Varsha Bollamma: జాదూ పిల్ల.. కెమెరా ముందు ఒకలా.. వెనుక మరోలా..
ABN, First Publish Date - 2022-12-04T12:39:17+05:30
టాలీవుడ్‌లో ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). యువ హీరోలు, లవ్ స్టోరీలకు వర్ష మంచి ఆప్షన్ అయింది.
టాలీవుడ్‌లో ఈమధ్య బాగా వినిపిస్తున్న పేరు వర్ష బొల్లమ్మ (Varsha Bollamma). యువ హీరోలు, లవ్ స్టోరీలకు వర్ష మంచి ఆప్షన్ అయింది. అందుకే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. కూర్గ్‌లో పుట్టినా... కట్టూ, బొట్టూ, మాటతీరుతో పదహారణాల తెలుగమ్మాయిలాగే కనిపిస్తుంది. తనకు నచ్చిన హీరోలు, సినిమాల గురించి చెప్పమంటే... ఇలా మనసు విప్పింది.
ఇద్దరూ ఒకటేనా..?
‘విజయ్ (Vijay Thalapathy) సర్‌తో కలిసి నటించే అవకాశం నా కెరీర్ ప్రారంభంలోనే వచ్చినందుకు గర్వంగా అనిపిస్తుంది. ‘బిగిల్’లో ఓ కీలక పాత్ర పోషించాను. ఆ సినిమా జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. సెట్లో విజయ్‌ని చూడడమే గొప్ప హోం వర్క్. ఆయన కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనుక ఒకలా ఉంటారు. ‘కట్’ చెప్పగానే కూల్‌గా ఓ పక్కన కూర్చుండిపోతారు. మొహంపై చిరునవ్వు మాత్రం చెదరదు. ‘యాక్షన్’ అనగానే ఆయనలో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఇద్దరూ ఒక్కటేనా, వేర్వేరా అనే అనుమానం కూడా వేస్తుంది. ‘బిగిల్’ సెట్లో చాలా అల్లరి చేసేదాన్ని. నన్ను విజయ్ సర్ ‘జాదూ’ అని పిలిచేవారు. నా కళ్లు పెద్దవిగా ఉంటాయి కదా అందుకే అలా పిలిచి ఉంటారు.’
పవర్‌కు అర్థం తెలిసింది..
‘తెలుగులో సినిమాలేం చేయకముందు నుంచీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గురించి వింటూనే ఉన్నాను. ఆయన్ని అంతా ‘పవర్ స్టార్’ అని పిలుచుకొంటారు. ఆయన సినిమాలు కొన్ని చూశా. కానీ థియేటర్లో చూసిన తొలి సినిమా ‘భీమ్లా నాయక్’. కాకినాడలోని ఓ థియేటర్లో ఆ సినిమా చూసినప్పుడు పవర్ స్టార్ అనే పదానికి అర్థం తెలిసింది. పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. నేను అంతకు ముందే తమిళ మాతృక చూశా. కానీ నాకెక్కడా ఆ సినిమా గుర్తుకు రాలేదు. ఓ కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. పవన్ వ్యక్తిత్వం గురించి, ఆయన సేవ గురించి చాలా విన్నాను. దాంతో ఆయనకు మరింత పెద్ద అభిమాని అయిపోయా.’
ఎంత క్యూటో..?..
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)కు నేను వీరాభిమానిని. తెలుగులో నాకు నచ్చే హీరో ఎవరంటే అతడి పేరే చెబుతా. ‘అర్జున్‌రెడ్డి’తో నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతగా ఆ సినిమా నచ్చింది. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. తెరపై కన్నా బయట ఇంకా బాగుంటారు. ఓసారి విజయ్ ఇంటి శుభకార్యానికి వెళ్లా. వెండితెరపై అతడి నటన ఫుల్ జోష్‌గా సాగుతుంది. బయట మాత్రం చాలా కూల్‌గా ఉంటారు. అతడి చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అది చాలా తక్కువమందిలో కనిపించే లక్షణం.’’
భలే నవ్వించాడు..
‘‘ఈమధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో ‘డీజే టిల్లు’ (DJ Tillu) బాగా నచ్చింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నా. అసలు ఆ కామెడీ టైమింగ్ సూపర్. నేనేదైనా వర్క్ టెన్షన్‌లో ఉంటే ‘డీజే టిల్లు’లో సీన్స్ గుర్తు చేసుకొంటా. అంతే... వెంటనే నవ్వొచ్చేస్తుంది. ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) చూసినప్పుడు నవీన్ పొలిశెట్టి నటననూ ఇంతే ఆస్వాదించా. నేను సినిమాని సినిమాలానే చూస్తా. నాకు హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేదు.’’
అంత వినయమా..?
‘‘విజయ్ సేతుపతి (Vijay Sethupathi)ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత గొప్ప ఇమేజ్ ఉన్న నటుడు, పెద్ద స్టార్... అంత సామాన్యంగా ఎలా ఉంటారా? అనిపిస్తుంది. ‘96’ సినిమా కోసం విజయ్ సేతుపతితో పది రోజులు వర్క్ చేశా. ‘అరె...అప్పుడే నా క్యారెక్టర్ అయిపోయిందా, ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండేది’ అనిపించింది. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకొన్నా. ఓసారి షూటింగ్ అయిపోయింది. విజయ్ సర్ కారవాన్‌లోకి వెళ్తుంటే... అభిమానులు గుంపుగా వచ్చారు. వాళ్లందరితో మాట్లాడి, రెండు గంటల పాటు ఫొటోలకు పోజులిచ్చారు. షూటింగ్‌లో ఎంత అలసిపోయినా ఆ అలసట ఆయన మొహం మీదకి రానివ్వలేదు. నాకు అప్పుడు తెలిసొచ్చింది విజయ్ సేతుపతి అంటే ఏమిటో..?’’.
Updated Date - 2022-12-04T13:00:44+05:30 IST