New Zealand vs India: ఒక్క రన్ తక్కువవ్వడంతో మ్యాచ్ టై.. సిరీస్ మనదే..
ABN, First Publish Date - 2022-11-22T16:28:51+05:30
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) సీరిస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ టైగా (Tied) ముగిసింది.
నేపియర్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (India Vs NewZealand) సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ టైగా (Tied) ముగిసింది. భారత బ్యాటింగ్ 9 ఓవర్లు ముగిశాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎంతసేపు నిరీక్షించినప్పటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS) మ్యాచ్ టైగా ముగిసినట్టు వెల్లడించారు. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. 9 ఓవర్లలో 76 పరుగులు చేసుంటే భారత్ విజేతగా నిలిచేది. కానీ ఒక్క రన్ తక్కువగా 75 పరుగులే చేయడంతో టైగా ముగిసినట్టు ఇరు జట్ల కెప్టెన్లకు అంపైర్లు వెల్లడించారు. నాలుగు వికెట్లతో రాణించిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. రెండవ మ్యాచ్‌లో భారీ శతకంలో మెరిసిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సీరిస్’ అవార్డ్ దక్కింది. కాగా ఈ ఫలితంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ కైవశం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండవ మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.
161 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఆరంభంలో తడబడ్డారు. 21 పరుగులకే కీలకమైన 3 వికెట్లు చేజార్చుకున్నారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (11), రిషబ్ పంత్ (11) మరోసారి తీవ్రంగా నిరాశపరించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 13 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ధాటిగా ఆడి 18 బంతుల్లోనే 30 పరుగులు కొట్టాడు. అతడికి దీపక్ హుడా (9) కాస్త సహకారం అందించాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 75 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి 2 వికెట్లు, ఆడమ్ మిల్నే 1 వికెట్ చొప్పున తీశారు.
కాగా సిరీస్ నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు అద్భుతంగా రాణించారు. ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌ను (NewZealand vs India) భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. ముఖ్యంగా పేసర్లు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj), అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి కివీస్ బ్యాటర్లను పెవీలియన్ పంపించారు. దీంతో 19.4 ఓవర్లలోనే 160 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 161 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని న్యూజిలాండ్ నిర్దేశించింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్: ఫిన్ అలెన్ (3), డెవోన్ కాన్వే (59), మార్క్ చాప్‌మ్యాన్ (12), గ్లెన్ ఫిలిప్స్ (54), డారిల్ మెచెల్ (10), జేమ్స్ నీషమ్ (0), మెచెల్ సాంట్నర్ (1), ఆడమ్ మిల్నే (0), ఇషా సోధి (0), టిమ్ సౌథీ (), లూకీ ఫెర్గుసన్ () చొప్పున పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. మహ్మద్ సిరాజ్ ఒక రనౌట్ కూడా చేశారు.
Updated Date - 2022-11-22T16:43:07+05:30 IST