Kirpan: అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీ కీలక ప్రకటన.. ఇకపై..
ABN, First Publish Date - 2022-11-20T21:29:57+05:30
అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరొలీనా తాజాగా కీలక ప్రకటన చేసింది.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరొలీనా-షార్లెట్ (University of North Carolina-Charlotte) తాజాగా కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీలో సిక్కు విద్యార్థులు ఎల్లవేళలా తమ వెంట పవిత్రమైన కిర్పన్(చిన్న కత్తి-Kirpan) ఉంచుకునేందకు అనుమతించింది. అయితే.. కత్తి పొడవు మూడు అంగుళాలకు మించకూడదని, ఎప్పుడూ వరలోనే ఉండాలని నిబంధన విధించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని యూనివర్సిటీ ఛాన్సలర్ షారన్ ఎల్ గేబర్, చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ బ్రాండన్ ఎల్ వుల్ఫ్ పేర్కొన్నారు. ఇక మూడడుగుల పొడవుకు మించి ఉన్న కిర్పన్ ధరించాలనుకునే విద్యార్థులు ముందుగా.. సివిల్ రైట్స్ అండ్ టైటిల్ నైన్ కార్యాలయం అనుమతి తీసుకోవాలని పేర్కొంది. ఆయా అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించాక అవసరమైనే మరింత పొడవైన కిర్పన్‌కు అనుమతిస్తామని పేర్కొంది.
కాగా.. సెప్టెంబర్‌లో యూనివర్సిటీలోని ఓ సిక్కు విద్యార్థికి బేడీలు వేసిన ఘటన వైరల్ అయిన విషయం తెలిసిందే. అతడి వద్ద కత్తి(కిర్పన్) ఉన్న విషయాన్ని గమనించిన కొందరు ఫిర్యాదు చేయడంతో చివరకు అతడి చేతికి బేడీలు పడ్డాయి. కిర్పన్‌కు ఉన్న మతపరమైన ప్రాముఖ్యాన్ని వివరించే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయిందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో..యూనివర్సిటీ అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వివిధ సిక్కు సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలను సంప్రదించి యూనివర్సిటీ విధానంలో మార్పులు చేశారు.
Updated Date - 2022-11-21T00:27:27+05:30 IST