T20 World Cup: 2024 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్టు 12 జట్లు ఇవే!
ABN, First Publish Date - 2022-11-07T12:46:38+05:30
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (t20 world cup) ముగింపు దశకు చేరుకుంది
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (t20 world cup) ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 16 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు జట్లు.. న్యూజిలాండ్, పాకిస్థాన్, భారత్,ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు మినహా చాలా వరకు మ్యాచ్‌లు చివరి ఉత్కంఠభరితంగా సాగాయి. టీ20లోని అసలైన మజాను ప్రేక్షకులకు అందించాయి. చిన్న జట్లు కూడా అద్భుతంగా ఆడడమే కాకుండా హేమాహేమీలనదగ్గ జట్లను మట్టికరిపించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో 2024 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లు ఏవో ఒకసారి చూద్దాం.
2024 ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్ (west indies), అమెరికా (USA) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ఏడాది నుంచి అర్హతకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. వీటిలో 8 జట్లు ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024కు ఆతిథ్యమివ్వనున్న వెస్టిండీస్, యూఎస్ఏ జట్లు ఆటోమెటిక్‌గానే అర్హత సాధించాయి. విండీస్ జట్టు ఈసారి క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే 18 నెలలు ఈ జట్టుకు చాలా కీలకం. వచ్చే టోర్నీలోనూ ఇలాంటి అనుభవం ఎదురుకాకుండా ఉండాలంటే ఆ జట్టు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సి ఉంటుంది.
సూపర్-12లోని టాప్-8 జట్లు
ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్, ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు 2024 టోర్నమెంటులోకి నేరుగా ప్రవేశించనున్నాయి. ఇక, గ్రూప్-1లోని ఆస్ట్రేలియా, శ్రీలంక, గ్రూప్-2లోని దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు టీ20 ప్రపంచకప్‌కి నేరుగా అర్హత సాధించాయి. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో సౌతాప్రికాను కంగుతినిపించి దాని సెమీస్ అవకాశాలను దెబ్బతీసిన నెదర్లాండ్స్ గ్రూప్-2లో బంగ్లాదేశ్ కంటే పైన నిలవడం గమనార్హం. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించడంతో పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది.
పైన పేర్కొన్న 10 జట్లతోపాటు మరో రెండు జట్లు టీ20 ప్రపంచకప్ 2024కు నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9, 10 స్థానాల్లో ఉన్న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు కూడా టీ20 ప్రపంచకప్ 2024 ఎడిషన్‌కు నేరుగా క్వాలిఫై అయ్యాయి. మిగతా 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
Updated Date - 2022-11-07T12:46:38+05:30 IST