NRI: అమెరికాలో భారీ స్కామ్.. ప్రధాన సూత్రధారిగా ఎన్నారై..
ABN, First Publish Date - 2022-12-16T18:56:51+05:30
అమెరికాలో తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లతో భారీగా కోట్లు దండుకున్న కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలాడు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లతో భారీగా కోట్లు దండుకున్న కేసులో(Health Care Fraud) ఓ ఎన్నారై(NRI) దోషిగా తేలాడు. అట్లాంటాకు(Atlanta) చెందిన మినాల్ పటేల్(44).. ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం ‘మెడికేర్’ ఆసరాగా తప్పుడు బిల్లులు చూపించి వేల డాలర్లు అక్రమంగా సంపాదించినట్టు తాజాగా రుజువైంది. లాబ్‌సొల్యూషన్స్ పేరిట మినాల్(Minal Patel) జన్యు పరీక్షల లాబొరేటరీని నిర్వహించేవాడు. మెడికేర్(Medicare) ఇన్సూరెన్స్ కార్యక్రమానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించే లాబ్‌గా ఈ సంస్థ మెడికేర్ రికార్డుల్లో నమోదైంది. అమెరికా న్యాయశాఖ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. 2016-19 మధ్య లాబ్ సొల్యూషన్స్ పలు టెస్టులు చేశామంటూ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కింద 463 మిలియన్ డాలర్ల బిల్లులు సమర్పించింది. ఈ క్రమంలో మెడికేర్‌కు అనుసంధానమైన ఇన్సూరెన్స్ సంస్థలు 187 మిలియన్ డాలర్లు చెల్లించాయి. ఫలితంగా.. పటేల్‌కు వ్యక్తిగతంగా 21 మిలియన్ డాలర్ల మేర లాభం చేకూరింది.
ఈ స్కామ్‌లో పటేల్ కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. పేషెంట్లను టెస్టుల కోసం సంప్రదించే మధ్యవర్తులు, టెలీమెడిసిన్ కంపెనీలు, కాల్‌సెంటర్ల సాయంతో మెడికేర్ లబ్ధిదారులను టార్గెట్ చేసుకునేవాడు. టెలీమెడిసిన్ సంస్థల కాల్‌సెంటర్ల సాయంతో ఫోన్ చేయించి ఖరీదైన క్యాన్సర్ టెస్టులను వారికి అవసరమని చెప్పించేవాడు. ఇవన్నీ మెడికేర్ కింద కవర్ అవుతాయని నమ్మబలికేవాడు. ఆ తరువాత మధ్యవర్తులతో ఈ టెస్టులకు వైద్యుల ఆమోదముద్ర పొందేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మధ్యవర్తులు లాబ్‌సొల్యూషన్స్ తరపున ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా తీసుకునేవాడు . చివరికి మినాల్ వ్యవహారం మొత్తం బట్టబయలు కావడంతో..కోర్టు అతడిని దోషిగా తేల్చింది. హెల్త్‌కేర్ ఫ్రాడ్, అక్రమ నగదులావాదేవీలు, అమెరికాకు అర్థికనష్టం కలిగించేలా కుట్ర పన్నడం తదితర నేరాలకు మినాల్ పటేల్ పాల్పడినట్టు ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ జ్యూరీ తాజాగా తేల్చింది. పటేల్‌కు ఒక్కో నేరం కింద గరిష్ఠంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో అతడి శిక్ష ఖరారు కావచ్చు.
Updated Date - 2022-12-16T19:19:17+05:30 IST