England : ఇంగ్లండ్ సూపర్
ABN, First Publish Date - 2022-12-06T01:03:38+05:30
ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మెగా టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఆ జట్టు ఆ దిశగా ఇంకో అడుగువేసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో హ్యారీ కేన్
సెనెగల్‌పై ఘన విజయంతో క్వార్టర్స్‌లో ప్రవేశం
వరల్డ్ కప్‌లలో హ్యారీ కేన్ చేసిన గోల్స్
అల్ ఖోర్ (ఖతార్): ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మెగా టోర్నీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్న ఆ జట్టు ఆ దిశగా ఇంకో అడుగువేసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో హ్యారీ కేన్ సేన 3-0తో సెనెగల్‌పై సునాయాసంగా గెలిచింది. హెండర్సన్ (39 ని.), హ్యారీ కేన్ (45+3), బుకాయో సాకా (57) ఇంగ్లండ్‌కు గోల్స్ సాధించారు. ఇక ఈనెల 10న జరిగే క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటుంది. కాగా..ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ ఈసారి ప్రపంచ కప్‌లో తన గోల్స్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తరపున కేన్‌కిది 52వ గోల్‌కాగా.. ఆల్‌టైమ్ గోల్స్ స్కోరర్ వేన్ రూనీ (53) రికార్డును సమం చేసేందుకు హ్యారీ అడుగు దూరంలో ఉన్నాడు. అయితే మేజర్ టోర్నీలలో అంటే వరల్డ్ కప్, యూరోలలో అత్యధిక గోల్స్ చేసిన ఇంగ్లండ్ దిగ్గజ స్ట్రయికర్ గ్యారీ లినేకర్ (10) రికార్డును కేన్ (11) బద్దలుగొట్టాడు. తొలి అర్ధ భాగంలో ప్రత్యర్థి గోల్‌పో్‌స్టపై దాడి చేయడంలో ఇంగ్లండ్ ఒకింత తడబడగా ఆఫ్రికన్ చాంపియన్ సెనెగల్ మాత్రం దూకుడు ప్రదర్శించి ఒకటి రెండు అవకాశాలను దక్కించుకుంది. కానీ 39వ నిమిషంలో పలువురు ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకొన్న కేన్ బంతిని హెండర్సన్‌కు అందించాడు. ప్రత్యర్థి గోల్‌పోస్ట్ ముందు బంతిని దొరకబుచ్చుకున్న హెండర్సన్ ఎడమ కాలితో దాన్ని నెట్‌లోకి పంపించడంతో ఇంగ్లండ్ 1-0తో నిలిచింది. దాంతో దూకుడు పెంచిన ఇంగ్లండ్ తొలి భాగం అదనపు సమయంలో మరో గోల్ కొట్టింది. తమ భాగంలో బంతిని అందుకున్న బెలింగ్‌హామ్ ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ ఫోడెన్‌కు పాస్ చేశాడు. ఫోడెన్ దానిని కేన్‌కు అందివ్వగా అతడు నింపాదిగా బంతిని నెట్‌లోకి కొట్టాడు. ఇక 57వ నిమిషంలో బాక్సు ఎడమవైపు నుంచి ఫోడెన్ ఇచ్చిన పాస్‌ను సాకా పొరపాటుకు తావులేకుండా గోల్‌పోస్టులోకి పంపడంతో ఇంగ్లండ్ 3-0తో తిరుగులేని స్థితిలో నిలిచింది.
Updated Date - 2022-12-06T01:03:47+05:30 IST