Ireland: ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి నేత.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
ABN, First Publish Date - 2022-12-18T18:26:14+05:30
ఐర్లాండ్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత లియో వరాద్కర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నారై డెస్క్: ఐర్లాండ్(Ireland) ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత(Indian Origin) లియో వరాద్కర్‌కు(Leo Varadkar) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రెండవ సారి ప్రధానిగా(Taoiseach) బాధ్యతలు చేపట్టిన లియో వరాద్కర్‌కు శుభాకంక్షలు. ఐర్లాండ్‌తో చారిత్రక బంధానికి భారత్ ఎంతో విలువనిస్తుంది.’’ అని ట్వీట్ చేశారు. ఇరు దేశాలు రాజ్యంగబద్ధ విలువలకు కట్టుబడి ఉన్నాయని, పలు రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. రెండు దేశాల ఆర్థికాభివృద్ధి కోసం ఐర్లాండ్‌తో కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఐర్లాండ్ ప్రధానిగా వరాద్కర్ రెండవసారి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు పార్టీల మధ్య 2020లో కుదిరిన ఒప్పందం మేరకు ప్రధాని బాధ్యతలను మైఖేల్ మార్టిన్ నుంచి వరాద్కర్ తీసుకున్నారు. ఐర్లాండ్ దిగువ సభలో జరిగిన ప్రత్యేక వోటింగ్ కార్యక్రమంలో చట్టసభ్యులు ప్రధానిగా వరాద్కర్ నామినేషన్‌కు ఆమోదముద్ర వేశారు.
2017లో తొలిసారి ఐర్లాండ్ పగ్గాలు చేపట్టిన వరాద్కర్ అప్పట్లో దేశాధినేతగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా.. తాను గే అని బహిరంగంగా ప్రకటించుకున్న ప్రధానిగా గుర్తింపుపొందారు. 38 ఏళ్ల వయసులో తొలిసారి ప్రధానిగా ఎన్నికైన ఆయన.. అప్పట్లో తొలి భారత సంతతి ప్రధానిగా, భిన్న జాతుల వారసత్వం కలిగిన తొలి ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించారు. తొలి విడతలో 2017-20 మధ్య ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
వరాద్కర్ డుబ్లిన్‌లో జన్మించారు. ఆయన తల్లి ఐరిష్ వనిత, నర్సుగా పనిచేసేశారు. వరాద్కర్ తండ్రి భారత్ నుంచి ఐర్లాండ్‌కు వలసవెళ్లి అక్కడ వైద్యుడిగా స్థిరపడ్డారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి వైద్యవిద్య పట్టా పొందిన ఆయన.. రాజకీయాల్లో పాలుపంచుకుంటేనే వైద్యుడిగా ప్రాక్టీస్ కొనసాగించారు.
2015లో ఐర్లాండ్‌లో రిఫెరెండమ్ తరువాత స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. అంతకుమునుపే వరద్కార్ తాను గే అన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించారు. బ్రెగ్జిట్, కరోనా కష్టసమయంలో ఆయన దేశాన్ని ముందుండి నడిపించారు. ఇక కరోనా సంక్షోభంలో వరాద్కర్ వైద్యుడిగా తన పేరును మళ్లీ రిజిస్టర్ చేసుకుని వారంలో ఒకరోజు రోగులకు సేవలందిస్తూ మిగతా రోజుల్లో ప్రధాని బాధ్యతలు నిర్వహించారు.
Updated Date - 2022-12-18T18:26:16+05:30 IST