Viral: మనం ఓసారి కలుద్దామంటూ మాజీ భర్త నుంచి ఈమెయిల్.. చివరికి..
ABN, First Publish Date - 2022-11-11T17:16:00+05:30
విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్తకు పంపిన ఒక్క ఈ మెయిల్‌తో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్తకు పంపిన ఒక్క ఈ మెయిల్‌తో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరిగింది. విడాకుల తరువాత..కనీసం పలకరించుకోవడం మానేసిన వారు ఆ తరువాత మళ్లీ ప్రేమలో పడ్డారు. మరోసారి వివాహబంధంలో ఒక్కటయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఆస్ట్రేలియాలో(Australia) జరిగిన ఈ ఉదంతం(Love story) ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
డానీల్ కర్టిస్.. టిమ్ కర్టిస్(Tim curtis).. 2004లో తొలిసారిగా పెళ్లి చేసుకున్నారు. అంతకుమునుపు రెండేళ్ల క్రితం ఓ డేటింగ్ ప్లాట్‌ఫాం ద్వారా వారు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పటికే డానీల్‌కు ఇద్దరు పిల్లలు. అయితే.. టిమ్ తనకు తగిన వాడని నిశ్చయించుకున్న ఆమె చివరకు అతడిని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఆ తరువాత.. 2012 వరకూ వారి సంసారం ఏ చీకూచింతా లేకుండా గడిచిపోయింది. అప్పట్లో ప్రపంచదేశాలన్నీ ఆర్థిక ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలోనే టిమ్ మరో ఉద్యోగం కోసం భార్యకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది.
కొత్త ఉద్యోగంలో టిమ్ బాగా బిజీ అయిపోయాడు. దీంతో.. వారి మధ్య మాటలు తగ్గిపోయాయి. మరోవైపు.. డానీల్ కూడా తన వ్యాపారం, పిల్లల పెంపకంతో తీరిక లేకుండా గడపసాగింది. టిమ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. కానీ.. వారి బంధం క్రమంగా బలహీనపడింది. ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపుతూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ తీరుతో విసిగిపోయిన డానీల్ విడాకులు ఇచ్చేందుకు నిశ్చయించుకుంది. 2015లో అతడికి విడాకుల నోటీసులు పంపించింది. ఆ తరువాత వారు విడిపోయారు. కనీసం పలకరించుకోవడం, ఈమెయిల్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవడం కూడా మానేశారు. పిల్లల బాధ్యతలు మాత్రం ఎలాగొలా కలిసి నిర్వహించేవారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ వేరే వ్యక్తులతో డేటింగ్ చేసినా.. ఏదీ సుదీర్ఘ అనుబంధంగా మారలేదు. మనోవేదన అనుభవిస్తున్న డానీల్ కౌన్సెలింగ్ తీసుకోవడం ప్రారంభించింది. ఇక 2017లో కౌన్సిలర్ డానీల్‌కు ఓ సలహా ఇచ్చారు. వివాహ బంధం తెగిపోయినందుకు తన మాజీ భర్తను నిందించడం మానాలనీ, అదే సమయంలో తన తప్పులను కూడా గుర్తించాలని సలహా ఇచ్చారు.
ఈ క్రమంలో ఆమె తన మాజీ భర్త టిమ్‌కు ఓ ఈమెయిల్ పెట్టింది. జరిగిన దాంట్లో ఇద్దరిదీ తప్పుందని చెప్పింది. అంతేకాకుండా..తన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అతడిని కోరింది. ఇది జరిగిన ఆరు నెలల తరువాత.. టిమ్ నుంచి ఆమెకు అనూహ్యంగా ఓ ఈమెయిల్ వచ్చింది. మనం ఓసారి కలుద్దాం అంటూ అతడు ఆమెను కోరాడు. మొదట తటపటాయించిన ఆమె ఆ తరువాత అంగీకరించింది. దీంతో.. మళ్లీ వారు ఓ రెస్టారెంట్‌లో కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నారు. అలా వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించింది. అయితే..ఇదంతా తమ సంతానానికి చెప్పకుండానే సీక్రెట్‌గా కలుసుకునేవారు. తమ బంధం ఎటుపోతోందో వారికే తెలీని పరిస్థితి. ఇక తాము మళ్లీ ఒక్కటవుతున్నామన్న ఆశను పిల్లల్లో అనవసరంగా కలిగించడం ఇష్టం లేకే వారు తమ బంధం గురించి మొదట్లో పిల్లల వద్ద దాచారు. క్రమంగా వారి ప్రేమ(Love) చిక్కబడటంతో మరోమారు పెళ్లి చేసుకునేందుకు డిసైడయ్యారు.
Updated Date - 2022-11-11T17:22:28+05:30 IST