Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా
ABN, First Publish Date - 2022-11-07T14:16:53+05:30
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ (Bhuvanagiri MP) కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానని తెలిపారు. తారిక్ ఆన్వర్ ఆందుబాటులో లేరని చెప్పారు. ప్రస్తుతానికి తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇచ్చినప్పుడు పాదయాత్రలో ఎలా పాల్గొంటానని ఆయన ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు (Munugode) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్ధికి కేవలం పదివేల మెజార్టీయే వచ్చింది.
తన సోదరుడి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా సహకరించారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని పట్టించుకోలేదని, హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. మునుగోడు ఫలితాల్లో స్రవంతికి డిపాజిట్లు కూడా దక్కలేదు. వెంకట్‌రెడ్డి పరోక్షంగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకే స్రవంతికి అనుకూలంగా ప్రచారం చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంకట్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని వెంకట్‌రెడ్డి చెబుతున్నారు కానీ ఆయనపై నేడో రేపో వేటు పడే అవకాశం కూడా ఉంది. తమ్ముడి తరహాలోనే వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని ఆయన ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
Updated Date - 2022-11-07T14:20:14+05:30 IST