RIP Chalapatirao: ఇదొక పెద్ద రన్నింగ్ రేసు.. పరిగెడుతూనే ఉండాలి
ABN, First Publish Date - 2022-12-25T10:55:50+05:30
టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండ్రోజుల క్రితం నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సోమవారం మరో విలక్షణ నటుడు చలపతిరావు (78) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
టాలీవుడ్‌ను (Tollywood actor)వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండ్రోజుల క్రితం నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సోమవారం మరో విలక్షణ నటుడు చలపతిరావు (Actor Chalapatirao)(78) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఐదున్నర దశాబ్దాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడీయన్, ప్రతినాయక ఛాయలున్న విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. 1200లకు (Acted in 1200 movies) పైగా చిత్రాల్లో నటించిన ఆయన మూడుతరాల నటులతో స్ర్కీన్ షేర్ చేసుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డైలాగ్ డెలివరీ, పాత్రకు తగ్గ మ్యానరిజంతో మెప్పించడం ఆయనలో ప్రత్యేకత. ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ఆయన్ను చలపాయ్ అనీ, బాబాయ్ పిలుచుకునేవారు. కళామతల్లి నమ్ముకున్నవారికి ద్రోహం చేయదు. ఎంతమంది తన వచ్చిన అన్నం పెడుతుంది అని నమ్మే వ్యక్తి ఆయన. కాకపోతే ఇదొక పెద్ద రన్నింగ్ రేసు. పరిగెడుతూనే ఉండాలి. పడిపోయినవాడు అలాగే ఉంటాడు. పరిగెత్తవాడు ముందుకెళ్తూనే ఉంటాడు అని చెబుతుండేవారాయన. పొట్ట చేత్తో పట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ కళామతల్లి అన్నం పెట్టింది అని తరచూ అంటుండేవారు చలపతిరావు.
చలపతిరావు పూర్తి పేరు తమ్మారెడ్డి చలపతిరావు, కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు గ్రామంలో 1944 మే 8న జన్మించారు. చలపతిరావు తండ్రిపేరు మణియ్య. తల్లి పేరు వియ్యమ్మ. భార్య పేరు ఇందుమతి. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. కుమారుడు రవిబాబు టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. ముగ్గురు పిల్లలు పుట్టిన కొన్నేళ్లకే చలపతిరావు భార్య అగ్ని ప్రమాదంతో మరణించారు. చెన్నైలో ఉండగా ఉదయాన్నే మంచినీళ్లు పట్టేందుకు వెళ్లిన ఇందుమతి చీరకు నిప్పంటుకుంది. వాటిని ఆర్పడానికి పెద్దగా కేకలు పెట్టడంతో చలపతిరావు పరుగున వెళ్లి మంటలు ఆర్పారు. ఆస్పత్రిలో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆ తర్వాత చలపతిరావు మరో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఉంటున్నారు.
సినీ ప్రస్థానం..
1966లో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు 22 ఏళ్లు. సూపర్‌స్టార్ కృష్ణ సూపర్‌హిట్ చిత్రం గూఢచారి 116.. చలపతిరావు నటించిన తొలి చిత్రం. ఆ తర్వాత 1967లో సాక్షి చిత్రంలో ఓ పాత్ర పోషించారు. తదుపరి రెండేళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు. 1969లో మూడో అవకాశం ‘బుద్ధిమంతుడు’ చిత్రంతో వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసింది లేదు. వరుస చిత్రాలు, విజయాలతో ముందుకుసాగారు. విలన్, రేపిస్ట్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు పొందారు. ‘నిన్నేపెళ్లాడతా చిత్రంలో నాగార్జునకు తండ్రిగా నటించడం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెబుతుండేవారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆయన సత్తా చాటారు. జగన్నాటకం, కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంటుగారి అల్లుడు, అర్థరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి చిత్రాలను ఆయనే నిర్మించారు.
ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం...
సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది.‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేేస్త, చలపతిరావు ఐదు వేషాలు వేశారు. అలాగే ఎన్టీఆర్ ‘శ్రీరామ పట్టాభిషేకం’లో రాముడిగా, రావణాసురుడుగా నటించారు. ఆ చిత్రంలో రావణుడి తనయుడు ఇంద్రజిత్ వేషం చలపతిరావుకు ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌తో చలపతిరావు నటించిన తొలి చిత్రం 1969 లో వచ్చిన ‘కథానాయకుడు’. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. ‘యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్ రాముడు’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ఆది, ‘బొమ్మరిల్లు, ‘అరుంధతీ’ ‘సింహా’, ‘లెజెండ్’, కిక్, వంటి చిత్రాల్లో తనదైన శైలి పాత్రలతో మెప్పించారు. ‘యమగోల మళ్లీ మొదలైంది’, ‘యమజాతకుడు’ చిత్రంలో ఆయన యుముడిగా నటించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు తెరపై కనిపించలేదు. రెండ్రోజుల క్రితం కూడా చలపతిరావు తన కుమారుడు రవిబాబు తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో పాత్ర చేశారు.
Updated Date - 2022-12-25T11:28:12+05:30 IST