యాసంగి ప్రణాళిక ఖరారు!
ABN, First Publish Date - 2022-11-16T00:31:38+05:30
జిల్లాలో యాసంగి సాగుకు నీటి విడుదల కోసం సాగునీటిశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే శివమ్ కమిటీ అనుమతులు తీసుకుని నీటి విడుదలకు చర్యలు చేపట్టనున్నారు.
మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారుల నిర్ణయం
ప్రయోగాత్మకంగా కాళేశ్వరం 21 ప్యాకేజీ ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు
నిజామాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి సాగుకు నీటి విడుదల కోసం సాగునీటిశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో జరిగే శివమ్ కమిటీ అనుమతులు తీసుకుని నీటి విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా తాగునీటి బోర్డు సమావేశాన్ని నిర్వహించి రైతులకు అవసరమైన సమయంలో విడతల వారీగా నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు సమావేశాలు పూర్తయిన తర్వాత డిసెంబరులో యాసంగి సాగుకు చే యనున్నారు. ఈ యాసంగిలో కొత్తగా 21 ప్యాకేజీ కింద పైప్‌లైన్‌ల ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటి ని అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సాగునీటికి అధికారుల కసరత్తు
జిల్లాలో యాసంగి సాగు మొదలైంది. ఆరుతడి పంటలను సాగుచేస్తున్న వరి పంట సాగు మొదలుపెట్టగానే సాగునీటిని అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని శ్రీరామ్‌సాగర్, గుత్ప, అలీసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద మొ త్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటితో పాటు రామడుగు ప్రాజెక్టు కింద సాగునీటిని అందించేందుకు నిర్ణయించారు. జిల్లాలోని ప్రధాన చెరువుల ద్వారా నీటి విడుదలను చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు నిర్ణయించారు. మొత్తం యాసంగి సాగుకోసం ప్రణాళికలు రూపొందించిన అధికారులు నీటి వనరుల కింద సుమారు 3లక్షల ఎకరాల వరకు సాగునీటిని అందించేందుకు నిర్ణయించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షా 20వేల ఎకరాల వరకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. బోధన్ డివిజన్ పరిదిలో వరిసాగు ముందే మొదలుపెట్టనున్నందున ఈ నెలాఖరులోపు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. గుత్ప, అలీసాగర్ కింద ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించనున్నారు. లక్ష్మి, కాకతీయ కాల్వల కింద కూడా మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులో రిజర్వాయర్‌లు ఫుల్లుగా ఉండడంతో నీటి లభ్యతకు ఇబ్బందులు లేనందున మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా జిల్లా సాగునీటిశాఖ అధికారులు ఈ ప్రణాళికను ఖరారు చేస్తూ ఈ వారం చివరలో హైదరాబాద్‌లో జరిగే శివం కమిటీ సమావేశంలో ఈ ఆయకట్టుకు సాగునీరు విడుదలపైన అనుమతులు తీసుకోనున్నారు. శివం కమిటీలో ఆమోదం తెలిపిన తర్వాత ఉమ్మడి జిల్లా సాగునీటి సలహాబోర్డు సమావేశాన్ని నిర్వహించి ఆయకట్టును ఖరారు చేస్తారు. జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలంలో వర్షాలు బాగా పడడం వల్ల మొత్తం ఆయకట్టుకు నీటి అవసరం ఏర్పడలేదు. యాసంగిలో వానాకాలం రాగానే వరి సాగు 4లక్షల ఎకరాల వరకు సాగుకానుండడంతో సాగునీటిశాఖ అధికారులు ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
10వేల ఎకరాలకు సాగునీరు
జిల్లాలో ప్రాజెక్టుల కిందనే కాకుండా ఈ దఫా 20,21 కాళేశ్వరం ప్యాకేజీ కింద 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు నిర్ణయించారు. సారంగాపూర్ పంప్‌హౌజ్‌ల ద్వారా నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఎత్తిపోసి మెంట్రాజ్‌పల్లి నుంచి పం పుల ద్వారా 10వేల ఎకరాలకు యాసంగిలో సాగునీటిని అందించనున్నారు. సారంగాపూర్‌లో 3 పంపుల నిర్మాణం పూర్తికావడం, మెంట్రాజ్‌పల్లిలో పంపుల పనులు అయిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వగానే ఈ దఫా 10వేల ఎకరాలకు సాగునీటిని అందించి వచ్చే వానాకాలం మరింత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరుని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో యాసంగిలో సాగునీటిని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని చీఫ్ ఇంజనీర్ మధుసూదన్‌రావు తెలిపారు. శివం కమిటీ, సాగునీటి బోర్డు సమావేశం తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. యాసంగిలో ఆన్ ఆఫ్ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2022-11-16T00:31:40+05:30 IST