ఉరుగ్వే ... నెగ్గినా ఇంటికే
ABN, First Publish Date - 2022-12-03T03:57:42+05:30
పాపం..ఉరుగ్వే..చావో రేవో మ్యాచ్‌లో కసిదీరా ఆడింది. గ్రూప్ ‘హెచ్’లో శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 2-0తో ఘనాను చిత్తు చేసింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో పోర్చుగల్-దక్షిణ కొరియా జట్ల మధ్య
అల్ వక్రా (ఖతార్): పాపం..ఉరుగ్వే..చావో రేవో మ్యాచ్‌లో కసిదీరా ఆడింది. గ్రూప్ ‘హెచ్’లో శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 2-0తో ఘనాను చిత్తు చేసింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో పోర్చుగల్-దక్షిణ కొరియా జట్ల మధ్య పోరు డ్రా దిశగా సాగుతుండడంతో తాము రౌండ్-16కు చేరడం ఖాయమని ఉరుగ్వే సంబ రపడింది. కానీ ఇంజ్యూరీ టైంలో గోల్ కొట్టిన దక్షిణ కొరియా 2-1తో పోర్చుగల్‌కు షాకివ్వడంతో ఉరుగ్వే మీద పిడుగుపడినట్టయింది. దాంతో 2-0తో గెలుస్తే చాలుననుకంటే..మరో గోల్ ఉరుగ్వే కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే మ్యాచ్ చివరి దశకు రావడంతో ఉరుగ్వే ఇంకో గోల్ చేసేందుకు మరింత దూకుడుగా ఆడింది. ఈక్రమంలో ఆ జట్టుకు కొన్ని గోల్స్ అవకాశాలు లభించినా..ప్రత్యర్థి కీపర్ అమోఘంగా అడ్డుకున్నాడు. చివరకు ఉరుగ్వే గెలిచినా..గ్రూప్ దశనుంచే వెనుదిరగడంతో ఆ జట్టు తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్టార్ ఆటగాడు సువారెజ్..తన చివరి వరల్డ్ కప్‌లో జట్టు కనీసం నాకౌట్‌కు కూడా చేరకపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఉరుగ్వే మిడ్‌ఫీల్డర్ డి అరసెటా (26, 32ని) రెండు గోల్స్‌తో మెరిశాడు. కాగా.. మ్యాచ్ ముగిసే సమయంలో..కనీసం వీఆర్‌ఏ పరిశీలించకుండా తమ పెనాల్టీ కిక్ డిమాండ్‌ను రెఫరీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఉరుగ్వే ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దాంతో మ్యాచ్ ముగిసి మైదానం వీడే సమయంలో ఆ రెఫరీపై జట్టు ప్లేయర్లు దాడి చేసినంత పని చేశారు. ఇక...ఆరు పాయింట్లతో గ్రూప్ ‘హెచ్’ టాపర్‌గా పోర్చుగల్ తదుపరి రౌండ్‌కు చేరింది. దక్షిణకొరియా, ఉరుగ్వే చెరో నాలుగేసి పాయింట్లతో ఉన్నా.. ఎక్కువ గోల్స్ చేసిన కొరియా (4 గోల్స్) జట్టు ఉరుగ్వే (2 గోల్స్)ను వెనక్కు నెట్టి నాకౌట్‌లో అడుగుపెట్టింది. ఉరుగ్వేతోపాటు ఘనా (3 పాయింట్లు) టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.
Updated Date - 2022-12-03T03:57:43+05:30 IST