Kavitha: హారిక ఐదేళ్ల ఎంబిబిఎస్కు అయ్యే ఖర్చు భరిస్తా-కవిత
ABN, First Publish Date - 2022-11-09T13:00:41+05:30
హైదరాబాద్: యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారిక కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
హైదరాబాద్: యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ (Nizamabad) జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారిక (Harika)కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి కవిత ఎంబిబిఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు.
చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని కవిత చెప్పారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబిబిఎస్ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
కవిత తన చదువుకు ఆర్థికంగా అండగా నిలిచినందుకుగాను హారికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత గారు సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునoదిస్తానని హారిక అన్నారు.
నిజామాబాద్‌కు చెందిన హారిక యూట్యూబ్‌లోనే క్లాసులు విని ఏకంగా ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంక్ సాధించింది. జిల్లా కేంద్రంలోని నామ్‌దేవ్‌వాడకు చెందిన సతీ్‌షకుమార్, అనురాధల కుమార్తె హారిక. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో.. తల్లి బీడీ కార్మికురాలి (beedi worker) గా పని చేస్తూ కూతురిని చదివించింది. హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్లో 942 మార్కులు సాధించింది. ఇంటర్ తర్వాత నీట్లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇంట్లోనే యూట్యూబ్‌లో వీడియో క్లాసులు వింటూ నీట్‌కు సిద్ధమైంది. నీట్లో జాతీయ స్థాయిలో 40వేల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే ఉండిపోయింది. హారిక ఆర్థిక పరిస్థితి గురించి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. విషయం తెలుసుకున్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆమె చదువు బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, ఎంబీబీఎస్ చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2022-11-09T13:06:16+05:30 IST