Achanta Sharath Kamal: నా బయోపిక్‌కు విక్కీ కౌశల్ ఓకే: శరత్ కమల్
ABN, First Publish Date - 2022-12-04T18:45:50+05:30
బాలీవుడ్ మొదలు కొని ఇటీవల చాలా చిత్ర పరిశ్రమలు ఒకే మూసలో కొట్టుకుపోయాయి. దాదాపు అన్ని చిత్రపరిశ్రమలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ మొదలు కొని ఇటీవల చాలా చిత్ర పరిశ్రమలు ఒకే మూసలో కొట్టుకుపోయాయి. దాదాపు అన్ని చిత్రపరిశ్రమలు బయోపిక్‌లపై పడ్డాయి. దీంతో ప్రేక్షకులపై వరుసగా ‘జీవిత చరిత్ర’లు వచ్చిపడ్డాయి. వీటిలో కొన్ని బాక్సాఫీసులను కొల్లగొడితే, మరికొన్ని చతికిలపడ్డాయి. ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాల్లో ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘భాగ్ మిల్కా భాగ్’, ‘నీరజ్’, ‘మేరీ కోమ్’, ‘సర్బ్‌జీత్’, ‘డర్టీపిక్చర్’, ‘పాన్‌సింగ్ తోమర్’, ‘దంగల్’, ‘83’, ‘మేజర్’, ‘సంజు’, ‘గంగుబాయి కథియావాడి’, ‘సైనా’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. బయోపిక్‌లు కాబట్టి వీటిపై ఆసక్తి సహజంగానే ఉంటుంది.
దేశం గర్వించదగ్గ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ (Achanta Sharath Kamal) తాజాగా దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు’ అందుకున్నాడు. ఈ ఏడాది ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కరాన్ని అందుకున్నాడు. శరత్ కమల్ తాజాగా మాట్లాడుతూ.. తన బయోపిక్‌ను కనుక సినిమాగా తీస్తే అందులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఓ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడికి అత్యున్నత క్రీడా పురస్కారం దక్కడం చాలా గొప్ప విషయమని, నాలుగేళ్ల కాలంలో ఓ క్రీడాకారుడు చేసిన అత్యుత్తమ ప్రదర్శనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు శరత్ కమల్ పేర్కొన్నాడు.
Updated Date - 2022-12-04T18:45:52+05:30 IST