Ishan Kishan: వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్.. ఇంకెవరూ సాధించలేదు
ABN, First Publish Date - 2022-12-10T21:20:50+05:30
బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో టీమిండియా (Bangladesh Vs India) 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
చట్టొగ్రామ్: బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో టీమిండియా (Bangladesh Vs India) 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. 85 బంతుల్లో మొదటి సెంచరీ పూర్తిచేసిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. 23 బౌండరీలు, 9 సిక్సర్ల సాయంతో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ ముగించేసి టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా డబుల్ సెంచరీ సాధించిన ఈ యంగ్‌బ్యాట్స్‌మెన్ పలు రికార్డులను చెరిపేశాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..
వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (chris gayle) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వరల్డ్ రికార్డును ఇషాన్ కిషన్ తుడిపేశాడు. 2015 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై క్రిస్ గేల్ 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. బంగ్లాదేశ్‌పై కేవలం 128 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్.. గేల్ రికార్డును అధిగమించాడు. ఏకంగా 12 బాల్స్ ముందుగానే డబుల్ సెంచరీ బాదేసి శెబాష్ అనిపించుకున్నాడు. మరోవైపు డబుల్ సెంచరీ కొట్టిన పిన్నవయస్కుడిగానూ కిషన్ రికార్డ్ నెలకొల్పాడు. అంతేకాదు.. వన్డేల్లో భారత్ తరపున డబుల్ సెంచరీలు సాధించిన సచిన్ తెందుల్కర్, విరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మల జాబితాలో ఇషాన్ కిషన్ చేరాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన 7వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత ఆటగాళ్లు మినహా డబుల్ సెంచరీలు కొట్టిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, పాకిస్తాన్ క్రికెటర్ ఫఖార్ జమాన్ ఉన్నారు. కాగా రోహిత్ శర్మ ఒక్కడే ఏకంగా మూడు డబుల్ సెంచరీలు కొట్టడం గమనార్హం.
Updated Date - 2022-12-13T16:10:02+05:30 IST