BRS: 18 మంది బీఆర్ఎస్ సర్పంచుల రాజీనామా
ABN, First Publish Date - 2022-12-28T13:06:06+05:30
కొమరం భీం జిల్లా: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమచేసిన నిధులు ఖాళీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమచేసిన నిధులు ఖాళీ అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇతర ఖర్చులకు వాడుకుంది. దీంతో సర్పంచులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చి గ్రామాల అభివృద్ధిపనులు చేయిస్తోందని, గ్రామపంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలేదని, తాము అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. కేంద్రం నేరుగా పంచాయతీల ఖాతాల్లో నిధులు జమచేస్తే.. దానికి సంబంధించిన డిజిటల్ కీని ప్రభుత్వం తన వద్దనే ఉంచుకుని ఆ నిధులను వాడుకునేందుకు వీలులేకుండా చేసిందని సర్పంచులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, వాంకిడి మండలంలో 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
గ్రామ పంచాయతీల నిర్వహణకు తాము విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని భావించిన కేంద్రం.. ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరిపించి అందులో నేరుగా 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుండడంతో నిధుల విడుదలకు జాప్యం జరిగింది. కేంద్ర నిధులు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరగానే.. ఆ నిధులు సర్పంచుల ప్రమేయం లేకుండానే మండలస్థాయి అధికారులు డ్రా చేయడం వివాదంగా మారింది.
జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ స్థాయి అధికారుల సూచనలతో తమ ప్రమేయం లేకుండానే మండలస్థాయి అధికారులు డిజిటల్ కీ సహాయంతో చెక్కులను జారీ చేసినట్లు సర్పంచులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీలకు రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు సక్రమంగా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల కాలేదన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కోరారు. నిధులను తిరిగి ఖాతాల్లో జమచేయాలని లేఖ రాశారు.
Updated Date - 2022-12-28T13:06:10+05:30 IST