముకు
చెయ్యాల్సిన విధానాల్ని వినండి; పాలకడలిలో
శాంతంగా నిద్రపోతున్న పరంధాముడి పాదాల్ని గానం చేస్తాం;
నెయ్యి తినం, పాలు తాగం, తెల్లారు జామునే స్నానం చేస్తాం;
కాటుక పెట్టుకోం, కేశాలకు పువ్వులు పెట్టుకోం,
చెయ్యద్దన్న వాటిని చెయ్యం, గుమిగూడి చాడీలు చెప్పుకోం;
దానం, భిక్ష వీలైనంత చేతుల్తో ఇచ్చి
సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం; ఓలాల నా చెలీ!
అవగాహన-
ఈ పాసురమ్‌లో నోములో భాగంగా ఏం చెయ్యాకూడదో ఏం చెయ్యాలో చెప్పింది ఆణ్డాళ్. అటుపైన "సిద్ధి కలగాలని అనుకుని సంతోషిస్తూ ఉందాం" అని ఆణ్డాళ్ అనడం ఎంతో బావుంది. సిద్ధి కలగడం లేదా ఫలించడం ఏ ప్రయత్నానికైనా లక్ష్యం. నిజానికి ఒక వ్యక్తి జీవనానికి కూడా సిద్ధి కలగాలి. ఒక వ్యక్తి జీవనం కూడా ఫలించాలి. సిద్ధి కలగాలన్న లక్ష్యంతో ఒక వ్యక్తి సంతోషిస్తూ ఉండాలి. ఈ భావన, ఈ ఆశంస చాల గొప్పవి.
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
రోచిష్మాన్
9444012279
Updated Date - 2022-12-18T23:08:40+05:30 IST