IFFI53: తెలుగు సినిమాకి ఇంత అవమానమా?
ABN, First Publish Date - 2022-11-19T09:34:16+05:30
దేశమంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోంది. టాలీవుడ్ ఖ్యాతిని, కీర్తిని పొగుడుతోంది. అయినా.. అవార్డులు, చలన చిత్రోత్సవాలలో తెలుగు సినిమాకి
దేశమంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోంది. టాలీవుడ్ ఖ్యాతిని, కీర్తిని పొగుడుతోంది. అయినా.. అవార్డులు, చలన చిత్రోత్సవాలలో తెలుగు సినిమాకి చిన్నచూపే. ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్న 53వ ఇఫా (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI) చిత్రోత్సవాలలోనూ ఇదే వైఖరి పునరావృతం అవుతోంది. ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు నుంచి కేవలం రెండు చిత్రాల్ని ఎంపిక చేశారు. అందులో ‘అఖండ’ (Akhanda), ‘సినిమా బండి’ (Cinema Bandi). కాకపోతే ‘అఖండ’ ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ సినిమా నిండా హింస, రక్తపాతం, అభూత కల్పన ఉన్నాయని, మేటి చిత్రాలు ప్రదర్శించే వేదికపై ‘అఖండ’ని తీసుకెళ్లడం ఏమిటని? ఇంతకంటే ఉత్తమ చిత్రాలు తెలుగులో చాలా ఉన్నాయని రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపించాయి.
తెలుగు చిత్రసీమ నుంచి వి.ఎన్.ఆదిత్య (VN Aditya), ప్రేమ్‌రాజ్ (PremRaj) ఈసారి జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ తెలుగు సినిమాకి మొండి చేయి చూపించడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడితో అయిపోలేదు. ‘ఇఫా’ ముద్రించిన కేటలాగ్‌లోనూ తప్పు దొర్లింది. ‘జీవన తరంగాలు’ సినిమాని హిందీ చిత్రంగా పేర్కొంది ‘ఇఫా’. ఇటీవల మరణించిన సినీ ప్రముఖులను గుర్తు చేసుకొంటూ హోమేజ్ అనే విభాగం ఉంది. అందులో భాగంగా...కృష్ణంరాజు, తాతినేని రామారావుల పేర్లున్నాయి. వీరిద్దరి స్మృతికి చిహ్నంగా ‘జీవన తరంగాలు’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సినిమాలో హీరో శోభన్‌బాబు. కృష్ణంరాజుది నెగిటీవ్ పాత్ర. కృష్ణంరాజు నటించిన ఇన్ని గొప్ప సినిమాలు ఉండగా.. శోభన్ బాబు హీరోగా నటించిన ‘జీవన తరంగాలు’ని ఎందుకు ఎంచుకొన్నారో అర్థం కాదు. (IFFI 2022)
ఇండియన్ రీస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ‘శంకరాభరణం’ (Sankarabharanam)ని ఎంపిక చేశారు. ‘శంకరాభరణం’ని చిత్రోత్సవాలలో ప్రదర్శించడం చాలా ఏళ్లుగా అలవాటైపోయిన వ్యవహారం. ‘శంకరాభరణం’ నిజంగా గొప్ప క్లాసిక్. ఆ విషయంలో మరో మాట లేదు. కాకపోతే.. తెలుగు సినిమా ఖ్యాతి కేవలం ‘శంకరాభరణం’ దగ్గరే ఆగిపోయినట్టు అదే సినిమాని మళ్లీ మళ్లీ ప్రదర్శనకు ఉంచడం అంత సముచితంగా లేదు. ‘శంకరాభరణం’ తరవాత కూడా తెలుగు నాట గొప్ప చిత్రాలొచ్చాయని ‘ఇఫా’ జ్యూరీ గుర్తించలేకపోయింది. ఈనెల 28 వరకూ గోవాలో సాగే ఈ చిత్రోత్సవాల్లో వివిధ భారతీయ భాషల నుంచి సుమారు 60 చిత్రాల్ని ప్రదర్శించబోతున్నారు. (IFFI53)
Updated Date - 2022-11-19T09:51:25+05:30 IST