Mothers Day: ‘అమ్మా.. నీ ప్రేమ సముద్రం’.. నెట్టింట వైరల్ అవుతున్న సుదర్శన్ పట్నాయక్ ట్వీట్..

ABN , First Publish Date - 2022-05-08T19:42:49+05:30 IST

Mothers Day శుభాకాంక్షలతో వాట్సాప్ హోరెత్తిపోతోంది. ట్విట్టర్ ఠారెత్తుతోంది. వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్స్, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అమ్మపై అభిమానాన్ని..

Mothers Day: ‘అమ్మా.. నీ ప్రేమ సముద్రం’.. నెట్టింట వైరల్ అవుతున్న సుదర్శన్ పట్నాయక్ ట్వీట్..

Mothers Day శుభాకాంక్షలతో వాట్సాప్ హోరెత్తిపోతోంది. ట్విట్టర్ ఠారెత్తుతోంది. వాట్సాప్ స్టేటస్‌లు, ట్వీట్స్, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా అమ్మపై అభిమానాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్లు చాటుకుంటున్నారు. అమ్మ ప్రేమను వర్ణిస్తూ సంద్రపు అలల సాక్షిగా సజీవ రూపాన్ని పోలిన సైకత శిల్పం నెట్టింట్లో తాజాగా వైరల్‌గా మారింది. ఆ సైకత శిల్పాన్ని రూపొందించింది మరెవరో కాదు. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. పూరీ సముద్ర తీరంలో ‘మదర్స్ డే’ సందర్భంగా ఆయన రూపొందించిన సైకత శిల్పం చాలా గొప్పగా ఉంది. నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.



తల్లి తనువులో తలదాచుకుంటున్న బిడ్డ, ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అమ్మ. ఇదీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ఆ సైకత శిల్పం వర్ణిస్తున్న విషయం. సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు ఎంత గొప్పగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భావాలకు రూపమంటూ ఉంటే ఇలానే ఉంటుందేమో అన్నంతలా ఆ సైకత శిల్పాల్లో జీవ కళ ఉట్టిపడుతుంటుంది. ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ పేద కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉన్న ఆయన పూరీ బీచ్‌లో సైకత శిల్పాలను రూపొందించడం ద్వారా గుర్తింపు పొందారు. ఆయన ఎదుగుదలకు కన్నతల్లి ఎంతో సహకరించారు.



అందుకే.. మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సుదర్శన్ పట్నాయక్ ‘నా ధైర్యానికి పునాది, నా స్పూర్తి, నాకు ప్రేరణగా నిలిచిన అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్ పట్నాయక్ ‘మదర్స్ డే’ సందర్భంగా రూపొందించిన ఈ సైకత శిల్పాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నీ ప్రేమ సముద్రం’ అని తల్లి ప్రేమను వర్ణిస్తూ ట్వీట్ చేశారు. బిడ్డలపై అమ్మ చూపించే అనురాగాన్ని సంద్రంతో పోల్చడం సబబుగానే అనిపించింది. సముద్రం ఎన్నో రహస్యాలను తన కడుపులో దాచుకున్నట్టుగా తల్లి కూడా ఎన్నో కష్టనష్టాలను తానే భరించి అన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. కన్నబిడ్డ వరకూ ఆ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.

Read more