ఇలా ఉన్న ఆమె.. ఇలా అయిపోయింది.. టాటూల పిచ్చితో కంటిచూపు పోగొట్టుకున్న మహిళ..!
ABN, First Publish Date - 2022-12-09T15:36:22+05:30
మోడల్ లుక్ పొందాలనే కోరికతో తాను కూడా
చిన్నపిల్లలు అల్లరిగా ఉంటారు. పిల్లల అల్లరి వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే.. పెద్దలు వారిని దండిస్తూ ఉంటారు. అయితే పెద్దలే ముందు వెనుకా ఆలోచించకుండా పిచ్చి పనులు చేసి తీరని నష్టాన్ని మీదకు తెచ్చుకుంటే.. ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఓ మహిళకు పచ్చబొట్టుల మీద ఉన్న పిచ్చి ఆమె కంటిచూపును కోల్పోయేలా చేసింది. ఈ సంఘటన గురించి వివరాల్లోకి వెళితే..
ఐర్లాండ్ దేశానికి చెందిన అనయ అనే మహిళ వయస్సు 32సంవత్సరాలు. ఈమెకు టాటూలు అంటే చెప్పలేనంత పిచ్చి. ఆస్ట్రేలియన్ మోడల్ అంబర్ లూక్ను చూసి అనయ ఆశ్చర్యపోయింది. మోడల్ లుక్ పొందాలనే కోరికతో తాను కూడా పచ్చబొట్టు పొడిపించుకోవాలని అనుకుంది. అలా అనుకుందో లేదో దానికోసం సిద్ధమైపోయింది. అయితే అనయకు 7సంవత్సరాల కూతురుంది. ఆ అమ్మాయి అనయతో నువ్వు పచ్చబొట్టు వేయించుకున్న తరువాత గుడ్డిదానివి అయిపోతే ఎలా అంటూ సందేహం కూడా వ్యక్తం చేసింది. కానీ అనయ ఆమె కూతురు మాటలు లెక్కచేయలేదు. పైగా ఆమెకు ఆ పాప మాటలు నవ్వు తెప్పించాయి. ముందు వెనుకా ఆలోచించకుండా తను అనుకున్నట్టు టాటూ సెంటర్కు వెళ్ళింది. అక్కడ కనుబొమ్మల మీద నీలిరంగుతో కూడిన టాటూ వేయించుకుంది. అయితే ఆ పచ్చబొట్టు వేయించుకన్న మూడువారాల తరువాత ఆమె తన చూపును కోల్పోయింది. తనకేమీ సరిగా కనిపించడం లేదంటూ వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఆమెను పరీక్షించి పచ్చబొట్టు ప్రభావం వల్ల ఆమెకు చూపు పోయినట్టు స్పష్టం చేశారు. చూపు తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పారు.
ఇదంతా జరిగిన తరువాత ‘నా కూతురు చిన్నది అయినా తన మాట విని ఉంటే బావుండేది. రెండుకళ్ళకు ఒకేసారి టాటూ వేయించుకోకుండా కనీసం మొదట ఒకటి వేయించుకుని ఆ తరువాత మరొకటి ప్రయత్నించి ఉండాల్సింది. అలా చేసుంటే ఒక కంటితో అయినా ప్రపంచాన్ని చూసే వీలుండేది’ అంటూ తన బాధను వ్యక్తం చేసింది. కాగా ఈమె చేసిన పనికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదంటున్నారు కొందరు నెటిజన్లు.
Updated Date - 2022-12-09T16:24:52+05:30 IST