OHRK: ఇప్పుడైతే డబ్బు.. పేరు రావచ్చు... కానీ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం రాదు కదా
ABN , First Publish Date - 2022-11-07T01:41:53+05:30 IST
నెమలికే నడక నేర్పినట్టు లాస్యం... ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మెచ్చిన నాట్యాభినయం... నాటి తరాన్ని ఉర్రూతలూగించిన అలనాటి నటి...
నెమలికే నడక నేర్పినట్టు లాస్యం... ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మెచ్చిన నాట్యాభినయం... నాటి తరాన్ని ఉర్రూతలూగించిన అలనాటి నటి... పెళ్లి తరువాత వెండితెర విడిచి... చదువులో పడి... సరికొత్త జీవితాన్ని లిఖించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి... ఎల్.విజయలక్ష్మి. అయిదు దశాబ్దాల తరువాత హైదరాబాద్ వచ్చిన ఆమె... ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో నాటి అనుభూతులు, అనుభవాలెన్నిటినో పంచుకున్నారు...
ఆర్కే: నమస్తే విజయలక్ష్మి గారు... ఎలా ఉన్నారు?
విజయలక్ష్మి: బానే ఉన్నాను.
ఆర్కే: దాదాపు యాభై సంవత్సరాల కిందట... అందం, నాట్యం, అభినయంతో అభిమానులకు నిద్ర పట్టకుండా చేశారు! ముఖ్యంగా మగవాళ్లకు!
విజయ : (నవ్వు)
ఆర్కే: మీరు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నారు. మరి ఇప్పుడు కూడా ఇంట్లో తెలుగు పాటలు పెట్టుకొని అభినయిస్తుంటారా?
విజయ :అప్పుడప్పుడు వంట చేసేటప్పుడో... ఒక్కదాన్నే కూర్చొని ఉన్నప్పుడో అభినయిస్తుంటాను. ఆ పాటలు వింటున్నప్పుడు మనసుకు సంతోషం కలుగుతుంది. ఎనర్జీ వచ్చేస్తుంది.
ఆర్కే: యాభై ఏళ్ల తరువాత ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చారు?
విజయ: ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలకు నన్ను పిలిచి, సత్కరించారు. నాకు అది చాలా చాలా ప్రత్యేకం. ఇంతకన్నా ఏంకావాలి! నా కల నిజమైన రోజు అది! గర్వంగా ఉంది.
ఆర్కే: ఎన్టీఆర్‌తో ఎక్కువ చిత్రాలు చేశారు కదా! ఆయనతో మీ అనుభవాలు ఏమిటి?
విజయ: మా ఇద్దరిదీ హిట్ పెయిర్. కలిసి చాలా సినిమాలు చేశాం. తొలిసారి ఆయనతో నటించేటప్పుడు భయపడ్డాను. అప్పటికే ఆయన పెద్ద స్టార్. నేను అప్పుడప్పుడే వస్తున్నాను. అందులోనూ మా ఇంట్లో ఎవరూ సినీ ఫీల్డ్‌కు సంబంధించినవారు లేరు. దాంతో మొదటిసారి సెట్‌కు వెళ్లినప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆయన నన్ను ‘రామ్మా... కూర్చోమ్మా’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆ తరువాత నుంచి భయం పోయింది. ‘నర్తనశాల’లో రామారావు గారు వేసిన బృహన్నల పాత్ర నా గురువు. అందులో అద్భుతంగా చేశారు. ఇచ్చిన పాత్రకు రెండొందల శాతం న్యాయం చేస్తారాయన. రామారావు గారు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు కానీ సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. అప్పట్లో కారవాన్లూ అవీ లేవు కదా... షూటింగ్ గ్యాప్‌లో అందరం చెట్టు కింద కూర్చొనేవాళ్లం. అప్పుడు ఆయన ‘ఏయ్... పచ్చిమిరపకాయ బజ్జీలు తెండి’ అనేవారు. అందరం సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఆ బజ్జీలు తినేవాళ్లం.
ఆర్కే: సినీ పరిశ్రమకు రాకముందు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
విజయ: నాన్న డిఫెన్స్‌లో అకౌంట్ ఆఫీసర్‌గా ఉండేవారు. నేను పుట్టింది తిరునల్వేలి. పెరిగింది పూణెలో. మా అమ్మ వీణ చాలా బాగా వాయిస్తారు. పాటలు పాడతారు. ఆమె నుంచే నాకు వచ్చాయి. నాన్న కూడా బాగా ప్రోత్సహించారు. చిన్నప్పుడు అమ్మే నాకు గురువు. ఆమె పాడితే... నేను ఆడేదాన్ని. నాన్న దాని అర్థం చెప్పేవారు. తరువాత ప్రముఖ నాట్య గురువు వలువూర్ రామయ్యపిళ్లై దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. నా కోసం మా కుటుంబం పుణె నుంచి చెన్నైకి మారింది.
ఆర్కే: మీ జీవితం నాటి, నేటి తరానికి కూడా స్ఫూర్తి. పెళ్లి తరువాత ఉన్నత చదువులు చదివారు. ఆ కసి ఎక్కడి నుంచి వచ్చింది?
విజయ: పెళ్లి తరువాత నేను ఇక్కడి నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లిపోయాను. అక్కడ నా చుట్టూ ఉన్నవాళ్లందరూ సైంటి్‌స్టలు, పీహెచ్‌డీ చేసినవారు. అది చూసి నేను ఎందుకు చదువుకోకూడదు అనుకున్నా! సినిమాలైతే మానేశాను. అలాంటప్పుడు ‘మరొక రంగంలో ఎందుకు ప్రయత్నించకూడదు’ అనిపించింది. తొలుత మెట్రికులేషన్ పాసయ్యాను. ఆ తరువాత కరస్పాండెన్స్‌లో బీకాం చదివాను. దాంతో కాస్త నమ్మకం కుదిరింది. మాస్టర్స్ చేశాను. అవ్వగానే... ఇక్కడ సీఏని అక్కడ సీపీఏ అంటారు. అది పూర్తి చేశాను. అనుకున్నది సాధించినందుకు ఆత్మవిశ్వాసం పెరిగింది. సంతృప్తి మిగిలింది. ఇదంతా అయిపోయిన తరువాత యూనివర్సిటీలో కొలువు కోసం ఎందుకు ప్రయత్నించకూడదనుకున్నా. ప్రయత్నిస్తే అమెరికా ‘వర్జీనియా యూనివర్సిటీ’లో ఉద్యోగం వచ్చింది. మొదట అక్కడ అకౌంటెంట్‌గా చేరాను. అటు నుంచి బడ్జెట్ ప్లానర్, ఫైనాన్స్ అనలి్‌స్టను అయ్యాను. ఆ యూనివర్సిటీలో 17 ఏళ్లు పని చేశాను. ఇప్పుడు క్యాలిఫోర్నియాలో ఉంటున్నాం.
ఆర్కే: మిమ్మల్ని పరిశ్రమకు పరిచయం చేసింది ఎవరు?
విజయ: తెలుగులో ‘సిపాయి కూతురు’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చాను. నాట్యంలో రంగప్రవేశం చేసినప్పుడు ఆ సినిమా దర్శకనిర్మాతలు వచ్చి చూశారు. తరువాత మా నాన్నను అడిగారు... ‘ఇలా సినిమా తీస్తున్నాం. అందులో రెండు పాటలకు డ్యాన్స్ చేయాలి’ అని. నాన్న నన్ను అడిగారు. ‘డ్యాన్సే కదా... ఇక్కడ చేసినా... అక్కడ చేసినా’ అన్నాను. అలా సినిమాల్లో చేయడం నాకు నచ్చి... నటిగా కొనసాగాను.
ఆర్కే: హీరోయిన్‌గా అవకాశం ఎవరు ఇచ్చారు?
విజయ: ‘రాముడు-భీముడు’లో రామానాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఆయనకు అది తొలి చిత్రం. దర్శకుడు తాపీ చాణక్య, రామానాయుడు గారు మా ఇంటికి వచ్చి అడిగారు. ‘హీరోయిన్‌గా మీ అమ్మాయిని తీసుకొందామనుకొంటున్నాం’ అని నాన్నతో చెప్పారు. నేను చాలా థ్రిల్ అయ్యాను. రామారావు గారితో చాన్స్ వచ్చిందని! సినిమానే కాదు... అందులో నాగార్జునసాగర్ దగ్గర తీసిన ‘దేశమ్ము మారింది’ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి రామారావు, నాగేశ్వరరావు, కృష్ణతో చాలా చిత్రాల్లో నటించాను. ఏ పాత్ర చేసినా నా డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాలని దర్శకనిర్మాతలు పట్టుబట్టేవారు.
ఆర్కే: అలానే ‘గుండమ్మ కథ’లో ప్రత్యేకంగా పాట పెట్టారుట కదా!
విజయ: అవును. చిత్రం షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ అందులో నా డ్యాన్స్ లేదు. దాంతో ఎవరు చెప్పారో తెలియదు... సినిమాలో నా డ్యాన్స్ ఉండాలన్నారు. అలా రెండు రోజుల్లో ఇనుస్ర్టుమెంట్స్‌తో కంపోజ్ చేయడం, నా డ్యాన్స్ చిత్రీకరించడం జరిగిపోయాయి.
ఆర్కే: పదేళ్లకు పైగా హీరోయిన్‌గా నటించారు. కెరీర్ అంత పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది?
విజయ: అలా జరిగిపోయిందంతే. మావారు ఫిలిప్పీన్స్‌లో పనిచేసేవారు. అక్కడ మా పెద్దన్నయ్య, ఆయన స్నేహితులు. అన్నయ్య మా ఫ్యామిలీ ఆల్బమ్ తిరగేస్తున్నప్పుడు మావారు నా ఫొటో చూశారు. చెన్నైకి వచ్చి మా నాన్నను అడిగారు... నన్ను పెళ్లి చేసుకొంటానని. ఆయన బెంగాలీ... అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఇంట్లో అందరూ మాట్లాడుకొని ఓకే చేశారు. తరువాత మీరు వినే ఉంటారు... 1960ల్లో గ్రీన్ రివల్యూషన్ అని! ఐఆర్8 అనే కొత్త రకం బియ్యం ఆయన టీమే అభివృద్ధి చేసింది.
ఆర్కే: నాటి హీరోయిన్లలో ఎవరితో సాన్నిహిత్యం ఉండేది?
విజయ: జమున, సావిత్రి, బి.సరోజాదేవి... వీళ్లందరితో చేశాను. వాళ్లంతా ఎంతో ఆప్యాయంగా చూసుకొనేవారు. అప్పుడు నేను తెలుగు నేర్చుకొంటున్నా. డిక్షన్ అవీ సావిత్రిగారు చెప్పేవారు. జమునగారు చాలా సరదాగా మాట్లాడేవారు... సరోజాదేవిలానే! అవన్నీ మధుర క్షణాలు.
‘జగదేకవీరుని కథ’లో మేం నలుగురం స్విమ్మింగ్‌పూల్‌లో చేసే పాట ఒకటుంది. అప్పుడు అందరం నవ్వుతూ ఎంతో సరదాగా, విహారానికి వెళ్లినట్టు చేశాం. ‘వరించి వచ్చిన’ పాటలో నేను మొదటిసారి రామారావు గారిని చూశాను. సరోజ, జమునకు నా డ్యాన్స్ చాలా ఇష్టం. అలాగే వాళ్ల నటన నాకు ఇష్టం. అలా ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉండేది. నటిగా ఆ పదేళ్లు ఎలా గడిచిపోయాయో తెలియలేదు.
ఆర్కే: ఎన్టీఆర్ మిమ్మల్ని ‘కోడలా కోడలా’ అని ఎందుకు పిలిచేవారు?
విజయ: ‘నర్తనశాల’లో కోడలిగా నటించాను కదా! దాని తరువాత నన్ను చూడగానే ఆయన ‘కోడలా... రామ్మా’ అని పిలిచేవారు. అదే నా పేరు అయిపోయింది. ఆయనతో నాకు చాలా మధుర జ్ఞాపకాలున్నాయి. ‘నర్తనశాల, పరమానందయ్య శిష్యుల కథ, మంగమ్మ శపథం, పాండవ వనవాసం, రాముడు భీముడు’... ఇలా చాలా ఉన్నాయి. ఆయనతో చేసిన ప్రతిసారీ ఓ థ్రిల్ ఉంటుంది. రామారావు గారు క్రమశిక్షణగా ఉంటారు. ఉదయం ఏడంటే ఏడింటికల్లా సెట్‌లో కనిపిస్తారు. ఆ క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం... ఆయన నుంచే నేర్చుకున్నా. అన్నిటికంటే పెద్ద స్టార్‌నన్న భావన ఆయనలో కనిపించదు. మా పెళ్లికి కూడా హడావుడి అదీ ఏమీలేకుండా సింపుల్‌గా వచ్చారు. ఎన్టీఆర్ నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఆయనలా ఒకటి తరువాత ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటా. ఎప్పుడూ ఖాళీగా అయితే ఉండను. అల్జీమర్స్ లాంటి వాటికి మందు ఏమిటంటే... మైండ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడం. యాక్టివ్‌గా ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుండాలి.
ఆర్కే: మీ తరువాతి గోల్ ఏంటి?
విజయ: వెబ్ డిజైనింగ్‌తో పాటు సీ లాంగ్వేజ్‌లాంటిదేదైనా నేర్చుకొంటే బాగుంటుందనిపిస్తుంది. అదీ సమయం దొరికితే. జీవితంలో వెలితి అంటూ ఏమీ లేదు. పూర్తి సంతృప్తిగా జీవిస్తున్నా.
ఆర్కే: మీరు ఇలా సంతోషంగా నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకొంటూ... ధన్యవాదాలు!
విజయ: థాంక్యూ వెరీమచ్.
ఆర్కే: మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చాయి?
విజయ: సహనటులు ఎవరు అభినందించినా నాకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, జమున గారు... వాళ్లదరికీ నా నాట్యం ఇష్టం. జమున గారు ఇప్పటికీ చెబుతారు... ‘నీ డ్యాన్స్ అంటే ఇష్టం’ అని. మొన్న ‘జూమ్’లో మాట్లాడినప్పుడు తన మనవరాలిని పిలిచి... ‘చూడు... ఈవిడ ఎల్.విజయలక్ష్మి. ఆమెలా డ్యాన్స్ చేయాలి’ అన్నారు. అలాంటి కాంప్లిమెంట్స్ వస్తే సంతృప్తిగా, గర్వంగా ఉంటుంది.
ఆర్కే: అప్పుడు మీకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చేవాళ్లు?
విజయ: చాలా తక్కువండి. డ్యాన్స్‌కైతే ఐదు వేలు, మూడు వేలు ఇచ్చేవారు. హీరోయిన్‌గా అయితే పదిహేను, ఇరవై వేలు ఇచ్చేవారు. నా అత్యధిక పారితోషికం పాతికవేలు.
ఆర్కే: ఇక్కడి పరిస్థితులు, రాజకీయాలు ఫాలో అవుతుంటారా?
విజయ: : అవుతాను. ఆయనకు నాకంటే ఎక్కువ ఆసక్తి.
నాకేమనిపిస్తుందంటే... రాబోయే ఇరవై ఏళ్లలో భారత్ ఒక బలమైన దేశంగా అవతరిస్తుంది. నేను చెప్పడమే కాదు... పలు పత్రికల్లో కూడా చదివాను. కొందరి అంచనాల ప్రకారం చైనాను కూడా దాటిపోతుందని!
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మనది.
Read more