USA: ఆసియా భాషలను హేళన చేసిన అమెరికా ప్రొఫెసర్.. చివరకు
ABN, First Publish Date - 2022-12-15T23:36:52+05:30
ఆసియా దేశాల భాషలను హేళన చేసిన ఓ అమెరికా యూనివర్శిటీ ఛాన్సలర్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
ఎన్నారై డెస్క్: ఆసియా దేశాల భాషలను హేళన(Mocking) చేసిన ఓ అమెరికా యూనివర్శిటీ ఛాన్సలర్(Chancellor) తాజాగా క్షమాపణలు(Apology) చెప్పారు. ఈ నెల మొదట్లో ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ నార్త్‌వెస్ట్ యూనివర్శిటీలో(Purdue Northwest University ) జరిగిన ఓ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ థామస్ ఎల్ కియోన్ మాట్లాడుతూ..ఇవి నా ఆసియా మాటలు అంటూ విచిత్ర శబ్దాలు పలికి హేళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. థామస్ జ్యాత్యాహంకార పూరిత వైఖరిని నెటిజన్లు ముక్తకంఠంతో ఖండించారు. దీంతో.. తన తప్పు తెలుసుకున్న థామస్ చివరకు క్షమాపణలు చెప్పారు. ‘‘నా మాటలు ఎందరికో వేదనను, బాధను కలిగించాయి. అనుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అంటూ ఆయన డిసెంబర్ 14న ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
అంతేకాకుండా.. భిన్న సంస్కృతుల వారికి వేదికగా యూనివర్శిటీని తీర్చిదిద్దేందుకు తాను మొదలెట్టిన ప్రైడ్(PRIDE) కార్యక్రమాన్ని కూడా ప్రస్తావించారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వారు యూనివర్సిటీలో ఇమిడిపోయేందుకు, ఇతరులతో తమ భావాలు, ఆలోచనలు పంచుకునేందుకు ఈ కార్యక్రమం అవకాశాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన వివరణను యూనివర్సిటీ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. కానీ.. నెటిజన్లు థామస్ క్షమపణల్లో నిజాయితీపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘రెండు నెలల క్రితమే ఇలాంటి ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తరువాత ఈ వ్యాఖ్యలకు దిగుతారా’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘యూనివర్సిటీలో గతంలో చదువుకున్న వారు భవిష్యత్తులో చదవబోయే వారు ఇదంతా గమనిస్తారనే ఆశిస్తున్నాం’’ అని మరికొందరు పేర్కొన్నారు.
Updated Date - 2022-12-15T23:36:57+05:30 IST