Fastest shoes: ఈ బూట్లతో మీ నడక వేగం రెండున్నర రెట్లు పెరుగుతుంది..
ABN, First Publish Date - 2022-10-28T21:23:30+05:30
నడకలో వేగాన్ని పెంచే బూట్లను తయారు చేసిన అమెరికన్
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు, రైలు, లేదా ఇతర ప్రయాణ సాధనాలు వినియోగించాలి. అయితే.. ఈ ప్రయాణ సాధనాలతో ప్రమాదం జరిగే రిస్క్ ఎంతో కొంత ఉంటుంది. ఈ ప్రమాదావకాశాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ఓ అమెరికా వ్యక్తి రంగంలోకి దిగాడు. నడకలో వేగాన్ని పెంచే బూట్లను తయారు చేశాడు. పెన్సిల్వేనియాలో ఉండే జుంజీ జాంగ్ ఈ బూట్లను రూపొందించాడు. తాను స్థాపించిన స్టార్టప్ సంస్థ షిఫ్ట్ రోబోటిక్స్‌లో(Shift Robotics).. మూన్‌వాకర్స్(Moonwalkers) పేరిట వీటిని తయారు చేస్తున్నాడు. వీటి ధర సుమారు 1400 డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ.1.15 లక్షలు.
ఓ రోజు బైక్‌పై వెళుతున్న తనకు ప్రమాదం జరగడంతో ఇలాంటి బూట్లు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్లేవారికి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ కాబట్టి.. ఇలాంటి బూట్లు తయారు చేశానని చెప్పుకొచ్చాడు. బ్యాటరీతో నడిచే చక్రాలను ఈ బూట్ల కింద ఏర్పాటు చేయడంతో వీటిని ధరించిన వారి నడకలో వేగం పెరుగుతుంది. పది కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాలంటే ఈ బూట్లకు గంటన్నర పాటు చార్జింగ్ పెడితే సరిపోతుందట. స్కేటింగ్ షూల మాదిరి తయారు చేసిన ఈ బూట్లు ధరిస్తే నడక మరింత సులభమవుతుందని అతడు తెలిపాడు.
Updated Date - 2022-10-28T21:44:00+05:30 IST