ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు
ABN, First Publish Date - 2022-10-27T02:05:19+05:30
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అన్ని మండలాల పరిధిలో ధాన్యం నిల్వలకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 458 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అన్ని మండలాల పరిధిలో ధాన్యం నిల్వలకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలను ఉంచడంతో పాటు కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా కావాల్సిన గన్ని బ్యాగులు సమకూరుస్తున్నారు. నెలన్నర రోజుల్లో 80 శాతానికి పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక నాయకులు, అధికారులతో కేంద్రాల ప్రారంభం
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా మునుగోడు ఉప ఎన్నికల్లో బిజీగా ఉండడంతో స్థానికంగా ఉన్న అధికారులు, చైర్మన్‌లతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. జిల్లాలో వరి కోతలు మొదలుపెట్టి సుమారు 25 రోజులు దాటిపోవడం, చాలా గ్రామాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. జిల్లాలో అన్ని గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధరకు కొనుగోలు చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ఏగ్రేడ్ ధాన్యాన్ని క్వింటాలు 2060 రూపాయలకు, కామన్ రకం బీగ్రేడ్ ధాన్యాన్ని 2040 రూపాయలకు కొనుగోలు చేయనున్నారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగానే తేమశాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని సేకరించనున్నారు. తేమ 17 శాతంలోపు ఉన్న ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నారు. రైతులు ఆరబోసిన ధాన్యాన్ని తీసుకువచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
నిల్వలు ఉన్న గ్రామాల్లో మొదట కొనుగోళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 458 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొ దట ధాన్యం నిల్వలు ఉన్న గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీల ద్వారా కేంద్రాలను ప్రారంభిస్తారు. కొన్ని ప్రాంతాల్లో డీసీఎంఎస్, మార్కెట్ కమిటీలు, మెప్మా సంఘాల ద్వారా కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నారు. మొదట అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడంతో పాటు ధాన్యం ఎక్కువగా ఉన్న గ్రామాల పరిధిలో కొనుగోలును వేగవంతం చేయనున్నారు. దొడ్డు రకాలతో పాటు సన్న రకాలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. ఆయా ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీలకు కావాల్సిన గన్ని బ్యాగులు ఇప్పటికే పంపించగా ధాన్యం నిల్వలకు అనుగుణంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో పది లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల, రెవెన్యూ, సహకార, వ్యవసాయశాఖ, రవాణాశాఖలతో పాటు పోలీసు, లీగల్ మెథడాలజి శాఖల సమన్వయంతో చేపడుతున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు టోకెన్‌లు ఇవ్వ డంతో పాటు తేమశాతం ఉండేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 320 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించడంతో పాటు ఆ మిల్లుల వద్ద అన్‌లోడ్ సమయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక అధికారులను మిల్లుల వద్ద నియమించారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు అన్‌లోడ్ కాగానే ట్రక్ షీట్‌లను ఆయా కొనుగోలు కేంద్రానికి పంపించేవిధంగా ఏర్పాట్లు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారంలోపు డబ్బులు జమ అయ్యేవిధంగా చర్యలను చేపడుతున్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే పలు దఫాలు అధికారులతో సమీక్షించా మన్నారు. రైతులు కూడా సహకరించి ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేస్తామని తెలిపారు.
Updated Date - 2022-10-27T02:05:30+05:30 IST