Tiruppavai: ఆణ్డాళ్ భావాలలో నగలు, స్నానం అంటే...
ABN, First Publish Date - 2022-12-15T18:42:09+05:30
ఆణ్డాళ్ కాలంలో మార్గశిరంలో స్త్రీల నదీస్నానాలు ఒక ఉత్సవంలా జరిగేవని తెలుస్తోంది. నోము నోచుకునే కన్యలు నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు...
ధనుర్మాసం తిరుప్‌పావై మాసం. వసంతమాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆణ్డాళ్ తిరుప్‌పావై పల్లవిస్తుంది. ఆణ్డాళ్ శ్రీ కృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానంచేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించాలని గోపకన్యల్ని పిలవడం నుండీ తిరుప్‌పావై పాసురాలు మొదలౌతాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆణ్డాళ్ చెప్పేది మనకు హృదయంగమం ఔతుంది. రోజుకో పాసురమ్‌గా ధనుర్మాసం ముప్పైరోజులూ తిరుప్‌పావై మనతోనూ, మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం మొదటి రోజు; తిరుప్‌పావై మొదటి పాసురమ్ రోజు.
పాసురమ్ 01
ఆణ్డాళ్, తొలి పాసురమ్‌లో నారాయణుడు అనుగ్రహిస్తాడు నోము నోచుకుందాం, స్నానానికి వెళదాం రండి అంటూ గోపకన్యల్ని పిలుస్తోంది...
మూలం-
మార్గళ్షిత్ తిఙ్గళ్ మదినిఱైన్ద నన్నాళాల్
నీరాడప్ పోదువీర్ పోదుమినో నేరిళ్షైయీర్!
సీర్‌మల్గుమ్ ఆయ్పాడిచ్ చెల్వచ్ చిరుమీర్గాళ్!
కూర్వేల్ కొడున్తొళ్షిలన్ నన్దగోబన్ కుమరన్
ఏరార్‌న్ద కణ్ణి యసోదైయిళఞ్‌సిఙ్గమ్
కార్మేనిచ్ చెఙ్గణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తరువాన్
పారోర్ పుగళ్ష్‌ప్ పడిన్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో-
మార్గశిరమాసం జాబిల్లి నిండుగా నెలకొన్న శుభ దినం;
స్నానం చెయ్యాలనుకున్న వాళ్లలారా! రండి; నగలుపెట్టుకున్న వాళ్లలారా!
అందమైన గోకులంలోని సౌభాగ్యవతులైన కన్యల్లారా!
పదునైన శూలంతో ఉగ్రుడైన నందగోపుడి తనయుడు,
సుందర నయనాల యశోదకు సింహకిశోరుడు,
నల్లని తనువు, ఎఱ్ఱని కళ్లతో సూర్యచంద్రుల వంటి మోము వాడు
నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు;
భూజనులందఱూ మెచ్చుకునేట్లుగా నోము నోచుకుందాం; ఓలాల నా చెలీ!
అవగాహన-
"మార్గళ్షిత్ తిఙ్గళ్" అంటూ పాసురాన్ని మొదలుపెట్టింది ఆణ్డాళ్. మార్గళ్షి అంటే మార్గశిరం అనీ, తిఙ్గళ్ అంటే మాసం అనీ అర్థాలు. తిఙ్గళ్ అంటే జాబిల్లి అనే అర్థమూ ఉంది. జాబిల్లి స్త్రీత్వానికి ప్రతీక. ఆణ్డాళ్ తను ఒక స్త్రీ, నోము నోచుకునేందుకు తను స్త్రీలను పిలుస్తోంది. స్త్రీలు నోచుకునే మేలినోము (తిరుప్‌పావై) కాబట్టీ, విషయం స్త్రీ సంబంధితం కాబట్టి ఇక్కడ తిఙ్గళ్ శబ్దాన్ని ప్రయోగించింది.
ఈ పాసురమ్‌లో "నగలుపెట్టుకున్న వాళ్లలారా" అన్న సంబోధనను గమనించాలి. భక్తి భావనలకు ప్రతీకలుగా నగలను ఇక్కడ ఆణ్డాళ్ ప్రస్తావించింది. స్నానాన్ని దైవచింతనకు ప్రతీకగా చెప్పినట్టు తోస్తోంది. ఆణ్డాళ్ కాలంలో మార్గశిరంలో స్త్రీల నదీస్నానాలు ఒక ఉత్సవంలా జరిగేవని తెలుస్తోంది.
నోము నోచుకునే కన్యలు నోములో భాగంగా తప్పెటను వాయిస్తారు. తప్పెటను అనుగ్రహానికి ప్రతీకగానూ చెబుతారు. ఆ తప్పెట లేదా అనుగ్రహాన్ని నారాయణుడే ఇస్తాడు అని సూచిస్తూ "నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు" అని తెలియజెప్పింది ఆణ్డాళ్.
తిరుప్‌పావై పరిచయం, వివరణ కోసం ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి
ఆణ్డాళ్ తిరుప్‌పావై పాసురాల లింక్
రోచిష్మాన్
9444012279
Updated Date - 2023-03-06T15:49:52+05:30 IST