Rs 2000 Currency Notes: రూ.2000 నోట్లు ఏమైపోయాయ్.. అసలెందుకు కొత్తవి ముద్రించడం లేదంటే..!
ABN, First Publish Date - 2022-11-08T15:08:35+05:30
ఇటీవలి కాలంలో రూ.2000 నోటు చలామణి తగ్గింది. ఏటీఎమ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినా వాటిల్లో రూ.2000 నోట్లు ఉండడం లేదు. దీంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. రూ. 2,000 నోటు రద్దుపై గత మూడేళ్లుగా ఇలాంటి ఊహగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే రూ.2000 నోటు చలామణి కూడా తగ్గింది. ఏటీఎమ్ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినా వాటిల్లో రూ.2000 నోట్లు ఉండడం లేదు. దీంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్లు 1.6 శాతం మాత్రమే.
2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన ఆర్‌బీఐ.. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఏడాది క్రితమే గణాంకాలు బయటకు వచ్చాయి. దేశంలో రూ. 2 వేల నోట్లు సర్క్యులేషన్‌కు సరిపడా ఉన్నాయని, అందుకే ఆ నోటు ముద్రణను ఆపేశామని అప్పటి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ గతేడాది జనవరి 4న ప్రకటించారు. ఇక, రూ. 2,000 నోటు ఉంచడానికి ఉపయోగించే స్లాట్ (క్యాసెట్ అంటారు)లు ప్రస్తుతం చాలా ఏటీఎమ్‌లలో లేవని, వాటి స్థానంలో కొత్త రూ. 100 నోటు, రూ. 500 నోట్ల క్యాసెట్‌లు అమర్చారని సమాచారం.
రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్ చేయవద్దని బ్యాంకు అధికారులకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు కూడా అందినట్టు వార్తలు వస్తున్నాయి. రూ. 2000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2016-17తో పోల్చుకుంటే వీటి ముద్రణ 2019-20 నాటికి దాదాపు రెట్టింపు అయింది. బ్లాక్‌మనీని అరికట్టాలనే లక్ష్యంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ రూ.2000 నోట్ల ముద్రణను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి ప్రస్తుతం పూర్తిగా ఆపేసినట్టు తెలుస్తోంది. క్రమంగా మార్కెట్ నుంచి రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలని కూడా ఆర్బీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Updated Date - 2022-11-08T15:08:38+05:30 IST