America: అగ్రరాజ్యం అమెరికాలో వింత పరిణామం.. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న కంపెనీలు..!
ABN, First Publish Date - 2022-12-22T20:33:20+05:30
అమెరికాలో టీవీ కార్యక్రమాల స్వర్ణయుగం చరమాంకానికి చేరుకుందని అక్కడి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA) టీవీ కార్యక్రమాల స్వర్ణయుగం(Golden Age is TV) చరమాంకానికి చేరుకుందని అక్కడి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. 2019 నుంచి ఇప్పటివరకూ టీవీలు చూసేవారి సంఖ్య ఏకంగా 40 శాతం పడిపోయిందట. అంతేకాదు.. ప్రముఖ కంపెనీలు అన్నీ టీవీ ప్రకటనలకు కేటాయించే నిధుల్లో భారీగా కోత పెడుతున్నాయట. ఇక టీవీ సీరియళ్లు రూపొందించే అనేక కంపెనీలు నష్టాల బాట పట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. పరిశీలన దశలో ఉన్న 350కి పైగా సీరియళ్లు ఇటీవల కాలంలో రద్దైపోయాయినట్టు తెలుస్తోంది. అమెరికా మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఆంపియర్ అనాలిసిస్’ నివేదిక ప్రకారం..గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో టీవీ ప్రేక్షకుల సంఖ్య ఏకంగా 24 శాతం మేర పడిపోయింది. అయితే.. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ట్రెండ్ బారిన పడటం గమనార్హం. అమెరికాలో తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ వీక్షకుల సంఖ్య తగ్గిందని ఆంపియర్ తేల్చింది.
ఒకేతరహా స్క్రిప్ట్‌లతో వచ్చే సీరియళ్ల పట్ల ప్రజల్లో గణనీయంగా ఆసక్తి తగ్గిపోయిందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం..ప్రజాభిమానంలో శిఖరాగ్రాన ఉన్న టీవీలు నేడు ఆ స్థితిని కోల్పోయాయని ఎన్‌బీసీ ఎంటర్‌టైన్మెంట్ మాజీ చైర్మన్ రాబర్ట్ గ్రీన్‌బ్లాట్ తెలిపారు. ఇండియాలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. స్టాటిస్టా సంస్థ రిపోర్టు ప్రకారం.. 2018లో టీవీ కార్యక్రమాల ఏవరేజ్ మినట్ ఆడియన్స్ 1.60 లక్షల కోట్లు. 2021లో అది 1.59 లక్షల కోట్లకు పడిపోయింది. కరోనా సమయంలో టీవీ చూసే వారి సంఖ్యలో ఓ మోస్తరు వృద్ధి నమోదైనా..ప్రస్తుతం కరోనా పూర్వపుపరిస్థితులు మాత్రం లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-12-23T00:09:48+05:30 IST