US Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు..
ABN, First Publish Date - 2022-11-20T20:00:23+05:30
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. శనివారం ఓ గే నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు.
కొలరాడో స్ప్రింగ్స్(కొలరాడో): అమెరికాలో మరోసారి కాల్పుల(Shooting) కలకలం రేగింది. శనివారం ఓ గే(స్వలింగ సంపర్కులు) నైట్ క్లబ్‌లో(Gay Night Club) జరిగిన కాల్పుల ఘటనలో ఏకంగా ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. కొలరాడో స్ప్రింగ్స్‌లోని ‘క్లబ్ క్యూ’లో(Club Q) ఈ ఘటన జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. ఇతడే కాల్పులకు తెగబడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ లియూటెనెంట్ పామెలా క్యాస్ట్రో మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే..నిందితుడు ఎందుకు కాల్పులకు దిగాడు, అతడు ఏ ఆయుధాన్ని వాడాడన్న వివరాలను మాత్రం బహిరంగపరచలేదు. కాల్పులు జరుగుతున్న విషయాన్ని తమకు ఫోన్ కాల్ ద్వారా అందిందని పామెలా తెలిపారు. పోలీసులకు ఘటనస్థలానికి చేరుకునే సరికి.. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని అతడిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
కాగా.. ఈ ఘటనపై కొలరాడో స్ప్రింగ్స్(Colorado Nightsprings) నైట్ క్లబ్ ఓ ప్రకటన చేసింది. అకారణంగా అర్థరహితంగా తమను టార్గెట్ కావడం బాధాకరమని పేర్కొంది. ధైర్యంగా దుండగుడిని అదుపు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా..ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు..నైట్ క్లబ్ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. గత ఆరేళ్లలో ఓ గే క్లబ్‌పై ఈ స్థాయి దాడి జరగడం ఇదే తొలిసారి కావడంతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. 2016లో ఓర్లాండోలోని ఓ నైట్ క్లబ్‌పై జరిగిన దాడిలో ఓ దుండగుడు ఏకంగా 49 మందిని పొట్టనపెట్టుకున్నాడు. తాను ఐసీసిస్‌కు ఫాలోవర్ అని చెప్పుకున్న నిందితుడు తుపాకీతో రెచ్చిపోయారు. పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో అతడు మరణించాడు. అమెరికా చరిత్రలో అత్యంత భయానకమైన కాల్పుల ఘటనగా ఓర్లాండో ఘటన నిలిచిపోయింది.
Updated Date - 2022-11-20T20:07:44+05:30 IST