ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లాలు లేక.. ధాన్యం ఆరబెట్టలేక!

ABN, First Publish Date - 2022-10-30T23:50:21+05:30

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోతలు మొదలవ్వగా కొనుగోళ్లు సైతం ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో ముందుకు సాగని కల్లాల నిర్మాణం

- నిర్మాణంపై ఆసక్తి చూపని రైతులు

- అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం

- ఇప్పటి వరకు నిర్మించినవి 980 మాత్రమే

- జిల్లాకు మంజూరైనవి 2,130

కామారెడ్డి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోతలు మొదలవ్వగా కొనుగోళ్లు సైతం ప్రారంభమయ్యాయి. పంట సాగుకు తగ్గట్టుగానే లక్షల మెట్రిక్‌ టన్నులలో ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. ధాన్యానికి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం వస్తేనే నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. అయితే ధాన్యాన్ని ఆర బెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలు లేకపోవడంతో పంట పొలాల్లో, కొనుగోలు కేంద్రాల్లో, రహదారులపైననో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో ఏ ప్రధాన రహదారి వైపు వెళ్లినా ధాన్యం రాసులే కుప్పలు తెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి. అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసి ముద్దవడమే కాకుండా వరదల తాకిడికి కొట్టుకుపోతున్న పరిస్థితి ఎదురవుతోంది. రైతులు ధాన్యాన్ని ఆరబోసేందుకు ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో, రోడ్లపై ఆరబోస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ప్రాణాలు పోతున్న సంఘటనలు సైతం ఉన్నాయి. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కల్లాల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.

ముందుకు కదలని కల్లాల నిర్మాణం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన రైతు కల్లాల నిర్మాణాలు జిల్లాలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో కల్లాల నిర్మాణాల కోసం వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అయితే వీటి నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతో ఈజీఎస్‌ అధికారులు కల్లాల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో సుమారు 2,400 కల్లాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 2,130 మంజూరు చేసింది. ఇందులో 2,090 కల్లాల నిర్మాణాలకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 980 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో పాటు చైతన్య పరచడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

నిర్మించిన వాటికి అందని బిల్లులు

రైతు కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తు అందించడంలో చూపిన శ్రద్ధ వాటి నిర్మాణాలను చేపట్టడంలో రైతులు చూపడం లేదు. కల్లాల కొలతలను బట్టి ఒక్కోదానికి రూ.55 వేలు, రూ.65 వేలు, రూ.75 వేలుగా నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత రైతు బ్యాంక్‌ ఖాతాలోనే జమ చేస్తారు. ఇందులో ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90శాతం బిల్లులు వస్తున్నాయి. అయితే ముందుగా సొంత ఖర్చులతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో కల్లాల నిర్మాణానికి కొందరు రైతులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. సొంత డబ్బులతో నిర్మాణాలు చేపట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 980 కల్లాల నిర్మాణాలు అయ్యాయి. ఇందులో చాలా మంది రైతులు తమ సొంత డబ్బులతో మొదట నిర్మించుకున్నారు. బిల్లుల కోసం దరఖాస్తులు పెట్టుకున్న చాలా మందికి బిల్లులు మంజూరు కావడం లేదని బాధిత రైతులు చెబుతున్నారు. దీంతో మిగితా రైతులు కల్లాల నిర్మాణానికి ముందుకు రావడం లేదనే వాదన వినిపిస్తోంది.

ఆసక్తి చూపని రైతులు

కల్లాల నిర్మాణంపై అవగాహన లేకపోవడం, నిర్మించిన వాటికి సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరు కావాల్సి ఉండడంతో నిర్మాణం పూర్తయినా సకాలంలో డబ్బులు రావనే అనుమానంతో రైతులు అనాసక్తి చూపుతున్నారు. కొంతమంది రైతులు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్న సర్వే నెంబర్‌ ఆధారంగా నిర్ధేశించిన ప్రదేశాల్లోనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేనిచోట నిర్మాణాలు చేపడితే ఉపయోగం ఏమిటని గమ్మున ఉండిపోతున్నారు. ఇంటి వద్దే నిర్మాణానికి అనుమతించాలని కోరుతుండగా దరఖాస్తులో పేర్కొన్న సర్వే నెంబర్‌లోనే నిర్మాణాలను చేపట్టాలని అధికారులు మెలిక పెడుతున్నారు. రైతులు దరఖాస్తుల్లో పేర్కొన్న భూములు దూర ప్రాంతాల్లో ఉండడం, చాలా మంది రైతుల భూముల్లోకి నిర్మాణ మెటీరియల్‌ వెళ్లే దారి సౌకర్యం కూడా లేదు. దీంతో జిల్లాలో కల్లాల నిర్మాణ లక్ష్యం నెరవేరడం లేదు. దరఖాస్తు సమయంలోనే రైతులకు అన్ని విషయాలు స్పష్టంగా వివరించకపోవడంతో మంజూరై ఉన్న వాటి నిర్మాణాలు సైతం మొదలు పెట్టడం లేదు.

Updated Date - 2022-10-30T23:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising