Croatia : జపాన్ షూటౌట్
ABN, First Publish Date - 2022-12-06T01:06:03+05:30
ఫిఫా ప్రపంచకప్‌లో రన్నరప్ క్రొయేషియా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టగా.. వీరోచితంగా పోరాడిన ఆసియా సింహం జపాన్ నాకౌటైంది.
కాపాడిన లివకోవిచ్
క్వార్టర్స్‌లో క్రొయేషియా
ఫిఫా వరల్డ్‌కప్
అల్ వఖ్రా (ఖతార్): ఫిఫా ప్రపంచకప్‌లో రన్నరప్ క్రొయేషియా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టగా.. వీరోచితంగా పోరాడిన ఆసియా సింహం జపాన్ నాకౌటైంది. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో 1-1తో స్కోరు సమం కాగా.. షూటౌట్లో క్రొయేషియా 3-1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. మూడు పెనాల్టీలను అడ్డుకొన్న క్రొయేషియా కీపర్ డొమినిక్ లివకోవిచ్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. నిర్ణీత సమయంలో జపాన్ ఆటగాడు డెయ్జెన్ మయేడా (43వ) గోల్ చేయగా.. క్రొయేషియా తరఫున ఇవాన్ పెరిసిచ్ (55వ) గోల్ సాధించాడు.
హోరాహోరీగా..: మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లూ దీటుగానే తలపడ్డాయి. అయితే, బంతిపై ఆధిపత్యంలో క్రొయేషియా కొంత పైచేయి సాధించినా.. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై జపాన్ కలవరపెట్టగలిగే దాడులు చేసింది. మూడో నిమిషంలోనే ఆసియా జట్టుకు సువర్ణావకాశం లభించినా.. షోగో తనిగుచి కొట్టిన హెడర్ గురి తప్పింది. ఆ తర్వాత క్రొయేషియా క్రమంగా దాడుల ఉధృతిని పెంచి.. జపాన్ రక్షణ పంక్తిని ఒత్తిడికి గురి చేసింది. ఈ క్రమంలో 8వ నిమిషంలో గోల్ చేసినంత పనిచేసింది. గోల్ పోస్టు దగ్గర నుంచి ఇవాన్ పెరిసెక్ కొట్టిన కిక్‌ను జపాన్ కీపర్ షుయ్చి గోండా అడ్డుకున్నాడు. అయితే, రీబౌండ్ అయిన బంతిని అండ్రేజ్ క్రమారిక్ గోల్ చేసే ప్రయత్నం చేసినా.. ప్రత్యర్థి డిఫెండర్లు వమ్ముచేశారు. అనంతరం జపాన్ కొన్ని దాడులు చేసినా సఫలం కాలేదు. మరోవైపు క్రొయేషియాకు కూడా రెండు ఫ్రీకిక్లు లభించినా.. గోల్ చేయలేక పోయింది. అయితే, ఫస్టాఫ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ప్రతిష్ఠంభనను జపాన్ బద్దలు కొట్టింది. 43వ నిమిషంలో షార్ట్ కార్నర్ కిక్‌ను అందుకొన్న డోయన్ సంధించిన క్రాస్‌ను యోషిడా తలతో కొట్టగా.. బంతిని క్లియర్ చేయడంలో కొంత గందరగోళం నెలకొంది. అయితే, పొంచి ఉన్న మయేడా మెరుపు వేగంతో స్పందించి.. పవర్ఫుల్ కిక్‌తో బంతి గోల్‌లోకి పంపాడు. సమీక్షించిన తర్వాత గోల్‌గా ప్రకటించడంతో జపాన్ 1-0 ఆధిక్యంతో బ్రేక్‌కు వెళ్లింది.
సమం చేసిన పెరిసెచ్: సెకండా్ఫను దూకుడుగా ఆరంభించిన క్రొయేషియా.. పది నిమిషాల్లోనే స్కోరు సమం చేసింది. 55వ నిమిషంలో డెజాన్ లోవర్న్ క్రాస్‌ను.. పెరిసెచ్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌కి పంపాడు. ప్రతిగా కౌంటర్ ఎటాక్ చేసిన జపాన్ మరో గోల్ చేసినంత పని చేసింది. వాటారు కొట్టిన కిక్‌ను లివకోవిచ్ గాల్లోకి ఎగురుతూ బయటకు నెట్టేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి గోండా కూడా సూపర్ సేవ్ చేసి.. క్రొయేషియాకు గోల్ దక్కకుండా చేశాడు. 63వ నిమిషంలో 24 మీటర్ల దూరం నుంచి లూకా మోద్రిచ్ కొట్టిన కిక్.. గోల్ పోస్టు కుడివైపు పైమూలగా దూసుకొస్తుండగా.. గోండా గోల్‌లోకి ఎగురుతూ పంచ్ ఇచ్చాడు. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ మరో గోల్ సాధించక పోవడంతో.. మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. 105వ నిమిషంలో మిటోమా కొట్టిన కిక్‌ను క్రొయేషియా కీపర్ లివకోవిచ్ సమర్థంగా అడ్డుకోగా.. క్రొయేషియా కూడా సువర్ణాకాశాన్ని చేజార్చుకోడంతో మ్యాచ్ ఫలితం షూటౌట్‌కు దారి తీసింది.
Updated Date - 2022-12-06T01:06:04+05:30 IST