T20 World Cup: సూపర్-12లో బెస్ట్ మ్యాచ్‌లు ఇవే!
ABN, First Publish Date - 2022-11-07T15:26:48+05:30
టీ20 పురుషుల ప్రపంచకప్ 2022 (t20 world cup)లో ఈసారి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి..
మెల్‌బోర్న్: టీ20 పురుషుల ప్రపంచకప్ 2022 (t20 world cup)లో ఈసారి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మ్యాచ్‌లన్నీ చివరి బంతి వరకు ఉత్కంటభరితంగా సాగాయి. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టాయి. పసికూనలుగా పిలుచుకునే జట్లు కూడా అద్భుత పోరాట పటిమ కనబరచడమే కాదు.. పెద్ద జట్లను సైతం ఓడించి శభాష్ అనిపించుకున్నాయి. రౌండ్-1లోనే వెస్టిండీస్ వెనుదిరగడం ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో సూపర్-12లో జరిగిన బెస్ట్ మ్యాచ్‌లు ఏవో ఐసీసీ వెల్లడించింది. మొత్తం 8 మ్యాచ్‌లను అత్యుత్తమమైనవిగా పేర్కొంది.
అందులో నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఒకటి. ఈ పోరుకు జాబితాలో అగ్రస్థానం లభించింది. దక్షిణాఫ్రికా (south africa)ను ఓడించిన నెదర్లాండ్స్ (netheralands) ఆ జట్టు సెమీస్ అవకాశాలను కాలరాసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే బహుశా ఇది బిగ్ షాక్. ఆ జట్టుకు ఇది అదృష్టవశాత్తు దక్కిన విజయం కాదు. వైట్‌బాల్ మ్యాచుల్లో ఆ జట్టు ఇటీవల అద్భుతంగా రాణిస్తోంది. జాబితాలో ఆ తర్వాతి స్థానంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. ఇది బెస్ట్ మ్యాచ్ మాత్రమే కాదు.. థ్రిల్లింగ్ మ్యాచ్ కూడా. విజయం చివరి బంతి వరకు చేతులు మారి చివరికి భారత్‌కు దక్కింది. ప్రపంచకప్ చరిత్రలో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (virat kohli) ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ ఇన్నింగ్స్ అతడి కెరియర్‌లోనే అత్యద్భుంగా నిలిచింది.
మూడోది ఐర్లాండ్-ఇంగ్లండ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ (england) ఆశలను వరుణుడు వమ్ము చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం డక్‌వర్త్ లూయిస్ విధానంలోకి మారగా, ఐర్లండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఇంగ్లండ్‌కు భారీ షాకిచ్చింది. కెప్టెన్ బాల్‌బిర్నీ (62) క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు జోషువా లిటిల్ అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టడంతో ఇరిష్ జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్థాన్-జింబాబ్వే మ్యాచ్‌కు స్థానం దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ ఒక సంచలనం. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన పాకిస్థాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ రజా దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రజా.. చేజింగ్‌లో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకోకుండా పాక్‌కు అడ్డుకట్ట వేశాడు.
ఈ జాబితాలో బంగ్లాదేశ్-జింబాబ్వే మ్యాచ్ ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అతి కష్టం మీద మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. చివరి ఓవర్లలో చెలరేగిపోయి ఆస్ట్రేలియా చేతుల నుంచి విజయాన్ని దాదాపు లాగేసుకున్నంత పనిచేశాడు. రషీద్ ఖాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
సౌతాఫ్రికా-ఇండియా మ్యాచ్‌కు ఏడో స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్ భారత్‌ను పరాజయం నుంచి కాపాడలేకపోయింది. సూర్య ఈ మ్యాచ్‌లో 40 పరుగుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. భారత్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యాన్నిదక్షిణాఫ్రికా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక, ఈ జాబితాలో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చివరి స్థానం దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏకంగా 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ బ్యాటర్ కాన్వే ఈ మ్యాచ్‌లో శివాలెత్తాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 92 పరుగులు చేశాడు. 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
Updated Date - 2022-11-07T15:46:28+05:30 IST