PT Usha : ఐఓఏ పీఠంపై ఉష
ABN, First Publish Date - 2022-11-28T00:38:36+05:30
దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువుకాగా..అధ్యక్ష పదవికి 58 ఏళ్ల ఉష తప్ప ..
ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న దిగ్గజం
ఉపాధ్యక్షునిగా గగన్ నారంగ్
న్యూఢిల్లీ: దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆదివారం తుది గడువుకాగా..అధ్యక్ష పదవికి 58 ఏళ్ల ఉష తప్ప మరెవరూ నామినేషన్ వేయలేదు. డిసెంబరు 10న జరిగే ఎన్నికలకు ఉష బృందం తరపున వివిధ పోస్టులకు 14 మంది నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవి మినహా ఇతర పోస్టులకు మొత్తం 24 మంది నామినేషన్లు వేశారు. ఇక, ఉపాధ్యక్ష పదవి (పురుషుల కేటగిరి)కి మాజీ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు. ఈ పదవి నారంగ్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. ఇక మరో ఉపాధ్యక్ష పదవి (మహిళల కేటగిరి)కి మాత్రం రాజలక్ష్మి సింగ్, అలకనంద అశోక్ పోటీపడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఒలింపిక్ పతక రెజ్లర్ యోగేశ్వర్ దత్, వెటరన్ ఆర్చర్ డోలా బెనర్జీ పోటీలేకుండా ఎన్నికవనున్నారు. ఆసియా క్రీడల్లో పలు పతకాలు సాధించిన ఉష.. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా, ఒలింపియన్‌గా, అంతర్జాతీయ పతక విజేతగా రికార్డు సృష్టించనుంది. అంతేకాదు.. మహరాజా యాదవేంద్ర సింగ్ (1938-60) తర్వాత ఈ పదవి స్వీకరించనున్న మొదటి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉషనే.
Updated Date - 2022-11-28T00:38:38+05:30 IST