అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..
ABN, First Publish Date - 2022-05-13T23:32:49+05:30
అది రద్దీగా ఉన్న ప్రాంతంలోని ఓ బిల్డింగ్. అందులోని ఓ గది నుంచి రోజూ కుక్కలు అరుస్తున్న శబ్ధాలు వస్తుండేవి. పెంపుడు కుక్కలు అరుస్తున్నాయని మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు...
అది రద్దీగా ఉన్న ప్రాంతంలోని ఓ బిల్డింగ్. అందులోని ఓ గది నుంచి రోజూ కుక్కలు అరుస్తున్న శబ్ధాలు వస్తుండేవి. పెంపుడు కుక్కలు అరుస్తున్నాయని మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఆ గది నుంచి దుర్వాసన రావడం ఎక్కువైంది. దీంతో అనుమానం వచ్చి చూడగా షాకింగ్ దృశ్యం కనిపించింది. 11ఏళ్ల అబ్బాయిని ఓ గదిలో బంధించి, 22 వీధి కుక్కలను అందులో వదిలారని.. ఇదంతా ఆ బాలుడి తల్లిదండ్రుల నిర్వాకమే అని తెలుసుకుని అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పూణె పరిధిలోని కొంద్వా ప్రాంతంలో సంజయ్ లోధియా, శీతల్ లోధియా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సంజయ్ లోధియా దంపతులకు కుక్కలు పెంచుకోవడం అంటే ఇష్టం. దీంతో పలు ప్రాంతాల నుంచి తరచూ వీధి కుక్కలను ఎత్తుకొచ్చి పెంచుకునేవారు. ఇలా చాలా కుక్కలను సేకరించారు. రెండేళ్ల క్రితం కరోనా లాక్‌డౌన్ సమయంలో వారి ఇంట్లో ఉన్న 22కుక్కలను సమీపంలోని ఓ ఇంట్లో బంధించారు. కుక్కలపై వారికి ఉన్న ఇష్టం.. చివరకు శాడిజంగా మారింది. తమ కొడుక్కి కూడా కుక్క లక్షణాలు రావాలని అనుకున్నారో ఏమో తెలీదు గానీ.. తమ కుమారుడిని కుక్కలతో కలిపి గదిలో బంధించారు. తరచూ భోజనం అందిస్తూ వచ్చేవారు. రెండేళ్లుగా బాలుడు కుక్కలతో గడపడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.
భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..
నిత్యం కుక్కల అరుపులు, వాటి చేష్టలు చూసి తాను కూడా అలా చేయడం మొదలెట్టాడు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో వారం రోజుల క్రితం స్థానికులకు అనుమానం వచ్చింది. కిటికీ వద్ద కూర్చున్న బాలుడు కుక్కలా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. బాలుడిని రక్షించారు. మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి, చికిత్స నిమిత్తం బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం పాఠశాలకు వెళ్లిన బాలుడు.. కుక్కలా ప్రవర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారించారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.