Bhanumathi Death Anniversary: ఏమే డైలాగ్ చూసుకున్నావా.. అన్న డైరెక్టర్.. ఏమిట్రా చూసుకునేదన్న భానుమతి.. చివరకు..!
ABN, First Publish Date - 2022-12-24T12:49:14+05:30
‘మీరు అక్కినేని, ఎన్టిఆర్ల సరసన నాయికగా పలు చిత్రాల్లో నటించారు. వాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ఓ తారను ప్రశ్నించాడు. ‘వాళ్లతో నేను నటించడం ఏమిటి? నాతోనే వాళ్లు నటించారు’ అని ఆ తార సమాధానం చెప్పింది.
చిత్రసీమలో ఏకైక ‘చండీరాణి’ భానుమతి
నేడు భానుమతి వర్ధంతి
‘మీరు అక్కినేని, ఎన్టిఆర్ల సరసన నాయికగా పలు చిత్రాల్లో నటించారు. వాళ్లపై మీ అభిప్రాయం ఏమిటి’ అని ఒకసారి ఓ పాత్రికేయుడు ఓ తారను ప్రశ్నించాడు. ‘వాళ్లతో నేను నటించడం ఏమిటి? నాతోనే వాళ్లు నటించారు’ అని ఆ తార సమాధానం చెప్పింది. మరి ‘అలా చెప్పగలిగే నటీమణి ఎవరు?’ అని ‘క్విజ్’లో అడిగినట్లు అడిగితే, సినిమా అభిమానులంతా ఏకగ్రీవంగా చెప్పే సమాధానం ‘చండీరాణి’ భానుమతి అని.
అదీ ఆమె వ్యక్తిత్వం. భానుమతి బహుముఖ ప్రజ్ఞ మన తెలుగు చిత్రసీమకే పరిమితం కాలేదు. ఆమె తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా రాణించి, తెలుగు ఖ్యాతిని జాతీయ స్ధాయికి విస్తరింపచేశారు. దక్షిణాది నటీమణుల్లో తొలిసారి పద్మశ్రీ గౌరవాన్ని ఆమె అందుకున్నారు. చండీరాణి (1953)తో తెలుగులో దర్శకత్వం వహించిన తొలి మహిళగానే కాకుండా ఆ చిత్రాన్ని మూడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం) తీసి అటువంటి ఫీట్ చేసిన మొట్టమొదటి దర్శకురాలిగా ఆమె ఖ్యాతి సంపాదించారు. అలాగే ఒక నటీమణి ఐదు దశాబ్దాలకు పైగా చిత్రరంగంలో తన పలుకుబడిని కొనసాగించడమూ విశేషమే. ఇలా భానుమతి ప్రత్యేకతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. నటి, రచయిత్రి, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత, ఎడిటర్, చిత్రకారిణి, జ్యోతిష్కురాలు, సోషల్ వర్కర్. ఇలా వివిధ విభాగాలలో ఆమె చేసిన కృషిని మనం పరిశీలించవచ్చు. అయితే మనవాళ్లు ఇతర భాషల్లో సాధించిన ఘనత అనే కోణంలో ఓ విహంగ వీక్షణంగా చూస్తే, భానుమతి చేసిన కృషి అసాధారణమనే చెప్పాలి.
నిజానికి భానుమతి కాలంలో ఇతర భాషా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న వారిలో టంగుటూరి సూర్యకుమారి (హిందీలో వతన్, ఉడన్ భటోలా వంటి చిత్రాలు) కన్నాంబ, అంజలీదేవి వంటి వారున్నారు. కానీ ఆ నటీమణులకు భానుమతికి లభించినంత ఖ్యాతి, కీర్తి దక్కలేదు. (సావిత్రి ఆ తర్వాతే రంగప్రవేశం చేశారు)
తమిళంలోకి భానుమతి ఎలా ప్రవేశించారు?
భానుమతి తొలి చిత్రం సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘వరవిక్రయం’ (1939). ఆ తర్వాత మాలతీ మాధవం, ధర్మపత్ని, భక్తిమాల, కృష్ణప్రేమ, గరుడ గర్వభంగం, తాసిల్దారు చిత్రాలలో నటించారు. ‘కృష్ణప్రేమ’ (1943)లో నటిస్తున్నప్పుడు ఆ చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న రామకృష్ణ ప్రేమలో పడ్డారు. ‘పెంకిఘటం, మొండిఘటం అయిన భానుమతిని మీరెలా పెళ్లి చేసుకున్నారు?’ అని రామకృష్ణ సన్నిహితులెవరైనా ఆయనను అడిగితే, ‘నేను చేసుకోలేదు. ఆమే నన్ను పెళ్లి చేసుకుంది’ అనే వారు నవ్వుతూ.
సినిమాల్లో అయినా, నిజ జీవితంలో అయినా సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల వెంట పడతారు ప్రేమించమంటూ. కానీ భానుమతిలాంటి తార విషయంలో ఈ కథ రివర్స్‌గా నడిచింది. రామకృష్ణగారు ‘కృష్ణప్రేమ’కు సహాయ దర్శకుడుగా తన పనేమిటో తానేమిటో అన్నట్టుగా ఉండేవారు. ఆయన క్రమశిక్షణ, ఆ ధోరణిని చూసి అందరూ మెచ్చుకోవడం భానుమతి గమనించింది. మొదట ఆరాధనా భావం ఏర్పడింది. ఆ తర్వాత అది ఆయనపై ప్రేమను పెంచింది. ‘ఆయనంత పిరికి మనిషి ఎక్కడా ఉండరు. నేను ప్రేమిస్తున్నట్లు ఎన్ని సంకేతాలు ఇచ్చినా నో రెస్పాన్స్! రోజులు గడిచేకొద్దీ నాలో టెన్షన్. ఇంటిదగ్గర మా అమ్మానాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. దాదాపు ఖాయం అయ్యేలా ఉంది. పోనీ ధైర్యంచేసి నా ప్రేమ విషయం నాన్నకు చెబుదామంటే, ఆయనకు వారు నచ్చరని నా గట్టి నమ్మకం. మా నాన్నకు ఆస్తిపరుడు, ఆజానుబాహువు, సంగీత ప్రియుడు, ఇంకా ఏవేవో క్వాలిఫికేషన్లు ఉన్న అల్లుడు కావాలి. ఈయనలో అవేమీ లేవు. ఆస్తిపరుడు కాదు. నెలకు వచ్చే జీతం తప్ప వేరే ఆస్తిలేదు. ఆజానుబాహువు అసలే కాదు. నాకంటే ఒక్క అంగుళం పొడుగు. ఇక వూరికే ఉంటే లాభం లేదని, ఒకరోజు సాయంత్రం చీకటిపడిన తర్వాత రిక్షాలో ఆయన రూమ్కు వెళ్లాను. నేను గదిలో అడుగు పెట్టగానే ఆయనకు కంగారు, చెమటలు. నేను సిగ్గువిడిచి చెప్పాను. ‘పెళ్లి చేసుకుందాం’ అని. ఆయన గారి ‘రియాక్షన్’ చూడాలి. ‘ఇదిగో చూడమ్మాయ్ బాగా ఆలోచించుకో. నువ్వు స్టార్‌వి. నేను ఎడిటర్‌ను (ఆయన ఎడిటింగ్ కూడా చేసేవారు) నాకు వచ్చే జీతం నెలకు యాభై రూపాయలు. దాంతో నిన్ను ఎలా పోషించగలను? బాగా ఆలోచించుకో’ అని సలహాలు, నీతులు చెప్పారు. తనంతట తాను సిగ్గువిడిచి, ఒక ఆడపిల్ల వచ్చి పెళ్లి చేసుకోమంటే ఇలా ఏ మగాడైనా మాట్లాడతారా’ అని ఓ సందర్భంలో భానుమతి సరదాగా తన ప్రేమకథ గురించి చెప్పారు.
భానుమతి అప్పటికే ‘స్టార్’ అయినా ఆమెకు స్వతహాగా ఈ సినిమా పటాటోపాలు అవీ నచ్చేవి కావు. సాధారణంగా, నిరాడంబరంగా ఓ మధ్య తరగతి వనితలా ఉండడానికే ఇష్టపడేవారు. అందుకే పెళ్లయిన తర్వాత తను సినిమాలకు దూరంగా, గృహిణిగా స్ధిరపడాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే బి.ఎన్. రెడ్డిగారు తను తీయబోయే ‘స్వర్గసీమ’ (1945)లో మాత్రం నటించి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా సరేనని పట్టుబట్టి భానుమతిని, రామకృష్ణను అంగీకరింప చేశారు. ‘స్వర్గసీమ’ చిత్రం విడుదలయ్యాక దక్షిణాదిలో సంచలనాన్ని సృష్టించింది. అప్పట్లోనే భానుమతీ రామకృష్ణ దంపతులకు పుత్రోదయమైంది. బిడ్డను మంచిస్థాయిలో పెంచాలనే ఉద్దేశంతో తను చిత్రసీమలో కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నారు భానుమతి.
‘స్వర్గసీమ’ చిత్రం చూసిన తమిళ దర్శక నిర్మాతలు ఆమెకు తమిళ చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. భానుమతి తమ కుమారుడు భరణి నెలబిడ్డగా ఉన్నపుడు ‘రత్నకుమార్’ అనే తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. పి.యు. చిన్నప్ప అనే ప్రముఖ గాయక నటుడు హీరో. ఆ చిత్రంలో ఎంజిఆర్ (తర్వాత పెద్ద హీరోగా ప్రజాదరణ పొంది, తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మన ఎన్టీఆర్లాగే) ఓ చిన్న వేషం వేశారు.
ఆ తర్వాత ఎ.టి. కృష్ణస్వామిగారి దర్శకత్వంలో ‘రాజయోగి’ అనే చిత్రంలో నటించినా ఆ చిత్రం ఏవో సమస్యల కారణంగా విడుదల కాకపోయినా, ఆ చిత్రంలో భానుమతి పాడిన పాటలకు మంచి పేరొచ్చింది. అనంతరం తమిళ గాయక నటుడు, ఎంకె త్యాగరాజ భాగవతార్ తీసిన ‘రాజముక్తి’ చిత్రంలో పప్రధమంగా ఎం.జి.ఆర్. సరసన నటించారు. ఆ చిత్రంలోనే వి.ఎన్. జానకిగారు కూడా నాయిక పాత్ర ధరించారు. (ఆ తర్వాత ఆమె ఎంజిఆర్ రెండో సతీమణి అయ్యారు. ఎంజిఆర్ మరణానంతరం కొన్ని రోజులపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు) ‘రాజముక్తి’ చిత్రంలో భానుమతి అన్నగా ఎంజిఆర్ అన్నగారైన ఎంజి చక్రపాణి నటించడం మరో విశేషం.
అనంతరం ప్రసిద్ధ తమిళ హాస్య జంట ఎన్.ఎస్. కృష్ణన్, టి.ఎ. మధురం నిర్మించిన ‘నల్లతంబి’ అనే చిత్రంలో ఓ ముఖ్య పాత్ర ధరించారు భానుమతి. ఈ చిత్రంలో క్లియోపాత్రా నాటక ప్రదర్శన ఘట్టం ఉంటుంది. అందులో భానుమతి క్లియోపాత్రాగా నటించి, ఓ ఇంగ్లీషు పాట పాడి, నాట్యం చేయడం ఓ విశేష ఘట్టం. ఆ సంవత్సరమే అంటే 1949లో ‘లైలామజ్ను’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తమ సొంత బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో భానుమతి, అక్కినేని నాయికా నాయకులుగా నటించారు. ఇది భరణి సంస్ధ రెండో చిత్రం. అంతకుముందు రత్నమాల (1948) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాలకు పిఎస్ రామకృష్ణ దర్శకత్వం వహించారు.
శివాజీగణేశన్ అభిమాన నటి భానుమతే!
ఉత్తమ భారతీయ సినీ కళాకారుడుగా ఫ్రెంచి ప్రభుత్వపు విశిష్ట పురస్కారం ‘షెవాలియర్’ సత్కారాన్ని అందుకున్న తొలి ప్రముఖుడు సత్యజిత్రాయ్ అయితే రెండవ ప్రముఖుడు ప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్. (ఆ తర్వాత ఇటీవలే కమల్హాసన్ కూడా ఆ గౌరవాన్ని పొందారు) శివాజీ గణేశన్ చిత్రరంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో భానుమతి నటించిన ‘స్వర్గసీమ’ను దాదాపు 16సార్లు చూసినట్లు ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. ఆ చిత్ర విజయంలో భానుమతి గారికి ఓ ప్రత్యేక స్ధానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాంటి భానుమతితో నాయకుడుగా నటించే అవకాశం శివాజీ గణేశన్కు ‘కల్వనిన్ కాదలి’ (ఓ దొంగ ప్రేమించిన యువతి అని అర్ధం) అనే తమిళ చిత్రంలో లభించింది. ఆ తర్వాత మక్కలై పెట్ర మహరాశి’, రంగూన్ రాధ, తెనాలి రామన్ (తెలుగులో తెనాలి రామకృష్ణ) మొదలైన చిత్రాలలో కలిసి నటించారు. ‘రంగూన్ రాధ’ చిత్ర విజయోత్సవ సభలో ప్రముఖ రచయిత, తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన సి.ఎన్. అన్నాదురై గారు బానుమతి నటనను ప్రశంసిస్తూ ఆమెను ‘నడిప్పుక్కొరు ఇలక్కణం’గా (నటనకు వ్యాకరణం) అభివర్ణించారు. అదే ఆ తర్వాత ఆమెకు తమిళ ప్రేక్షక హృదయాల్లో ఓ బిరుదుగా మారింది.
ఎంజిఆర్‌తో నాయికగా..
భానుమతి, ఎంజిఆర్ నాయికా నాయకులుగా నటించిన ‘అలీబాబా నా పది తిరుడర్గళ్’ (తెలుగులో అలీబాబా 40 దొంగలు (1956)గా) విడుదలైంది. అంతకు ముందు అంటే 1954లో భానుమతి ఎన్టీఆర్ సరసన ‘అగ్గిరాముడు’లోను, అదే ‘మలైకళ్లన్’ పేరుతో తీయగా ఎంజిఆర్‌కు జంటగానూ నటించారు. ఈ చిత్రాలేకాక ఆ తర్వాత ఎంజిఆర్‌తో నటించిన దాదాపు అన్ని చిత్రాలూ ఘన విజయం సాధించాయి. ఇలా ఇద్దరు అగ్ర హీరోల సరసన విభిన్న తరహా పాత్రలు ధరించి, రాణించిన భానుమతి తమిళ ప్రేక్షక హృదయాల్లో ఓ ప్రత్యేక స్ధానాన్ని పొందారు.
ఏ భాషా రంగానికి వెళ్లినా భానుమతి తన నటనా శైలితోనే కాకుండా, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం లోనూ ప్రత్యేకతను ప్రదర్శించే వారు. ఓ తమిళ దర్శకుడు నటీమణుల విషయంలో చాలా చులకనభావాన్ని చూపేవాడు. అతను హీరోయిన్ని అయినా, మరే నటిని అయినా ‘ఏయే.. ఇలా రా’ అని పిలిచే వాడు. ఒకసారి భానుమతి నటించిన చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ మొదటి రోజు షూటింగ్లో పాల్గొన్న భానుమతితో అలవాటు ప్రకారంగా ‘ఏయే.. డైలాగు చూసుకున్నావా’ అని అడిగాడు. భానుమతిగారు వెంటనే ‘ఏమిట్రా.. డైలాగ్ చూసుకునేది’ అని గట్టిగా అనేసరికి ఆ దర్శకుడితో సహా సెట్లో ఉన్న వారందరూ షాకయ్యారు. అంతే.. ఆ తర్వాత ఆ దర్శకుడు మళ్లీ ఎప్పుడూ మహిళల పట్ల అలా దురుసుగా మాట్లాడిన దాఖలాలు లేవు!!
భానుమతి వైఖరి
భానుమతికి స్వాతిశయం ఎక్కువనీ, ఇతరుల ప్రతిభను ఆమె ప్రశంసించడం చాలా అరుదనీ చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆమె కాంచనమాల, పుష్పవల్లి గార్ల నటనను విశేషంగా అభిమానించే వారు. ఎవిఎం వారు నిర్మించిన ‘అన్నై’ చిత్రంలో షావుకారు జానకితో ‘ఢీ అంటే ఢీ’ అనదగ్గ పాత్రల్లో ఇద్దరూ పోటీపడి నటించారు. భానుమతి నిర్మించిన ‘బాటసారి’ చిత్రంలో షావుకారు జానకి కథానాయకుడి (అక్కినేని) భార్యగా నటించారు. ఆ చిత్రంలో షావుకారు జానకి గురించి చెబుతూ ‘మా సంస్ధలో జానకిగారు నటించడం అదే ప్రధమం. తను ధరించే పాత్ర ఎటువంటిదైనా ఆ పాత్రకు జీవం పోసి, గొప్పగా మెప్పించగల వెర్సటెల్ ఆర్టిస్ట్‌గా నేనెప్పుడూ జానకిగారిని అభిమానిస్తాను. తన మనసులో అగ్నిపర్వతాలు రగులుతున్నా, పైకి ప్రశాంతంగా కనిపిస్తూ తన మానసిక క్షోభను బయటకు చెప్పుకోలేని నిస్సహాయ స్ధితికి ప్రతీకగా ఆ పాత్రలో ఆమె చూపిన హావభావాలు అద్భుతం’ అన్నారు భానుమతి.
ఎవిఎం వారు తీసిన ‘బామ్మమాట బంగారుబాట’కు మూలమైన తమిళ చిత్రంలో ప్రముఖ హాస్యనటీమణి మనోరమ (అత్యధిక చిత్రాల్లో నటించిన ఏకైక నటీమణిగా గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డస్లో స్ధానం పొందారు) నటించారు. ఆ పాత్రలో భానుమతి నటించినా, తను మనోరమ స్ధాయిలో నటించలేక పోయానంటూ ఆ భావాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ‘తెలుగులో కూడా మనోరమే చేసి ఉంటే బావుండేది’ అని భానుమతి అన్నమాట గురించి విన్న మరోరమకు ‘భానుమతి అంతటి నటీమణి అలా అనడమా’అని ఆమె విశాల హృదయానికి, ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారట!
భానుమతికి హిందీ చిత్ర విజయాలు:
భానుమతి హిందీలో ‘రాణి’, షంషేర్, నిషాన్, మంగళ, చండీరాణి చిత్రాల్లో నటించారు. మంగళ, నిషాన్ చిత్రాలను జెమిని సంస్ధ నిర్మించింది. ఈ చిత్రాలలో గీతాధర్, షంషాద్ బేగం భానుమతికి గాత్రదానం చేయడం విశషం. మంగళ (1951) తెలుగు, హిందీ భాషల్లో తయారైంది. అందుకు భానుమతి అందుకున్న పారితోషికం లక్ష రూపాయలు.
నిషాన్ కార్సికన్ బ్రదర్స్ అనే నవల (అలెగ్జాండర్ డ్యూమస్ రచన) ఆధారంగా రూపొందిన చిత్రం. తెలుగులో ‘అపూర్వ సహ•దరులు’ (1950) పేరుతో విడుదలైంది. తెలుగులో ఎంకె రాధా హీరో. హిందీలో రంజన్ నాయక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో భానుమతి పలు భాషలు కలిపి పాడిన ‘లడ్డు.. లడ్డు..’ పాట ఆరోజుల్లో ‘స్వర్గసీమ’ లోని ‘పావురమా’ పాటలాగే సూపర్హిట్ అయింది.
బాంబే టాకీస్వారు బొంబాయిలో తీసిన ‘షంషేర్’ చిత్రంలో భానుమతి అశోక్కుమార్ సరసన నాయికగా నటించారు. శాంసన్ అండ్ డివైలా అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రానికి జ్ఞాన ముఖర్జీ దర్శకుడు. ఆ చిత్రంలో నాయిక పాటలను ఆమెచేతే పాడించడమా లేక లతామంగేష్కర్ పాడడమా అనే విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. దర్శకుడు - భానుమతి పాడితేనే బాగుంటుందని తీర్మానించడంతో ఆ చిత్రంలో తన పాటలన్నీ భానుమతే పాడారు. ఒకరోజు రికార్డింగ్కి లతామంగేష్కర్ వచ్చి ఆ పాటలను విని భానుమతికి కంగ్రాట్స్ చెప్పడం చెప్పుకోదగ్గ విశేషం.
ఈ సందర్భంగా భానుమతి మరో నటికి ప్లేబ్యాక్ పాడడం గురించి కూడా చెప్పుకోవాలి. ‘చండీరాణి’ హిందీ వెర్షన్లో ఓ పాట ఉంది. ఆ చిత్రంలో ఎస్విఆర్‌కు ఉంపుడుగత్తెగా విద్యావతి (నేటి తమిళనాడు ముఖ్యమంత్రి, నాటి ప్రముఖ నటి జయలలిత తల్లిగారైన నటీమణి సంధ్యకు సోదరి) నటించారు. ఆమెపై చిత్రీకరించాల్సిన పాటను మొదట లతా మంగేష్కర్ చేత పాడించాలనుకున్నారట. కానీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఆ పాటను భానుమతిగారే పాడాల్సి వచ్చింది.
భానుమతి షంషేర్ చిత్రం షూటింగ్కు ముంబై వెళ్లినపుడు ప్రసిద్ధ నటుడు, దర్శక నిర్మాత సొహ్రాబ్ మోదిని కలుసుకోవడం తటస్ధించింది. అప్పట్లో ఆయన ఝాన్సీ రాణి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సంగతి తెలుసుకున్న భానుమతి ఝాన్సీరాణి పాత్ర పట్ల తనకున్న అభిమానంకొద్దీ ఆ పాత్రను ధరించడానికి సుముఖతను వ్యక్తం చేశారు. అందుకు ఆయన భానుమతి అర్హతను ప్రశంసిస్తూనే, తన భార్య మెహతాబ్ ఆ పాత్రను ధరించనున్నట్లు చెప్పారు. తనకు తానుగా ఓ పాత్రను ధరించడానికి ఆసక్తిని ప్రకటించడం భానుమతి చలనచిత్ర జీవితంలో అదే మొదటిసారి. ఆఖరుసారి కూడా.
గాయనిగా..
భానుమతి గాయనీమణుల్లో ఎస్.వరక్ష్మి, పి.లీల, పి.సుశీల, లతామంగేష్కర్ గార్లను విశేషంగా అభిమానించే వారు. గాయనిగా ఆమె ప్రతిభ, పాడిన పాటలు ప్రేక్షకాభిమానులకు సుపరిచితాలే. ఆమె ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ను నిశితంగా గమనిస్తూ, తదనుగుణంగా వ్యవహరించే వారు. అందువల్లే ‘పత్తుమాద బంధం’ అనే తమిళ చిత్రంలో ఓ ఆంగ్ల గీతాన్ని ఉషాఉతప్తో కలిసి సమర్ధంగా పాడగలిగారు. అలాగే ‘తోడు నీడ’లో ఆమె పాడిన ఆంగ్ల గీతం ‘వెన్ ఐ వాజ్ జస్ట్ ఎ లిటిల్ గర్ల్.. ఐ ఆస్క్డ్ మై మదర్.. విల్ ఐ బి ప్రెటీ, విల్ ఐ బి రిచ్’ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
చిత్రరంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన భానుమతి ఆ తర్వాతి రోజుల్లో బుల్లితెరను కూడా అభిమానించారు. సినిమాపై ఉత్తమ పుస్తకంగా జాతీయ బహుమతి గెల్చుకున్న ఆత్మకథా కథనం ‘నాలో నేను’ (విజయచిత్ర పత్రికలో ప్రచురితం) ఆధారంగా ఆమె ‘తామరాకుపై నీటిబొట్టు’ ధారావాహిక తీసి, జెమినిలో ప్రసారం చేయించారు.
ఒక నటీమణి తన జీవిత కథను తనే సీరియల్గా తెరకెక్కించడం అసాధారణమని ఆరోజుల్లో ఆమె అభిమానులు ప్రశంసించారు. అలాగే ఆంధప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెల్చుకున్న తన ‘అత్తగారి కథలు’ పుస్తకంలోని కొన్ని కథలను కూడా బుల్లితెరకెక్కించారు. ఈ కథల్లో భానుమతి అత్తగారిగా, గీతాంజలి కోడలుగా నటించారు.
భానుమతి కన్నడ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘నలదమయంతి’ (1957) అనే చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించగా ఆ చిత్రాల్లో ఆమె దమయంతిగా, కెంపరాజ్ నలుడుగా నటించారు.
తెలుగులో ఆమె ధరించిన పాత్రల వైవిధ్యం గురించి, ఆమె నటనా ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఏ భాషలో నటించినా పండితులు, పామరుల ప్రశంసలను ఒకేరీతిలో పొందగలిగారు. జాతీయస్ధాయిలో ఆమెకు గల ప్రజాదరణను గమనించి, ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గంలో ఆమెను ఎన్నికల్లో పోటీ చేయమని కోరినా రాజకీయాలు తనకు పడవని ఆమె సున్నితంగా తిరస్కరించారు.
ఇక భానుమతికి వచ్చిన పురస్కారాలు ఒకటీ రెండూ కావు. తెలుగులోనే కాకుండా తమిళ ప్రభుత్వ రంగాలు కూడా ఆమెను విశేషంగా గౌరవించాయి. 1966లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ గౌరవాలు అందుకున్నారు. 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2004లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును స్వీకరించారు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయాలు ఆమెను గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించింది. అన్నిటినీ మించి ఎంజిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భానుమతిగారిని తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్గాను, డైరెక్టర్గానూ (మూడు సంవత్సరాలు పదవీకాలం) నియమించి గౌరవించడం తనకో మరపురాని అనుభవంగా ఆమె చెప్పుకునేవారు.
చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫాల్కే పురస్కారం భానుమతికి లభిస్తుందని ఆమె అభిమానులు ఎదురు చూసేవారు. ఒక సందర్భంలో దాదాపు వచ్చినట్టే వచ్చి తప్పిపోయింది.
కేంద్రానికి దక్షిణాది వారంటే ఎప్పుడూ చిన్నచూపేనని, అర్హులైన వారెందరో అవార్డులు పొందలేక పోయారని, వాటి ప్రసక్తి వచ్చినప్పుడల్లా అనేవారు భానుమతి.
భానుమతి 1925లో సెప్టెంబర్ 7న అలనాటి గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలోని దొడ్డవరం గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. చిత్రరంగంలో ప్రవేశించి, అంచలంచెలుగా ఎదిగి, వివిధ విభాగాల్లో ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిస్తూ వివిధ భాషల్లో నటిస్తూ, అవార్డులు, రివార్డులు గెల్చుకుంటూ 1998 వరకు సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆమె భర్త, ప్రముఖ దర్శకులు పి.ఎస్. రామకృష్ణ 1984లో దివంగతులయ్యారు. ఏకైక కుమారుడు డా. భరణి ప్రస్తుతం వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు.
దేశ విదేశాల్లని అభిమానులను, చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేస్తూ భానుమతి 2005లో డిసెంబర్ 24న కీర్తిశేషులయ్యారు. ఆకాశవీధిలో మేఘమాలికలు హాయిగా ఎగిరేంత కాలం మనసుల మల్లెల మాలలూగుతున్నంత కాలం భానుమతి ఆటా, మాటా, పాటా మనల్ని ఉయ్యాల జంపాలలూగిస్తూనే ఉంటుంది.
- బి.కె. ఈశ్వర్
(సీనియర్ సినీ పాత్రికేయులు, రచయిత)
Updated Date - 2022-12-24T17:59:14+05:30 IST