NRI: టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు.. ఒడిదుడుకుల్లో ఎన్నారైలు..
ABN, First Publish Date - 2022-11-14T21:40:34+05:30
ప్రముఖ టెక్ సంస్థలు ఉద్యోగుల తొలగింపునకు దిగడం విదేశాల్లోని ఎన్నారైలకు ఆందోళన కలిగిస్తోంది.
ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మెటా(Meta), ట్విటర్(Twitter) లాంటి బడా సంస్థలే కాకుండా... మధ్య చిన్న తరహా సంస్థలు కూడా ఉద్యోగుల తొలగింపునకు దిగుతున్నాయి. ఇది విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలపై(NRI) పెను ప్రభావమే చూపిస్తోంది. ప్రముఖ టెక్ సంస్థల ప్రధాన కార్యాలయాలున్న సింగపూర్‌లో(Singapore) తొలగింపుల పర్వం అక్కడి భారతీయుల్లో గగుర్పాటుకు కారణమవుతోంది.
సింగపూర్ మానవవనరుల శాఖ గణాంకాల ప్రకారం.. ఎప్లాయ్‌మెంట్ పాస్‌పై(Employment Pass) స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల సంఖ్య ఏకంగా 177100. వారిలో 45 వేల మంది భారతీయులే. అత్యధిక వృత్తినైపుణ్యాలున్న వారికే మాత్రమే ఎంప్లాయ్‌మెంట్ పాస్ ఇస్తారు. నెలకు 3700 డాలర్ల కనీసం వేతనం పొందే విదేశీయులకే ఈ పాస్ ఇస్తారు. ఇక మెటాకు సింగపూర్‌లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా తొలగింపుల పర్వంలో 10 శాతం మంది జాబ్ కోల్పోయినట్టు తెలుస్తోంది. వినియోగదారులు ఖర్చులు తగ్గించుకుంటుండటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటివి టెక్ కంపెనీల స్పీడుకు బ్రేకులు వేస్తున్నాయి. అనేక సంస్థలు కొత్త నియామకాలను నిలిపివేయడంతో పాటూ ఇప్పటికే జారీ చేసిన ఆఫర్ లెటర్లను వెనక్కు తీసుకుంటున్నాయి. ఇది ఎన్నారైలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. వర్క్ వీసాలపై ఏళ్ల పాటు విదేశాల్లో ఉంటున్న ప్రవాసీయులు ఈ తొలగింపులతో చిక్కుల్లో పడుతున్నారు. పిల్లలు చదువులు, కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
టెక్ రంగం ప్రస్తుతం అంతర్గత సద్దుబాటుకు లోనవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు పోవడం వంటివి కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే..దీర్ఘకాలంలో టెక్ రంగానికి ఎటువంటి ఢోకా ఉండదనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. మార్కెట్ రీసెర్చ్ సంస్థల సర్వేల ప్రకారం.. ప్రస్తుతం ప్రోగ్రామింగ్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలున్న నిపుణుల సంఖ్య పారిశ్రామిక అవసరాలు తీర్చేంతట స్థాయిలో లేదు. ఫలితంగా.. ఫ్రెషర్లు కూడా భారీ జీతాలు పొందుతున్నారు. ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో టెక్ రంగం భవిష్యత్తుకు ఢోకా ఉండదనేది అత్యధికుల అభిప్రాయంగా కనిపిస్తోంది.
Updated Date - 2022-11-14T23:06:12+05:30 IST