Croatia : బ్రెజిల్‌కు షాక్
ABN, First Publish Date - 2022-12-10T00:50:03+05:30
తొంభై నిమిషాలు హోరాహోరీ.. అదనపు సమయంలోనూ ఇరు జట్లు నువ్వా..నేనా..అనేలా తలపడ్డాయి.. అయితే బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ గోల్‌కొట్టి
షూటౌట్‌లో క్రొయేషియా కమాల్
సెమీస్‌లో ప్రవేశం
తొంభై నిమిషాలు హోరాహోరీ.. అదనపు సమయంలోనూ ఇరు జట్లు నువ్వా..నేనా..అనేలా తలపడ్డాయి.. అయితే బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ గోల్‌కొట్టి ప్రతిష్ఠంభనకు తెరదించాడు..ఓ పక్క బ్రెజిల్ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఆనందం..ఇక తమ జట్టు సెమీస్‌కు ఖాయమే అనే ధీమా వారిలో..కానీ గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా డీలా పడలేదు..ఉత్కంఠను అదిమిపట్టి ఆ జట్టు గోల్ చేయడంతో పోటీ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది..అయితే మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో బ్రెజిల్ పలు గోల్ అవకాశాలను వమ్ము చేసిన క్రొయేషియా కీపర్ లివకోవిచ్ షూటౌట్‌లో అంతకంటే అమోఘంగా బంతిని పట్టేశాడు..ఫలితం క్రొయేషియా సగర్వంగా సెమీ్‌సలో ప్రవేశించింది.. దీంతో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ కన్నీరుమున్నీరవుతూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అల్ రయాన్ (ఖతార్) : ఈసారి వరల్డ్ కప్ తొలి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ యావత్ ఫుట్‌బాల్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. అటు బ్రెజిల్-ఇటు క్రొయేషియా తగ్గేదేలే అనేలా తలపడడంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ నిర్ణీత సమయానికి గోల్స్ లేకుండా ముగిసింది. దాంతో అదనపు సమయానికి దారితీయగా..అందులో తొలుత బ్రెజిల్ గోల్ చేసి ఆధిక్యం చూపింది. ఆ వెంటనే క్రొయేషియా కూడా గోల్ కొట్టడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారి తీసింది. అయితే జపాన్‌తో రౌండ్-16 మ్యాచ్‌లో షూటౌట్‌లో సూపర్ సేవ్‌లు చేసిన క్రొయేషియా కీపర్ లివకోవిచ్ ఈసారీ అదే తీరులో జట్టును ఆదుకున్నాడు. దాంతో షూటౌట్‌లో క్రొయేషియా 4-2తో బ్రెజిల్‌కు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బ్రెజిల్ తరపున నెమార్ (105+1) గోల్ సాధించగా..పెట్కోవిచ్ (117) క్రొయేషియాకు గోల్ అందించాడు. తొలి అర్థభాగంలో ఇరు జట్లు పదేపదే ప్రత్యర్థి పోస్టులపై దాడికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఫౌల్స్ కూడా ఎక్కువగా చోటుచేసుకున్నాయి. 20వ నిమిషంలో అయితే వినిసియస్ జూనియర్ బ్రెజిల్‌కు తొలి గోల్ అందించినంత పని చేశాడు. పెనాల్టీ ఏరియాలో రిచర్లీసన్ అందించిన పాస్‌ను వినిసియస్ బలంగా తన్నినా ప్రత్యర్థి డిఫెండర్ బంతిని కాలితో ఆపడంతో చక్కటి చాన్స్ మిస్సయింది. ఇక ద్వితీయార్థం కొద్దిసేపటికే సెల్ఫ్‌గోల్ ప్రమాదం నుంచి క్రొయేషియా బయటపడింది. తర్వాత కాస్త దూకుడు పెంచిన క్రొయేషియా 62వ నిమిషంలో బ్రెజిల్ బాక్సు నుంచి పెరిసిచ్ సంధించిన క్రాస్ షాట్ కీపర్ అలీసన్ చేతిలోకి వెళ్లిపోయింది. 66వ నిమిషంలో క్రొయేషియా కీపర్ లివకోవిచ్ మరోసారి అద్భుత రీతిలో బ్రెజిల్‌ను గోల్ చేయకుండా నిలువరించాడు. 82వ నిమిషంలో బ్రెజిల్‌కు మరో సువర్ణావకాశం తప్పిపోయింది. రిచర్లీసన్ హెడర్ క్రొయేషియా గోల్‌పోస్ట్ మీదుగా వెళ్లిపోయింది.
77 నెమార్ చేసిన అంతర్జాతీయ గోల్స్ సంఖ్య. బ్రెజిల్ దిగ్గజం పీలే ఆల్‌టైం రికార్డును అతడు సమం చేశాడు.
Updated Date - 2022-12-10T00:50:04+05:30 IST