CM KCR : గట్టెక్కినా.. గడ్డుకాలమే!

ABN , First Publish Date - 2022-11-07T03:42:52+05:30 IST

సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక. బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఎదురైన మునుగోడు అగ్నిపరీక్షలో అధికార టీఆర్‌ఎస్‌ గెలిచింది. కానీ, ఈ గెలుపు వారు ఊహించిన

CM KCR : గట్టెక్కినా.. గడ్డుకాలమే!
CM KCR

పదునైన వ్యూహాలు.. సర్వశక్తులూ ఒడ్డడంతోనే ఒడ్డుకు..

సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు.. ప్రభుత్వం నుంచి పార్టీ వరకు..

నెలరోజులు మునుగోడుపైనే.. అయినా యువతలో వ్యతిరేకత!

సంక్షేమ పథకాలతో లభించిన ఆసరా అంతంతమాత్రమే..

కారు అంచనాలు తారుమారు.. అత్తెసరు మెజారిటీతో సరి

సాధారణ ఎన్నికల్లో మునుగోడు మంత్రాంగం అసాధ్యం..

భవిష్యత్తు పరిణామాలపై గులాబీ నేతల్లో కలవరం!

హైదరాబాద్‌/నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక. బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ స్థాయికి వెళ్లాలనుకుంటున్న తరుణంలో ఎదురైన మునుగోడు అగ్నిపరీక్షలో అధికార టీఆర్‌ఎస్‌ గెలిచింది. కానీ, ఈ గెలుపు వారు ఊహించిన గెలుపేనా? ఉప ఎన్నికలో దక్కిన మెజారిటీతో ఆ పార్టీ సంతృప్తిగా ఉందా? అంటే లేదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. భారీ విజయం సాధించి సత్తా చాటాలని, ప్రజలు తమవైపే ఉన్నారనే సంకేతాలను బలంగా ఇవ్వాలని గులాబీ శిబిరం భావించగా.. అందుకు విరుద్ధంగా అత్తెసరు మెజారిటీయే రావడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక వచ్చీరావడంతోనే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఆయన వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ వామపక్షాలను దరిచేర్చుకోవడం. మునుగోడులో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీఐకి, దానికితోడు సీపీఎంకు అక్కడ ఉన్న ఓటుబ్యాంకు గురించి సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్‌.. వారి మద్దతు సాధిండమే తొలి పనిగా పెట్టుకుని దానిని పూర్తిచేశారు. ఆ తర్వాత ఎన్నికల కదన రంగంలోకి పార్టీ యంత్రాంగం మొత్తాన్ని దించేశారు. ప్రచార వ్యూహాల్లోనూ ప్రత్యర్థులకు అందనంద ఎత్తులో ఆలోచించారు. కేంద్ర పెద్దలు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారు తప్ప.. మునుగోడు ప్రజలకు ఇచ్చిందేంటి? అన్న దగ్గర మొదలుపెట్టి.. చివరకు అనూహ్యంగా ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం బట్టబయలు చేసేదాకా తీసుకెళ్లారు.

ఎంత చేయాలో అంత చేసినా..

మునుగోడులోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో 80 శాతం మందిని కారెక్కించేశారు. ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో డబ్బు, మద్యం ఏరులై పారింది. పథకాలకు కొత్త నిబంధనలొచ్చాయి. నగదు నేరుగా బదిలీ జరిగిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు అంతా నెలరోజులపాటు మునుగోడుపైనే దృష్టి పెట్టారు. అత్యధికులు అక్కడే మకాం వేశారు. అధికార యంత్రాంగం, ఉద్యోగ సంఘాల మద్దతు ఉంది. వీటన్నింటికితోడు ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం దొరికింది. ఇలా సర్వశక్తులు ఒడి పనిచేస్తే చివరకు హమ్మయ్య గట్టెక్కాం అనే ఊరట మాత్రమే లభించింది. గెలుపు గెలుపే అయినా.. దానిని తరచిచూస్తే మాత్రం ముందున్నది గడ్డుకాలమేనని స్పష్టమవుతుంది. వచ్చే సాధారణ ఎన్నికల రేసులో కారు అప్రతిహతంగా దూసుకుపోయేంత అవకాశం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. మునుగోడులో 30-40 వేల మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావించినా.. 10వేలకు మాత్రమే పరిమితమైంది. ఇంత డబ్బు, ఇంతమంది నేతలను మోహరించడం వల్లే ఆమాత్రమైనా వచ్చిందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తేడా వచ్చేదని ఓ అమాత్యుడు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బీజేపీకి ఆ స్థాయిలో ఓట్లు రావడం, హోరాహోరీగా పోటీ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో టీఆర్‌ఎస్‌ పట్ల కొంత వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ప్రీపోల్‌ సర్వేల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. వారిని మార్చాలని టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కాలేదు.

సంక్షేమ పథకాల ప్రభావం ఎంతమేరకు!

ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల స్పందన అంత అనూహ్యంగా ఏమీ లేదని మునుగోడు ఫలితాన్ని చూస్తే అర్థమవుతోంది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు సుమారు 2.41 లక్షల మంది కాగా, అందులో 2.38 లక్షల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులేని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఇదే విషయాన్ని లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి చెప్పింది. గొర్రెలు, మేకల యూనిట్ల కోసం ఈ ఉప ఎన్నిక సమయంలోనే నేరుగా నగదు ఇచ్చే అంశానికి తెరతీసింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.1,31,250 నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రతి పథకం కింద ఉన్న బకాయిలను విడుదల చేశారు. ఇలా అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులు కలిసి 2.38 లక్షల మంది వరకు ఉన్నారని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కానీ, అందులో సగం ఓట్లు కూడా ఆ పార్టీకి రాలేదు. అంటే సంక్షేమ పథకాలనేవి ఎప్పుడూ ఉండేవే కదా! అని ప్రజలు భావిస్తున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.

సాధారణ ఎన్నికల్లో హోరాహోరీనే!

మునుగోడులో పెట్టినంత ఫోక్‌సను సాధారణ ఎన్నికల్లో పెట్టడం అసాధ్యం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గంలోవారు తమ విజయం కోసం పనిచేసుకోవాల్సి ఉంటుంది. మునుగోడులో జరిగింది ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నిక కావడంతో వందల కోట్ల ఖర్చుకు కూడా వెనుకాడలేదు. కానీ, సాధారణ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదు. వామపక్షాలకు ఇక్కడున్నంత బలం అత్యధిక నియోజకవర్గాల్లో ఉండదు. మరోవైపు వ్యూహాత్మకమో, ఆకస్మికమోగానీ ప్రత్యర్థి పార్టీని మానసికంగా ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం వంటివి సాధారణ ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. ఈ పరిస్థితులు భవిష్యత్తుపై కొంత ప్రమాద హెచ్చరికలే జారీ చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

ఇంతగా శ్రమిస్తే..

మునుగోడులో ఎంత చేయాలో అంత చేసినా తమకు అత్తెసరు మెజారిటీయే రావడం భవిష్యత్తు పరిణామాలపై ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటుండడం గమనార్హం. వాస్తవానికి గతంలో ఎన్నడూలేని రీతిలో మునుగోడులో సీఎం కేసీఆర్‌ రెండుసార్లు బహిరంగ సభ నిర్వహించారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో 700 నుంచి 1000 ఓట్ల వరకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యేకు బాధ్యతను అప్పగించారు. వారు తమ ఎంపీటీసీ పరిధిలో 15 రోజుల పాటు ప్రచారం చేశారు. వారి ప్రచార ఖర్చులన్నింటినీ హైకమాండ్‌ భరించింది. ఎంపీటీసీ పరిధిలో బాధ్యతలు తీసుకున్న నేతలు 50 శాతం ఓట్లు కారు గుర్తుకు నమోదయ్యేలా పనిచేయకపోతే చర్యలు తప్పవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఇచ్చే మొత్తానికి తోడు మంత్రులు అదనంగా ఓటుకు రూ.1000, మద్యం అందజేశారని తెలుస్తోంది. చివరిలో 90శాతం మంది ఓటర్లకు ఓటుకు రూ.3వేల చొప్పున, కొన్నిచోట్ల రూ.4వేలు చొప్పున పంపిణీ చేశారని ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో ఓటుకు నోటు కీలక పరిణామంగా మారడాన్ని గమనించిన పార్టీ పెద్దలు పోలింగ్‌కు ముందు గంట వరకు అదనంగా మరో రూ.2వేలు ప్రతి ఓటరుకు పకడ్బందీగా గంటల వ్యవధిలోనే అందజేయగలిగారు. మరోవైపు నియోజకవర్గంలో సుమారు 15 వేల ఓటుబ్యాంకు ఉన్న సీపీఎం, సీపీఐ నేతలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ప్రచారం నిర్వహించగా.. వారి ఖర్చులన్నింటినీ టీఆర్‌ఎస్‌ పార్టీ సమకూర్చింది. ఏ అంశంలోనూ రాజీపడకుండా గులాబీదళం పనిచేసింది. 10వేల మెజారిటీతో ఒక వ్యక్తిని గెలిపించుకునేందుకు ఇన్ని ఇబ్బందులు పడితే సాధారణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి? అన్న చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది.

Updated Date - 2022-11-07T03:42:52+05:30 IST

Read more