FIFA World Cup : జెయింట్ కిల్లర్ జపాన్ జర్మనీకి ఝలక్
ABN, First Publish Date - 2022-11-24T01:28:48+05:30
ఫిఫా వరల్డ్‌క్‌పలో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చిన రెండోరోజే.. నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని మరో ఆసియా జట్టు జపాన్ దిమ్మదిరిగే
2-1తో ఆసియా జట్టు అద్భుత విజయం
ఫిఫా వరల్డ్‌కప్
దోహా: ఫిఫా వరల్డ్‌క్‌పలో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్ అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చిన రెండోరోజే.. నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని మరో ఆసియా జట్టు జపాన్ దిమ్మదిరిగే దెబ్బ కొట్టింది. గ్రూప్-ఈలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 1-2తో జపాన్ చేతిలో కంగుతింది. 11వ ర్యాంకర్ జర్మనీతో పోల్చితే 24వ ర్యాంకర్ జపాన్ పసికూనే. మెగా కప్ రికార్డులు కూడా ఏమంత గొప్పగా లేవు. కానీ, గోల్‌తో వెనుకబడినా.. ‘సమురాయ్’ స్ఫూర్తితో పోరాడిన జపాన్.. లేటు గోల్స్‌తో జెయింట్ కిల్లర్‌గా ప్రకంపనలు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ తరపున గోల్స్ చేసిన రిట్సు డోయన్, టకుమా అసానోలిద్దరూ జర్మనీ క్లబ్‌ల తరఫున ఆడుతుండడం విశేషం. గత వరల్డ్‌క్‌పను ఓటమితో ఆరంభించిన జర్మనీ.. ఈసారి కూడా తొలిమ్యాచ్‌లోనే ఓడింది. 33వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గుండొగాన్ గోల్‌గా మలచగా.. జపాన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు డోయన్ (75వ), టకుమా (83వ) గోల్స్ సాధించారు. ఖతార్‌లో వివక్షలకు వ్యతిరేకంగా ఆర్మ్ బ్యాండ్‌లు ధరించాలని జర్మనీ సహా ఏడు జట్లు భావించాయి. అయితే, ఫిఫా హెచ్చరికతో ఆ నిర్ణయంపై వెనక్కితగ్గాయి. ఈ నేపథ్యంలో ఫిఫాను విమర్శిస్తూ.. జర్మనీ ఆటగాళ్లు మ్యాచ్ ముందు గ్రూప్ ఫొటోలో నోటిని చేతితో మూసి నిరసన వ్యక్తం చేశారు.
వెనుకబడినా.. పట్టువదలకుండా..: భారీ అంచనాలతో బరిలోకి దిగిన జర్మనీ.. ఆరంభం నుంచే బంతిపై ఆధిపత్యం ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగానే పదేపదే జపాన్ పోస్టుపై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచింది. అయితే, ప్రత్యర్థి కీపర్ షుయ్‌చి గోండా అప్రమత్తతతో.. జర్మనీకి నిరాశ తప్పలేదు. కానీ, 31వ నిమిషంలో జపాన్ పెనాల్టీ ఏరియాలో గుండొగాన్‌ను షుచి అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో.. రెఫరీ పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని గుండొగాన్ గోల్‌గా మలచడంతో జర్మనీ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత దాడుల ఉధృతి పెంచినా గోల్ మాత్రం సాధించలేక పోయిన జర్మనీ.. ఫస్టా్‌ఫను సానుకూలంగానే ముగించింది. ఇక, సెకండా్‌ఫలో కూడా బంతిని ఎక్కువగా తమ ఆధీనంలో ఉంచుకొన్న ఐరోపా టీమ్.. పదేపదే జపాన్ డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. అయితే, 57వ నిమిషంలో అసానో సబ్‌స్టిట్యూట్‌గా రావడంతో జపాన్ దాడుల పదును పెరిగింది. 70వ నిమిషంలో జర్మనీ.. నాలుగు గోల్ ప్రయత్నాలను షుయ్‌చి అమోఘంగా అడ్డుకోవడం హైలైట్. కాగా, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిట్సు.. 75వ నిమిషంలో అద్భుతం చేశాడు. మినమోటో షాట్‌ను జర్మనీ కీపర్ మాన్యువల్ అడ్డుకున్నా.. రీబౌండ్‌ను డోయన్ గోల్‌లోకి పంపి స్కోరు సమం చేశాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే జర్మనీపై టకుమా అసానో పిడుగులా పడ్డాడు. 83వ నిమిషంలో లాంగ్‌బాల్‌ను అందుకొన్న టకుమా మెరుపు వేగంతో కదులుతూ జర్మనీ శిబిరంలో కలకలం సృష్టించాడు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను తప్పించుకొంటూ.. గోల్ పోస్టు సమీపం నుంచి బంతిని నెట్‌లోకి పంపి విన్నింగ్ గోల్ సాధించాడు. అప్పటికే అలసి పోయినట్టుగా కనిపించిన జర్మన్లు.. పెద్దగా ప్రతి దాడి చేసేందుకు ప్రయత్నించలేదు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ చారిత్రక ఓటమిని నమోదు చేయగా జపాన్ నాకౌట్ అంచనాలను మెరుగుపరచుకొంది.
వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఓడడం
జర్మనీకిది మూడోసారి. 1982లో అల్జీరియా చేతిలో, 2018లో మెక్సికో చేతిలో జర్మనీ పరాజయం పాలైంది.
Updated Date - 2022-11-24T01:28:49+05:30 IST